sagarikaghose
-
ఒకే డ్రెస్ ఎన్ని రోజులేసుకుంటాం.. ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ (TMC MP Sagarika Ghose) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికలను సత్యం గెలిచే తరుణంగా ఆమె అభివర్ణించారు. "ఈ ఎన్నికలు ఎందుకు అవసరం? ఈ ఎన్నికలు మనకు సత్యాన్ని గెలిపించే క్షణాలు. ఒక పార్టీకి, ఒక నాయకుడికి, ఒకే భాషకు, ఒకే మతానికి, ఒకే దుస్తులకు కట్టుబడి ఉందామా? లేదా మన సమాఖ్య, భిన్న విశ్వాసాలు, బహుళ సాంస్కృతిక వైవిధ్యమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామా?" అని ఆమె ప్రజలను ప్రశ్నించారు. "మన ప్రాథమిక స్వేచ్ఛకు ముప్పు ఉన్న కాలంలోనే జీవించాలనుకుంటున్నారా? గుర్తుంచుకోండి.. తెలివిగా ఓటు వేయండి" అంటూ ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు. కాగా, దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాల్లో ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. Why are the #GeneralElections2024 important ? This is a moment of truth for us. Do we want to live under a one-leader-one-party-one-religion-one-language rule? Or do we want to preserve our multi faith multi cultural multi party democracy? Remember that and vote well & vote… pic.twitter.com/FPsJhmGV48 — Sagarika Ghose (@sagarikaghose) March 17, 2024 -
స్ఫూర్తి ప్రదాతలకు.. సాక్షి పురస్కారాలు
అన్నం పెట్టే అన్నదాతలు, ఆపన్నులకు ఆసరా ఇచ్చే సేవాభిలాషులు, దేశాన్ని కాపాడే సైనికులు, పర్వతాల మెడలు వంచిన పరాక్రమవంతులు.. ఇంకా ఎందరో స్ఫూర్తి ప్రదాతల విజయాలకు సాక్షి పట్టం కట్టింది.. పురస్కారాలు అందించింది. సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ ముఖ్య అతిథిగా... అతిరథ మహారథుల సమక్షంలో కన్నుల పండువగా జరిగిన ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నవారి స్పందనలు వారి మాటల్లోనే. తెలుగు వారందరి మీడియా నిజాలు తెలిపే నిష్పాక్షిక మీడియా గ్రూప్‌గా సాక్షి కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రలో అందరికీ ఇష్టమైన మీడియా గ్రూప్ సాక్షి, ఈ తరహా కార్యక్రమాల ద్వారా ఎందరిలోనో స్ఫూర్తి నింపుతున్న చైర్ పర్సన్ భారతీ రెడ్డి కృషి ఎంతైనా అభినందనీయం. విభిన్న రంగాల్లో విజేతలను గుర్తించడం, వారి విజయాలను వెలుగులోకి తీసుకురావడం, గొప్ప కార్యక్రమం. స్ఫూర్తి దాయక విజయాలతో పురస్కారాలు దక్కించుకున్న విజేతలను, వివేకానందుని మాటలను యువత ఆదర్శంగా తీసుకోవాలి. గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి పురస్కారం ప్రకటించడం, అమర జవాన్ బాబూరావు వంటివారిని పురస్కరించడం ద్వారా సరైన విజేతలను ఎంపిక చేసిన న్యాయనిర్ణేతలకు అభినందనలు – ముఖ్య అతిథి తమిళసై, గవర్నర్, తెలంగాణ కట్టా సింహాచలం ‘తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్’ ఆయనది అగాథం నుంచి అత్యున్నత శిఖరానికి సాగిన ఒక జైత్రయాత్ర. