కేరళకు విరాళం : ఫేస్బుక్ ఎంత ఇచ్చిందో తెలుసా?
తిరువనంతపురం : ప్రకృతి విలయతాండవానికి కకావికలమైన కేరళీయులను ఆదుకునేందుకు.. ప్రపంచమంతా కదలివస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి... దిగ్గజ కంపెనీలు, వ్యాపారవేత్తలు, సినిమా సెలబ్రిటీలు తోచినంత సహాయం చేస్తూ కేరళ ప్రజలను ఆదుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కేరళ కోసం భారీ ఎత్తున్న విరాళాల సేకరణ జరుగుతోంది. వారికి కావాల్సిన దుస్తులు, ఆహారాన్ని కూడా సహాయక బృందాలు, ఎన్జీవోల ద్వారా తరలిస్తున్నారు. కేరళ బాధితుల కోసం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కూడా తన వంతు విరాళంగా 2,50,000 డాలర్లను అంటే 1.75 కోట్ల రూపాయలను ప్రకటించింది. వీటిని వరదల్లో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల బాధితులకుఅందజేయనున్నట్టు పేర్కొంది. కమ్యూనిటీ రెసిలియన్స్ ఫండ్ గూంజ్ ద్వారా ఈ నగదును విరాళంగా అందజేస్తున్నట్టు తెలిపింది. ఇది ఢిల్లీకి చెందిన లాభాపేక్షలేని సంస్థ.
గత కొన్ని రోజులుగా ఫేస్బుక్, కమ్యూనిటీతో కలిసి ప్రజలకు సహకరిస్తోంది. కకావికలమైన కేరళలో తమవంతు సహాయ సహకారాలు అందించేందుకు లైవ్, క్రియేటింగ్ పేజీ, జాయినింగ్ కమ్యూనిటీ, ఫండ్స్ సేకరణ వంటి ఫీచర్లను ప్రజల ముందుకు తీసుకొచ్చినట్టు ఫేస్బుక్ అధికార ప్రతినిధి చెప్పారు. ఫేస్బుక్ యూజర్లు కూడా కేరళకు ఫండ్స్ అందజేయడానికి ఈ సోషల్ మీడియా ద్వారా గ్రూప్‌లు, లైవ్ వీడియోలు, పేజీలను నిర్వహిస్తున్నారు. ఈ నిధులను వరద ప్రకోపానికి భారీగా ప్రభావితమైన వాటికి తరలిస్తున్నారు. ఆగస్టు 8 నుంచి కురుస్తున్న వర్షాలు దైవభూమి అయిన కేరళను అల్లకల్లోలం చేశాయి. కేరళ చరిత్రలో ఇంతటి ప్రకృతి బీభత్సాన్ని మరెన్నడూ చూడలేదు. ఇప్పటి వరకు లక్షల మంది నిరాశ్రయులు కాగ, 300మందికి పైగా మరణించారు.
ఫేస్బుక్లో గ్రూప్‌లు క్రియేట్ చేస్తున్న వారు, బాధితుల ఎక్కడెక్కడ ఉన్నారో రెస్క్యూ టీమ్‌లకు తెలియజేయడంతో పాటు, వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. రవాణా, వైద్య సేవలను కూడా చేపడుతున్నారు. ఆగస్టు 9న ఫేస్బుక్ ‘సేఫ్టీ చెక్’ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. దీని ద్వారా బాధితుల స్నేహితులు, కుటుంబ సభ్యులు వారు సురక్షితంగా ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు. ‘హెల్ప్ అండ్ క్రిసిస్ డొనేట్ బటన్’ను కూడా సోషల్ మీడియా దిగ్గజం తన ప్లాట్‌ఫామ్‌పై ఉంచింది. ఈ ఫీచర్ ద్వారా 1300కు పైగా పోస్టులు షేర్ అయ్యారు. ఈ పోస్టుల ద్వారా బాధిత ప్రజలు తమకు కావాల్సిన ఆహారం, నీరు, రవాణా, సురక్షిత శిబిరం వంటి సహాయాలను కోరవచ్చు. క్రిసిస్ డొనేట్ బటన్‌ను వాడి ఇప్పటి వరకు సుమారు 500 మంది విరాళాలూ అందించారు. రెస్క్యూ టీమ్‌లను సంప్రదించలేని వారు, ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా తమ ప్రాణాలను కాపాడమని అభ్యర్థిస్తున్నారు. ‘కమ్యూనిటీ హెల్ప్’ అనే ఫీచర్‌ను కూడా 1200 మంది పైగా ప్రజలు వాడారు. ఫేస్బుక్లో జాతీయ విపత్త నిర్వహణ అథారిటీలకు, సంబంధిత రెస్క్యూ టీమ్‌లకు సహాయం అందించడానికీ విపత్తు మ్యాప్స్ ఫీచర్‌ను ఫేస్బుక్ అందిస్తోంది.