రాయ్ పెరోల్ రద్దు..!
సహారా తరఫు న్యాయవాది వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్
* సంస్థ క్షమాపణలతో రూలింగ్ పునఃసమీక్షకు ఆమోదం
* లొంగిపోడానికి వారం గడువు; తాజా బెయిల్ పిటిషన్‌కు ఓకే
న్యూఢిల్లీ: సహారా కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో శుక్రవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సహారా తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది రాజీవ్ థామన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు, తక్షణం సహారా చీఫ్ సుబ్రతారాయ్, డెరైక్టర్లు ఇరువురి పెరోల్‌ను రద్దు చేస్తున్నట్లు రూలింగ్ ఇచ్చింది.
అయితే ఈ వార్త తెలిసిన వెంటనే గ్రూప్, గ్రూప్ తరఫు మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అప్రమత్తమయ్యారు. జరిగిన తప్పుకు క్షమాపణలు చెబుతున్నట్లు ఉన్నత న్యాయస్థానానికి విన్నవించారు. థావన్‌ను తమ న్యాయవాదిగా తొలగిస్తున్నట్లూ తెలిపారు. థావన్ వాదనలను సహారా తరఫుగా భావించరాదని వేడుకున్నారు. దీనితో కొంత శాం తించిన సుప్రీంకోర్టు తాజా బెయిల్ పిటిషన్ దాఖలుకు సహారాకు అనుమతి ఇచ్చింది. అప్పటికప్పుడు రాయ్, ఇరువురు డెరైక్టర్లను కస్టడీలోకి తీసుకోవాలని తొలుత ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం, ఈ లొంగుబాటు గడువునూ వారం పాటు పొడిగించింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే...
* తల్లి మరణంతో మే నెలలో పెరోల్ పొందిన రాయ్, అప్పటి నుంచీ తాను బెయిల్‌కు చెల్లించాల్సిన రూ.10,000 కోట్లలో కొంత మొత్తాన్ని చెల్లిస్తూ, పెరోల్‌ను కొనసాగించుకుంటున్నారు. ఇలా ఇప్పటికి రూ.352 కోట్లు చెల్లించారు. శుక్రవారంతో పెరోల్ ముగిసింది.
* సెప్టెంబర్ 30 వరకూ పెరోల్ గడువు పొడిగింపునకు రూ.300 చెల్లించాలని సుప్రీం సూచించింది.
* ఈ సందర్భంగా సహారా తరఫు న్యాయవాది థావన్ (మరో న్యాయవాది కపిల్ సిబాల్ జ్వరంతో కోర్టుకు హాజరుకాలేదు) తమకు ఏ విషయాలూ తెలియజేయకుండా, మార్కెట్ రెగ్యులేటర్ సహారా ఆస్తుల జప్తు ప్రక్రియను నిర్వహిస్తోందని, ఆయా అంశాల్లో తమ ప్రమేయాన్నీ సెబీ అనుమతించాలని అన్నారు. ఇప్పటికే కట్టాల్సిన రూ.300 కోట్లు కన్నా అదనంగా రూ.52 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్న థావన్, తదుపరి ఉత్తర్వుకు ముందు కేసు గురించి వినాలన్నారు.
* ఇందుకు కోర్టు స్పందిస్తూ... ‘మీరు తప్పనిసరిగా అన్ని విషయాల్లో సహకరించాలి. లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మేము ఏమి చేయాలో మీరు చెప్పడం తగదు’ అని వ్యాఖ్యానించింది.
* దీనికి స్పందించిన థావన్ న్యాయస్థానం మాటలను తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు తగదని, సమ్మతం కాదని అన్నారు.
* ‘కోర్టు పట్ల, వ్యవస్థ పట్ల ఏ మాత్రం గౌరవం లేని వ్యాఖ్యలుగా’ వీటిని పరిగణించిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం, దీనిని సహారా తరఫు మాటలుగానే భావించి తక్షణం రాయ్, మరో ఇరువురి పెరోల్‌ను రద్దు చేసింది.
* ఇది తెలిసి కోర్టులో సహారా తరఫున తక్షణం కపిల్ సిబల్ క్షమాపణలు తెలిపారు.
* దీనితో శాంతించిన న్యాయస్థానం రాయ్, డెరైక్టర్ల లొంగుబాటుకు వారం గడువు ఇచ్చింది. రాయ్ బెయిల్‌కు సంబంధించి తాజా పిటిషన్‌ను దాఖలు చేయాలనీ సూచించింది. అప్పటి వరకూ రాయ్ జైలులోనే ఉండాలని సూచించింది.