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లి గ్రామంలో జన్మించిన సింహాచలం బాల్యంలోనే చూపు కోల్పోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆంధ్రా బ్లైండ్ స్కూల్లో చదువుకున్న తరువాత, ఆర్వీఆర్ కాలేజీలో బిఏలో చేరారు. బీఈడీలో రాష్ట్ర స్థాయిలో 12వ ర్యాంకు సాధించి, విశాఖలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్‌లో చేరి కోర్సు పూర్తి చేశారు. ఆ తరువాత కేంద్రీయ విద్యాలయలో అధ్యాపకునిగా చేరారు. అక్కడితో ఆగిపోలేదు. సివిల్స్‌కు ప్రిపరేషన్ మొదలెట్టారు. ఐఆర్ఎస్కు సెలెక్టయినా మరోసారి సివిల్స్ అటెంప్ట్ చేశారు. 2019 లో జాతీయ స్థాయిలో 457వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అక్షరమనే ఆయుధంతో తనను చుట్టుముట్టిన ప్రతికూలతలను ఛేదిస్తూ గమ్యాన్ని ముద్దాడిన సింహాచలం ఎంతోమంది విద్యార్థులకు నిలువెత్తు స్ఫూర్తి. ప్రస్తుతం రంపచోడవరం సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గొప్ప గౌరవం చాలా హ్యాపీగా ఉంది. జీవితంలో ఇదో గొప్ప గౌరవం. ఈ గౌరవం నా కృషిలో నన్ను మరింత ముందుకు వెళ్లేలా చేస్తుందని భావిస్తూ మరికొంత మందికి స్ఫూర్తి కావాలని కోరుకుంటున్నాను. – కట్టా సింహాచలం, ఐ.ఎ.ఎస్, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, ఐఏఎస్‌కు పురస్కారాన్ని అందిస్తున్న గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, వై.ఎస్. భారతీరెడ్డి మీడియా ప్రాథమ్యాలు మారాలి ఒక చక్కని, అద్భుతమైన కార్యక్రమాన్ని సాక్షి నిర్వహిస్తోంది. ఇటీవలే మేం కూడా సిఎన్ఎన్ ఐబిఎన్‌లో ఇండియా పాజిటివ్, రియల్ హీరోస్ పేరిట ఇలాంటి పురస్కార ప్రదాన కార్యక్రమాలు ప్రారంభించాం. కేవలం చెడు వార్తలు, రాజకీయాలు మాత్రమే చూడడం పాక్షిక దృష్టి మాత్రమే అవుతుంది.. మనది సుసంపన్న దేశం. ఇక్కడ ఎన్నో అద్భుతమైన పనులు చేస్తున్న వ్యక్తులున్నారు. ఎన్నో విశేషాలున్నాయి. మీడియా ప్రాథమ్యాలు మారాలని కోరుకుంటున్నా. వాస్తవిక అంశాలు, వాస్తవమైన పరిస్థితులు, విజయవంతమైన వ్యక్తుల ప్రయాణాలపై మీడియా మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సాక్షి ఎంపిక చేసిన అవార్డు గ్రహీతలు స్ఫూర్తిదాయకమైన రియల్ హీరోస్, మోడల్ సిటిజన్స్. –సాగరికా ఘోష్, ప్రముఖ పాత్రికేయురాలు, సిఎన్ఎన్ ఐబిఎన్ పారదర్శకంగా ఎంపిక సాక్షి మీడియా మాకు విజేతల ఎంపికలో ఎంతో స్వేచ్ఛనిచ్చింది. న్యాయనిర్ణేతల బృందంలో రిటైర్డ్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, వ్యవసాయరంగ నిపుణులతో సహా మరెందరో ప్రముఖులు ఉన్నారు. చాలా జాగ్రత్తగా, పారదర్శకంగా విజేతల ఎంపిక జరిగింది. విజేతలు ఇలాగే భావితరాలకు తమ విజయ పరంపర కొనసాగించాలని, రోల్ మోడల్స్‌గా మారాలని కోరుకుంటున్నాను. – నరేంద్ర సురానా, చైర్మన్, న్యాయనిర్ణేతల జ్యూరీ ఎండి, సురానా టెలికామ్ డాక్టర్ చావా సత్యనారాయణ ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ వ్యాపారం అంటేనే రిస్క్. రిస్క్ అనుకోకుండా ముందుకెళితే? అది రిసెర్చ్. అదే డెవలప్మెంట్. రిస్క్ ఎందుకులే అనుకునే మందుల కంపెనీలు మొదటే ఉత్పత్తిని మొదలు పెట్టేస్తాయి. తర్వాతే ఆర్ అండ్ డి. