అటకెక్కిన నీటి పరీక్ష కిట్లు
ప్రజలకు కలుషిత నీరే దిక్కు
- వేసవిలో కృష్ణపట్టె గ్రామాల్లో పొంచి ఉన్న ముప్పు
- చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
- నెరవేరని ప్రభుత్వ లక్ష్యం
రక్షితనీటి పథకాల ద్వారా ప్రజలకు సరఫరా చేసే నీరు కలుషితం కాకుండా తద్వారా వ్యాధులు ప్రభలకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆరు నె లల క్రితం జిల్లాలోని ప్రతి గ్రామానికి నీటి పరీక్ష కిట్లు అందజేసింది. గ్రామీణ నీటిసరఫరా శాఖ ఆధ్వర్యంలో సంబంధిత సిబ్బందికి పలుమార్లు శిక్షణ కూడా ఇచ్చారు. శిక్షణపొందిన ఫీల్డ్ అస్టెంట్‌లు గ్రామాలను సందర్శించాలి. ఆయా గ్రామాలకు చెందిన ఆరోగ్యశాఖ ఏఎన్‌ఎంలు, గ్రామ పంచాయతీ సిబ్బంది సాయంతో స్థానికంగా ఉన్న చేతి పంపులు, బావులు, బోర్లలోని నీటిని పరీక్షించాలి. వాటి ఫలితాన్ని బట్టి ఆనీటిని గ్రామస్తులు వాడవచ్చా.. లేదా అనేది నిర్ధారించాలి. నీటిని పరీక్ష చేయగా వచ్చిన ఫలితాలను రికార్డు చేయాలి. నీరు కలుషితం, ఫ్లోరిన్‌శాతం అధికంగా ఉంటే ఆబోరుపై రెడ్ కలర్‌తో మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసిన బోర్లలో నీటిని వాడకానికి నిషేధిస్తారు. ఇది నిత్యం జరగాల్సిన పని. కానీ ఎక్కడా జరుగుతున్న దాఖలాలు లేవు.
మూలనపడ్డ నీటి పరీక్ష కిట్లు
నీటి పరీక్ష విధానం క్షేత్రస్థాయిలో ఎక్కడా సక్రమంగా అమలైన దాఖలాలు లేవు. నీటి పరీక్ష కిట్లు గ్రామ పంచాయతీల్లోనే, ప్రజాప్రతినిధుల ఇళ్లలోనే మూలకు పడి దర్శనమిస్తున్నాయి. గ్రామస్థాయిలో పని చేస్తున్న సిబ్బంది ఇటువైపు చూసిన పాపాన పోలేదు. వీరిపై ఉన్నతస్థాయిలో పర్యవేక్షణ కూడా లేకపోయింది. గ్రామ పంచాయతీ కార్మికులే రక్షిత నీటి పథకాల్లో బ్లీచింగ్ పౌడర్ కలిపి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
పొంచి ఉన్న అంటువ్యాధులు
దామరచర్ల మండలంలోని కృష్ణపట్టె గ్రామాల్లో తాగునీటి కలుషితం వల్ల వ్యాధులు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా ఇర్కిగూడెం, తాళ్ల వీరప్పగూడెం, ముదిమాణిక్య, చిట్యాల, నడిగడ్డ, కల్లెపల్లి, వర్లీపలాలెం గ్రామాల ప్రజలు తాగునీటి కోసం కృష్ణా నదిపైనే ఆధారపడతారు. వేసవికాలం కావడంతో నదిలో నీటి మట్టం పడిపోతుంది. అదే నీటిని గ్రామాలకు నేరుగా పంపింగ్ చేస్తుంటారు. దీంతో కలుషిత నీటిని ఆయా గ్రామాల ప్రజలు తాగడం వల్ల డయోరియా, కలరా తదితర వ్యాధులకు గురయ్యే అవకాశం లేకపోలేదు. అదే నీటిని పరీక్షల కిట్టుతో టెస్ట్ చేసి సురక్షితమని గుర్తిస్తే వాటిని తాగకుండా నియంత్రించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చు. ఇప్పటికైనా ఆర్‌డబ్ల్యూఎస్, ఆరోగ్యశాఖ, గ్రామ పంచాయతీ సిబ్బంది సమన్వయంతో పని చేసి నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని పలువురు కోతున్నారు.