‘గాండీవధారి అర్జున’ మూవీ రివ్యూ
టైటిల్: గాండీవధారి అర్జున
నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, విజయ్ రాయ్, విమలా రామన్, అభినవ్ గోమఠం, నరేన్ తదితరులు
నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
సంగీతం:మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ:ముఖేష్ జి
విడుదల తేది: ఆగస్ట్ 25, 2023
కథేంటంటే..
ఈ సినిమా కథ అంతా లండన్‌లో జరుగుతుంది. అక్కడ జరిగే గ్లోబల్ సమ్మిట్-2023కి భారత్ తరపున కేంద్రమంత్రి ఆదిత్య రాజ్ బహదూరు(నాజర్) వెళ్తాడు. అతనికి పీఏగా ఐఏఎస్ అధికారిణి ఐరా(సాక్షి వైద్య)వెళ్తుంది. లండన్ పర్యటనలో ఉన్న మంత్రి ఆదిత్య రాజ్‌కు ఓ పెన్ డ్రైవ్(ఫైల్ 13) ఇవ్వాలని ప్రయత్నిస్తుంది శృతి(రోషణి ప్రకాశ్). అయితే ఆమెను క్లీన్ అండ్ గ్రీన్ (సీ అండ్ జీ)కంపెనీ అధినేత రణ్వీర్ (వినయ్ రాయ్) మనుషులు వెంబడిస్తారు. ఆ ఫైల్ మంత్రికి ఇవ్వకుండా ఆమెను అడ్డుకుంటారు.
ఈక్రమంలో ఓ సారి మంత్రిపై ఎటాక్ జరుగుతుంది. దీంతో మంత్రికి సెక్యూరిటీగా అర్జున్ వర్మ(వరుణ్ తేజ్) వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది. అసలు శృతి ఎవరు? ఆమె దగ్గర ఉన్న ఫైల్లో ఏం ఉంది? అది ఎందుకు మంత్రికి ఇచ్చేందుకు ప్రయత్నించింది? ఆ ఫైల్‌కు సీ అండ్ జీ అధినేత రణ్‌వీర్‌కు ఉన్న సంబంధం ఏంటి? అర్జున్ వర్మ, ఐరాల మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? కేంద్రమంత్రికి రక్షణగా వచ్చిన అర్జున్.. ప్రాణాలకు తెగించి ఆయన ఫ్యామిలీని ఎలా రక్షించాడు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
యాక్షన్ థ్రిల్లర్ అనగానే అందరికీ గుర్తొచ్చేంది యాక్షన్ సీన్స్, హై వోల్టేజ్ ఫైట్స్. వీటితో పాటు కథ-కథనం కొత్తగా ఉండాలి. అవన్ని ఉంటేనే విజయం వరిస్తుంది. గాండీవధారి అర్జున విషయంలో కొత్తదనం అనేదే లేదు. కథలో కీలకమైన మెడికల్ వేస్టేజి పాయింట్ కూడా సూర్య నటించిన ‘సింగం 3’సినిమాను గుర్తు చేస్తుంది. అయితే ప్రవీణ్ రాసుకున్న ఈ కథ మాత్రం ఆలోచింపజేసేలా ఉంది. ఫారిన్లో ఉండే చెత్తను ఇండియాలో డంప్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటనేది ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
(చదవండి: బెదురులంక 2012’మూవీ రివ్యూ)
అభివృద్ది పేరుతో అగ్రదేశాలు తమ దేశంలోని చెత్తనంతా భారత్ లాంటి దేశాలకు పంపుతూ, ఇక్కడి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బదీస్తున్నారనే మంచి పాయింట్‌ని ఈ సినిమాలో చూపించారు.అయితే ఇది వినడానికి చాలా బాగుంటుంది. కానీ తెరపై ఎలా చూపించారనేదానిపై సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కథలో ప్రేక్షకుడు లీనమయ్యేలా చేయడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. యాక్షన్, ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ కాలేదు.
కథ ప్రారంభం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ యువతి కేంద్రమంత్రిని కలిసేందుకు ప్రయత్నించడం.. ఆమెను కొంతమంది వెంబడించడంతో..అసai ఆ యువతి ఏం చెప్పాలనుకుంటుందననే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతోంది. హీరో ఎంట్రీ అంతగా ఆకట్టుకోదు. హీరో, హీరోయిన్ల లవ్ స్టోరీ కంటే వారిద్దరు విడిపోవడానికి గల కారణం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే తల్లి కొడుకుల సెంటిమెంట్ అంతగా వర్కౌట్ కాలేదు.
శృతి అనే అమ్మాయి ఇచ్చిన ఫైల్ 13 గురించి మంత్రి, అర్జున్‌కి తెలియసిన తర్వాత కథపై ఆసక్తి నెలకొంటుంది. అయితే ఆ తర్వాత కూడా కథనం ఆసక్తికరంగా సాగదు.పైగా కొన్ని లాజిక్‌లెస్ సన్నివేశాలు చిరాకు తెప్పిస్తాయి. లండన్ పోలీసులు హీరోని పట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు.. వారి నుంచి హీరో తప్పించుకునే తీరు సినిమాటిక్‌గా అనిపిస్తుంది. విలన్ ఎంట్రీని ఎంతో గ్రాండ్‌గా చూపించారు కానీ.. విజనిజాన్ని పండించడంలో ఘోరంగా విఫలమయ్యారు. కనీసం క్లైమాక్స్‌లో అయినా విలన్ని సరిగా వాడుకోలేకపోయారు. ప్రతి సన్నివేశాన్ని చాలా రిచ్‌గా, హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారు కానీ ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా కథనాన్ని నడిపించలేదు.
ఎవరెలా చేశారంటే..
మాజీ ‘రా’ ఏజెంట్ అర్జున్ వర్మ పాత్రలో వరుణ్ తేజ్ ఒదిగిపోయాడు. అతని ఫిజిక్ ఆ పాత్రకు బాగా సెట్ అయింది. తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. యాక్షన్స్ సీన్స్ ఇరగదీశాడు. ఇక కేంద్రమంతి పీఏ ఐరాగా సాక్షి వైద్య చక్కగా నటించింది. కేవలం పాటలకే పరిమితం కాకుండా కథతో పాటు ఆమె పాత్ర ప్రయాణిస్తుంది. ఇక కేంద్రమంత్రి ఆదిత్యరాజ్గా నాజర్ నటనకు వంకపెట్టలేం. ఇలాంటి పాత్రలు ఆయన కొత్తేమి కాదు. విజయ్ రాయ్ విలనిజం చూపించడంలో విఫలమయ్యారు. ఆయన పాత్రను మరింతగా బలంగా రాయాల్సింది. అభినవ్ గోమఠం, నరేన్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతిక విషయాలకొస్తే.. మిక్కీజే మేయర్ సంగీతం జస్ట్ ఓకే. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. బీజీఎం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. తెరపై ప్రతీ సీన్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా వెనకడుగు వేయలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. కానీ మేకింగ్ ఎంత రిచ్‌గా ఉన్నా.. కథ-కథనం ఆకట్టుకునేలా లేకపోతే ఏం లాభం?.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్