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సేఫ్ గేమ్. కానీ.. లారస్ ల్యాబ్స్ తన సేఫ్‌ని చూసుకోలేదు. మొదటే ఆర్ అండ్ డి మొదలు పెట్టేసింది! తర్వాతే మందుల తయారీ. లారస్ ల్యాబ్స్ మొదలై పదిహేనేళ్లే అయినా ఇప్పటి వరకు కనిపెట్టిన కొత్త మందులు 150. అంటే.. నూటా యాభై పేటెంట్లు! రెస్పెక్ట్ – రివార్డు – రీటెయిన్.. అనే మూడు స్తంభాలపై ల్యాబ్స్ నిర్మాణం జరిగింది. నాలుగో స్తంభం డాక్టర్ చావా సత్యనారాయణ. ర్యాన్‌బాక్సీ లో యువ పరిశోధకుడిగా డాక్టర్ సత్యనారాయణ విజయ ప్రస్థానం మొదలైంది. మ్యాట్రిక్స్లో చేరిన ఎనిమిదేళ్లకే ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా శిఖరానికి చేరింది. లారస్ ల్యాబ్ వ్యవస్థాపన (2005 హైదరాబాద్) తో భారతీయ ఔషధ ఉత్పత్తుల రంగానికి ‘హితామహులు’, దిశాదర్శకులు అయ్యారు. సాక్షి ఇప్పుడు తన ఎక్స్‌లెన్స్ అవార్డుతో ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ గా ఆయన్ని ఘనంగా సత్కరించింది. సమష్టి కృషి ఫలితం.. ఈ అవార్డ్ తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా సంస్థలో భాగమైన అందరి కృషికీ ఇదో గొప్ప గుర్తింపు. మా సంస్థ సభ్యులు అందరి తరపున సాక్షికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. – డా. చావా సత్యనారాయణ, ఫౌండర్ అండ్ సియీఓ, లారస్ ల్యాబ్స్ డా.సత్యనారాయణ చావాకు పురస్కారాన్ని అందిస్తున్న గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, వై.ఎస్. భారతీరెడ్డి డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి ‘తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్’ విద్యుత్ సౌకర్యం కూడా లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టి కిరోసిన్ దీపం వెలుతురులో చదువుకుని వైద్య రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో నిడిగుంటపాలెం అనే ఒక చిన్న గ్రామానికి చెందిన ప్రేమ్‌సాగర్ రెడ్డి అక్కడే హైస్కూల్ వరకు చదువుకున్నారు. తిరుపతిలోని ఎస్.వి మెడికల్ కాలేజీలో చేరి 1973లో ఎం.బి.బి.ఎస్ పూర్తి చేశారు. హౌస్ సర్జన్ అయ్యాక అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని డౌన్ స్టేట్ మెడికల్ సెంటర్లో ఇంటర్నల్ మెడిసిన్‌లో రెసిడెన్సీ తో పాటు కార్డియాలజీలో ఫెలోషిప్ పూర్తి చేశారు. 1981లో సదరన్ కాలిఫోర్నియాలో మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. అయిదు వేలకుపైగా కార్డియాక్ ప్రొసీజర్స్ చేసి సమర్థుడైన వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. 1985లో కాలిఫోర్నియాలోనే ‘ప్రైమ్ కేర్ మెడికల్ గ్రూప్స్’ పేరుతో మల్టీస్పెషాలిటీ మెడికల్ గ్రూప్ ప్రారంభించారు. 1990లో కాలిఫోర్నియాలో సొంతంగా 150 పడకల అక్యూట్ కేర్ హాస్పిటల్ని నిర్మించారు. ఇప్పుడు ప్రైమ్ హెల్త్‌కేర్ ఆధ్వర్యంలో యు.ఎస్.లోని 14 రాష్ట్రాల్లో 46 ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. యు.ఎస్.లో టాప్–10 వైద్యవ్యవస్థల్లో ఒకటిగా ప్రైమ్ కేర్ గుర్తింపు పొందింది. ఒక చారిటబుల్ ఫౌండేషన్‌ను కూడా స్థాపించి విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. పల్లె విలువలే పురస్కారాలు.. ఈ పురస్కారం అందుకోవడం చాలా గర్వకారణం. అమెరికాలో ఉంటున్నా ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మారుమూల పల్లెటూళ్లో నేర్చుకున్న విలువలు మాకు ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా, అనుసరణీయాలుగా ఉన్నాయి. ఈ పురస్కారం అందుకుంటున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. డా.ప్రేమ్ సాగర్ రెడ్డి, ప్రముఖ వైద్యులు, (అమెరికా నుంచి వీడియోబైట్) సాగరిక ఘోష్ నుంచి డా.ప్రేమ్ సాగర్ రెడ్డి తరఫున అవార్డు అందుకుంటున్న వైస్ ప్రెసిడెంట్, ఇండియా ఆపరేషన్స్, బాలకృష్ణ, -
డాక్టర్జీ.. రోగులు ఎదురుచూస్తున్నారు
బహుశా డాక్టర్లకు సమ్మె చేసే హక్కు ఉండకపోవచ్చు. బహుశా వారి ప్రథమ కర్తవ్యం తమ గురించి కాకుండా తమ రోగుల గురించి ఆలోచించాల్సి ఉండటమే కావచ్చు. కానీ ఒక డాక్టర్ తల బద్దలైనప్పుడు, మరొక డాక్టర్ యాసిడ్ దాడిలో కన్ను కోల్పోవలసి వచ్చినప్పుడు, వేరొక డాక్టర్ చావుతప్పి లొట్టపోయినట్లు దారుణంగా దెబ్బలు తిన్నప్పుడు, వారి తెల్లటి దుస్తులు రక్తం మరకలతో తడిసిపోయినప్పుడు.. డాక్టర్లకు నిరసన తెలిపే, విలపించే హక్కు లేదనడంలో ఏదైనా అర్థముందా? ‘నేను దేవుడిని కాదు, డాక్టర్ని మాత్రమే. నా శక్తిమేరకు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను, దయచేసి నన్ను కొట్టొద్దు’ అనే హక్కు డాక్టర్‌కు లేదని అనగలమా? మానవ ప్రాణిని కాపాడాల్సిన గొప్ప బాధ్యతలో ఉన్నవారు కుప్పగూలిపోతున్న భారతీయ ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలో తొలి బలిపశువుల్లా మిగలాల్సిందేనా? అతడు లేక ఆమె ఒక రక్తమోడుతున్న నౌకలాగా కుదించుకుపోవలసిందేనా? కోల్‌కతాలోని నీల్ రతన్ సర్కార్ హాస్పిటల్లో గత వారం మృతుడి బంధువులు కొందరు తమ ఆగ్రహాన్ని అక్కడ పనిచేస్తున్న ఒక జూనియర్ డాక్టర్‌పై ప్రదర్శించారు. గుంపులో ఒకరు విసిరిన ఇటుక దెబ్బకు డాక్టర్ పరిబాహ ముఖోపాధ్యాయ్ తలకు తీవ్రగాయం తగిలింది. తనకు ఆపరేషన్ చేశారు కానీ, మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందని సహ డాక్టర్లు భీతిల్లుతున్నారు. వైద్యుడిపై అలాంటి దాడి జరగటం ఈ దేశంలో ఇది తొలి సారి మాత్రం కాదు. దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మె జరిగిన సోమవారం నాడు ఎయిమ్స్‌లో మరొక డాక్టరుపై కూడా కొంతమంది రోగులు దాడి చేశారు. మహానగరాల్లో, పట్టణాల్లో రెసిడెంట్ డాక్టర్లు, ట్రైనీ డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు వివిధ కారణాలతో రోగులు, వారి బంధువుల ఆకస్మిక ఆగ్రహాలకు గురై గాయాలపాలైన ఘటనలెన్నో. (చదవండి : వైద్యుల సమ్మె సమాప్తం) నా కుమారుడు కూడా ప్రస్తుతం ఒక జూనియర్ రెసిడెంట్ డాక్టర్. తెల్లకోటు, స్టెతస్కోప్‌ను ధరించి అతడు కూడా ఒంటరిగా హాస్పిటల్ రౌండ్స్‌కు వెళుతుంటాడు. డాక్టర్ల తల్లిదండ్రులందరూ వైద్య విద్య అధ్యయన సమయంలో తమ పిల్లలు చేస్తున్న అత్యంత కఠినతరమైన ప్రయాణాన్ని చవిచూసినవారే. తీవ్రాతి తీవ్రమైన పోటీతో కూడిన ఎంట్రన్స్ పరీక్షలు, కోర్సు క్రమంలో వైద్య విద్య మోపుతున్న పర్వతభారం, నిత్యం జరిగే పరీక్షలు, వీటన్నింటినీ దాటుకుని ఎంబీబీఎస్ డిగ్రీ సాధించడం, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోసం మళ్లీ పరీక్షలు, ఇంటర్న్‌షిప్‌కు సిద్ధమవటం.. తప్పదు. దీంతో మరోసారి నిద్రలేని రాత్రులు గడపడం(షవర్ వద్ద నిలబడి ఉన్నప్పుడు కూడా కనురెప్ప వాల్చడాన్ని నేర్చుకోవడం), ఆసుపత్రిలో పని ఒత్తిడి, అఖిల భారత పోటీ పరీక్షల కోసం మరో దఫా తీవ్రంగా సన్నద్ధమవడం, కోచింగ్ క్లాసులు, సంపుటాల కొద్దీ పుస్తకాలు చదవాల్సి రావడం, రోగుల పడక పక్కనే కూర్చుని, అదే సమయంలో రోగ వివరాలతో కూడిన ఫైళ్లను నింపడం, పని గంటల మధ్య అమూల్యంగా లభించే 15 నిమిషాలు మాత్రమే నిద్రపోవలసి రావడం.. ఇదీ వైద్య విద్యార్థుల దైనందిన జీవితం. జూనియర్ డాక్టరుగా ఉంటున్న 24 ఏళ్లున్న నా కుమారుడికి కూడా వారాంతపు సెలవులు లేవు. సెలవుదినాలు లేవు. కానీ మరొక మానవ ప్రాణిని కాపాడాల్సిన గొప్ప బాధ్యత మాత్రం ఉంటుంది. వ్యాధుల బారిన పడిన వారి నొప్పి తగ్గించడం, సంరక్షణ లేని ప్రపంచంలో కేర్ తీసుకోవడంతోపాటు ప్రతి వైద్యుడూ పాటించవలసిన ఆ మహోన్నతమైన హిప్పోక్రాట్స్ ప్రమాణం కూడా తోడుగా ఉంటుంది. అదేమిటంటే, మొట్టమొదటగా వైద్యుడు చేయవలసింది ‘రోగికి ఎలాంటి హానీ చేయకపోవడం’. వైద్యుల నిత్య జీవితాచరణ యముడినీ భయపెడుతుంది. డాక్టర్ పరిబాహ ముఖోపాధ్యాయ అంతవరకు తాను సంరక్షకుడిగా ఉన్న అదే ఆసుపత్రిలో పడుకుని ఉన్నారు. తలకు బలమైన దెబ్బలు తగిలాయి. నాలాగే తన తల్లి కూడా అతడు పుస్తకాలతో కుస్తీపడటాన్ని చూసి ఉంటారు. పరీక్షా ఫలితాలలో తాను పొందిన నిమ్నోన్నతాలకు సాక్షిగా ఉండి ఉంటారు. రోగులతో అతడు కలిగివుండే భావోద్వేగ బంధాన్ని గమనించి ఉంటారు. మెడికోగా తన కుమారుడు పడుతున్న ఘర్షణను, ఒత్తిడిని మొత్తంగా ఆమె అనుభూతి చెంది ఉంటారు. అలాంటిది అదే ఆసుపత్రిలో అతడు బెడ్ మీద రోగిలా ఉండటం, తలకు బ్యాండేజ్ చుట్టి ఉండటం చూస్తూ ఆమె ఎంత ఆందోళన చెంది ఉంటారో! పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ఆమె తన ముద్దుల కుమారుడు నిస్త్రాణగా పడి ఉండటం చూసి తల్లడిల్లిపోయి ఉండరూ! (చదవండి : జూడాల సమ్మెకు సోషల్ మీడియా ఆజ్యం!) బహుశా డాక్టర్లకు సమ్మె చేసే హక్కు ఉండకపోవచ్చు. వారి ప్రథమ కర్తవ్యం తమ గురించి కాకుండా తమ రోగుల గురించే ఆలోచించాల్సి ఉండటం కావచ్చు. కానీ ఒక డాక్టర్ తల బద్దలైనప్పుడు, మరొక డాక్టర్ యాసిడ్ దాడిలో కన్ను కోల్పోవలసి వచ్చినప్పుడు, మరొక డాక్టర్ చావును సమీపించిన స్థితిలో దారుణంగా దెబ్బలు తిన్నప్పుడు, అతడి తెల్లటి దుస్తులు రక్తం మరకలతో తడిసిపోయినప్పుడు.. వారికి నిరసన తెలిపే హక్కు లేదనడంలో ఏదైనా అర్థముందా? ‘నేను దేవుడిని కాదు, డాక్టర్ని మాత్రమే. నా శక్తిమేరకు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను, దయచేసి నన్ను కొట్టొద్దు’ అనే హక్కు డాక్టర్‌కు లేదని అనగలమా? కుప్పకూలిపోతున్న భారతీయ ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ ముంగిట జూనియర్ డాక్టర్ గస్తీ తిరుగుతున్నారు. దేశంలో సరిపడినన్ని ఆసుపత్రులు లేవు. డాక్టర్లు లేరు. ఒకే ఒక్క డాక్టర్ వందమంది రోగులను పర్యవేక్షించాల్సి వస్తున్న దుర్భర స్థితిలోనూ రోగులపట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుంటాయి. ఆసుపత్రుల్లోని వైద్య సామగ్రి మరమ్మతుకు కూడా సాధ్యం కానంతగా పాడై ఉంటాయి. ఈ స్థితిలో శస్త్రచికిత్సలు చేయడం అంటే అదృష్టాన్ని నమ్ముకోవడమే. చీకటితో నిండి ఉండే ఆసుపత్రి వరండాల్లో, మృత్యువు తనదైన గర్వాతిశయంతో పచార్లు చేస్తుంటుంది. వైద్యులను అద్భుత ప్రావీణ్యతలు కలిగిన శ్రామికుడిగా మనం లెక్కించకూడదు. డాక్టర్లు శక్తినంతటినీ ధారపోసి రోగి ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నిస్తుంటారు కానీ రోగి ఆఖరి శ్వాసను వారు అడ్డుకోగలరా? నా కుమారుడి మెడ వెనుక భాగంలో పొడిపించుకున్న పచ్చబొట్టు ఏమిటో తెలుసా..! ‘సంరక్షించు, నయం చెయ్యి, నూతనంగా సృష్టించు’. రోగిని సంరక్షించడమే ఒక డాక్టర్ రెండో స్వభావం అయినప్పుడు, కాపాడటమే తన లోపరహిత వైఖరి అయినప్పుడు, అతడు లేక ఆమె రోగి త్వరగా చావాలని అనుకోగలరా? కానీ మన సమాజానికి బలిపశువులు అవసరం. ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ కుప్పగూలిపోయినందువల్ల, నిస్సహాయుడైన జూనియర్ డాక్టర్ ప్రజాగ్రహం ఫలితాలను మొత్తంగా తానే భరించవలసి వస్తోంది. ప్రస్తుతం డాక్టర్–పేషెంట్ నిష్పత్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి వెయ్యిమంది ప్రజలకు ఒక్క వైద్యుడు ఉండాలి. కానీ భారతదేశంలో ఇది 1:2,000గా ఉంటోంది. అంటే దేశంలో 50 శాతం డాక్టర్ల కొరత ఉంటోందని దీనర్థం. భారత్ లోని 8,56,065 మంది అల్లోపతి వైద్యుల్లో 6 లక్షల మంది క్రియాశల ప్రాక్టీషనర్లుగా ఉంటున్నారు. వైద్యపరీక్షలకు సంబంధించి విస్తారమైన అనుభవం ఉన్న భారతీయ వైద్యులకు ఎనలేని నైపుణ్యాలు ఉంటున్నాయి. కానీ వీరి ప్రావీణ్యతలకు తగినంత మౌలిక వసతుల వ్యవస్థ మద్దతు లేకపోవడంతో అత్యంత దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. 2009లో జస్టిస్ కట్జు, జస్టిస్ ఆర్ఎమ్. లోథా ఈ అంశంపై ముఖ్యమైన తీర్పు వెలువరించారు. ‘విధినిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వైద్యుల పట్ల ఈ న్యాయస్థానం ఎలాంటి సానుభూతి చూపదు. కానీ వైద్య వృత్తిని కూడా వినియోగదారు సంరక్షణ చట్టం పరిధిలోకి తీసుకురావడం వల్ల మన దేశంలో వైద్యులపై ఎక్కడ చూసినా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి’. 2017 సెప్టెంబరులో డాక్టర్ కఫీల్ ఖాన్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. కారణం. ఆ సంవత్సరం ఆగస్టు నెలలో గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సౌకర్యం లేక 30–40 మంది పిల్లలు చనిపోయారు. కానీ ఇప్పుడు తెలుస్తున్నదేమిటంటే, ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా విషయంలో డాక్టర్ ఖాన్ వ్యక్తిగత స్థాయిలో ధీరోదాత్తమైన ప్రయత్నం చేశారు. తన వ్యక్తిగత కార్యాచరణ ద్వారా ఆయన అనేకమంది పిల్లల ప్రాణాలు కాపాడారు. అత్యవసర పరిస్థితుల్లో పిల్లల ప్రాణాలను కాపాడటానికి రక్తం ధారపోసిన నిజమైన హీరో డాక్టర్ కఫీల్ ఖాన్. కానీ ఆయనపై అన్యాయంగా ఆరోపించి, అరెస్టు చేసి మరీ విచారణ జరిపారు. గోరఖ్‌పూర్‌లోని ఎన్నారెస్ హాస్పిటల్లో జరిగిన ఘటనలపై రాజ కీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు బలం పుంజుకున్నాయి. రాజకీయ ప్రత్యర్థి పక్షాలు దీంట్లోకి చొరబడి మతపరమైన ఘర్షణలను రెచ్చగొట్టాలని, రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ఘటనలో రాజకీయ కుట్రను చూశారు. ప్రతిపక్షం దీంట్లో ఎన్నికల ఎజెండాను చూసింది. అయితే ఇవేవీ నాకు ప్రాధాన్యం కాదు. నేను చూస్తున్నదల్లా, ఎలాంటి కళాకాంతులూ లేని వ్యక్తి తన రోగిముందు కూర్చుని అతడి నాడి పట్టి చూస్తూ, గుండె కొట్టుకొనే శబ్దాన్ని వింటూ, ఒక డాక్టరుకు, రోగికి మధ్య ఉండే అత్యంత సాన్నిహిత్య బంధాన్ని దేశం ముందు వ్యక్తీకరిస్తున్నారు. ఇది సమగ్రతకు సంబంధించిన బాంధవ్యం. మాటల్లో వర్ణించలేని సాన్నిహిత్యం. కుప్పగూలిపోతున్న భారతీయ ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ.. ప్రతి భారతీయ డాక్టర్లో నిబిడీకృతమైన శిలాసదృశమైన, వజ్రకవచ స్ఫూర్తికి వ్యతిరేకంగా నిలుస్తోంది. తనతో ఘర్షిస్తున్న ఈ బాధామయ పరిస్థితులకు వ్యతిరేకంగా భారతీయ డాక్టర్ తన వైద్యపరమైన తేజోవంతమైన స్ఫూర్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. వారు చేస్తున్న ఈ పవిత్రకర్తవ్యం ప్రజాగ్రహానికి గురై ఇలా తన్నులు తినాల్సిందేనా? అతడు లేక ఆమె ఒక రక్తమోడుతున్న నౌకలాగా కుదించుకుపోవలసిందేనా? బహుశా, రక్తగాయాల బారినపడిన ఈ వైద్యమూర్తులు మళ్లీ తన విధులను చేపట్టవచ్చు. తమ గాయాలను పక్కనబెట్టి వారు విధుల్లోకి తిరిగిరావచ్చు. తమ వార్డుకు తిరిగిరావచ్చు. వైద్యులను సంరక్షించని పాలనాయంత్రాంగం, కుప్పగూలుతున్న మౌలిక వ్యవస్థకు వ్యతిరేకంగా తమ మానసిక శక్తి అనే ఏకైక కాంతిపుంజాన్ని వారు సమున్నతంగా ఎత్తిపట్టవచ్చు. అతిగొప్ప మహర్షులు, సైంటిస్టులు, చింతనాపరుల పుట్టినిల్లు అయిన భారతదేశం ఇప్పటికీ మహోన్నత వైద్యులను తయారు చేస్తూనే ఉంది. డాక్టర్ పరిబాహ ముఖోపాధ్యాయ్.. త్వరగా కోలుకోండి. మీ పేషెంట్లు మీకోసం వేచి చూస్తున్నారు. - సాగరికా ఘోష్, సీనియర్ పాత్రికేయురాలు -
‘రిజర్వ్’ నిధులు
‘రిజర్వ్’ నిధులు ‘‘నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్లీ రిజర్వ్‌బ్యాంక్ మూలధనంపై కన్నేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ విశ్వసనీయతకు, మన కరెన్సీకి సుస్థిరతకు ఆర్బీఐ దగ్గర ఈ నిల్వ అవసరం. ఈ విషయంలో ప్రభుత్వ ఒత్తిళ్లతో ఇప్పటికే అసాధారణ రీతిలో ఇద్దరు గవర్నర్లు నిష్క్రమించారు. అయినా కేంద్ర ప్రభుత్వం దీన్నుంచి ఏమీ నేర్చుకోలేదని అర్ధమవుతోంది’’ – సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి (‘రిజర్వ్’ నిధులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కన్నేసిందన్న కథనం చూశాక) వివేకం కలగాలి ‘‘ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా అన్ని విధాలా అర్హులైన వారికి విశిష్ట పురస్కారాలు ప్రకటిస్తే కొందరు దీన్ని రాజకీయం చేయడానికి పూనుకోవడం బాధాకరం. ఆ బాపతు వారికి ఆ భగవంతుడే వివేకం కలిగించాలి. అందుకు వారిని అనుగ్రహించాలి’’ – జీవీఎల్ నరసింహారావు బీజేపీ అధికార ప్రతినిధి ద్వంద్వ ప్రమాణాలు ‘‘బ్లాగ్ మంత్రి’ అరుణ్ జైట్లీ త్వరితంగా కోలు కోవాలని ఆకాంక్షి స్తూనే చందా కొచ్చ ర్‌పై ఆయన చేసిన ప్రకటనను తప్పుబట్టక తప్పడం లేదు. అది అసాధారణమైనది. మరోరకంగా ఐసీఐ సీఐ కేసులో అడుగు ముందుకేయొద్దని సీబీఐని కోరడమే. ఇలాంటి ద్వంద్వ ప్రమా ణాలు సరికాదని ఆయన గుర్తించాలి’’ – జైరాం రమేష్, కాంగ్రెస్ నాయకుడు అత్యున్నత విలువ ‘‘మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. సరిగ్గా ఇదే రోజు ఆవిష్కృత మైన మన రాజ్యాంగం మీ తల్లిగారికి, ఆమె లాంటి అనేకులకు ఒక నిరర్థక హామీ పత్రంగా మిగిలి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ మనం నిలబెట్టుకునేందుకు పోరాడి తీరవ లసిన ఏకైక ఆదర్శం అదొక్కటేనని మీరు గుర్తించండి’’ – సంజయ్ హెగ్డే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పతాక విలువలు ‘‘సమాజంలో చీలికలు విస్తరిస్తుంటే, విద్వేషాలు భయంకరంగా రేగుతుంటే మన త్రివర్ణ పతాకం వినువీధిలో రెపరెపలాడుతూ మనలో విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగిస్తోంది. తన అత్యున్నత విలువలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందుకోమని మనందరికీ పిలుపునిస్తోంది’’ – సాగరికా ఘోష్, సీనియర్ జర్నలిస్టు (గణతంత్ర దినోత్సవం సందర్భంగా) -
మోదీ ఇందిరను అనుకరిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇప్పటివరకు పనిచేసిన ప్రధానుల్లో ఇందిరాగాంధీ అత్యం త శక్తివంతమైన నాయకురాలని.. ప్రధాని నరేంద్రమోదీ పలు అంశాల్లో ఆమెను అనుకరిస్తున్నారని ప్రముఖ జర్నలిస్ట్, ‘ఇందిరా.. ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్‌మినిస్టర్’పుస్తక రచయిత్రి సాగరికా ఘోష్ అన్నారు. సంఘ్ పరివార్ సైతం నెహ్రూ, సోనియా, రాహుల్‌గాంధీ విధానాలను లక్ష్యంగా చేసుకుంది కానీ.. ఇందిరను ఎప్పుడూ టార్గెట్ చేయలేదన్నారు. ఈ పుస్తక పరిచయ కార్యక్రమానికి ప్రముఖ రచయిత్రి సునీతారెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సాగరిక మాట్లాడుతూ.. ఇందిరాగాంధీపై 120 జీవిత చరిత్ర పుస్తకాలు అచ్చయ్యాయని.. వాటిలో 80 పుస్తకాలను చదివిన తర్వాత అందులో స్పృశించని పలు కోణాలను ఈ పుస్తకంలో ప్రస్తావించినట్లు తెలిపారు. భిన్న వైరుధ్యాలున్న మహిళ ఇందిర అని, ఆమె హయాంలో ప్రజాస్వామ్యం కంటే వ్యక్తిస్వామ్యానికే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇందిర స్ఫూర్తివంతమైన నాయకురాలు, మానవతావాది, గొప్ప పాలకురాలు అని, బ్యాంకుల జాతీయికరణ, బంగ్లాదేశ్ ఆవిర్భావం, పాకిస్తాన్‌తో యుద్ధం, అమెరికాతో దౌత్యం వంటి అంశాల్లో ఆమె అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శిం చారన్నారు. కోటరీ రాజకీయాలు, అవినీతి, కొన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, రాజనీతి, వ్యక్తిగత, కుటుంబ జీవితంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లను ఈ పుస్తకంలో ఆవిష్కరించే యత్నం చేసినట్లు తెలిపారు. -
తప్పులో కాలేసిన అనిల్ కుంబ్లే
ఢిల్లీ : భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కెప్టెన్ జహీర్ ఖాన్ త్వరలో ఓ ఇంటివాడు కానున్న విషయం తెలిసిందే. తన ప్రియురాలు, బాలీవుడ్ నటి సాగరిక ఘాట్గెతో జహీర్ నిశ్చితార్థం సోమవారం జరిగింది. సాధారణంగానే ప్రముఖ క్రికెటర్ కావడంతో జహీర్‌కు పెద్ద మొత్తంలో శుభాకాంక్షలు అందాయి. అయితే జహీర్‌తో పాటూ అతనికి కాబోయే భార్యకు కూడా ట్విట్టర్లో జహీర్ అభిమానులు, పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇక్కడే మాజీ ప్రముఖ క్రికెటర్, ప్రస్తుత భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే పప్పులో కాలేశారు. సాగరిక ఘాట్గెకి విష్ చేయబోయి ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్‌కి శుభాకాంక్షలు తెలిపారు. సాగరికా ఘోష్, సాగరిక ఘాట్గె పేర్లు ఒకేలా ఉండటంతో ఈ పొరపాటు జరిగింది. అయితే కొద్దిసేపటికే అసలు విషయం తెలుసుకున్న కుంబ్లే వెంటనే తన ట్విట్ని తొలగించి, మరో ట్విట్ చేశారు. అందులో సాగరికా ఘోష్‌ను ట్యాగ్ చేసిన స్థానంలో సాగరిక ఘాట్గెను ట్యాగ్ చేసి పోస్ట్ చేశాడు. అయితే ఒక్క అనిల్ కుంబ్లేనే కాకుండా ఇంకా చాలా మంది సాగరికా ఘోష్‌కు విషెస్ చెబుతూ ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి పంపిన విషెస్ కూడా సాగరిక ఘోష్కే చేరాయి. పెద్ద ఎత్తున పెళ్లి శుభాకాంక్షలు రావడంతో జర్నలిస్ట్ సాగరిక ఘోష్ అవాక్కయ్యారు. అయ్యో సార్ నేను ఇద్దరు పిల్లల తల్లిని. మీరు తప్పు సాగరికాకి మీ విషెస్ పంపారు.. అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.