పీఎఫ్ సీలింగ్ పరిమితి పెంపు?
న్యూఢిల్లీ : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. పీఎఫ్ అర్హతకు ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసేందుకు అడుగులు వేస్తోంది. నెలకు రూ. 15 వేలుగా ఉన్న వేతన పరిమితిని రూ. 25 వేలకు పెంచాలని ఈపీఎఫ్వో యోచిస్తోంది.
వచ్చే నెలలో జరుగబోయే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయంపై చర్చించనుందని తెలుస్తోంది. ధరల పెరుగుదల, వేతన సమీక్షలో భాగంగా ఈపీఎఫ్ఓ ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్టు సమాచారం. అంతేకాక సంఘటిత రంగంలో ఉన్న 60 లక్షలకు పైగా ఉద్యోగులను కూడా తమ సోషల్ సెక్యురిటీ పరిధిలోకి చేకూర్చుకోనుందట. ఇప్పటివరకు ఈ రంగంలో 4 కోట్ల మంది ఉద్యోగులు మాత్రమే ఈపీఎఫ్ఓ ఖాతాదారులుగా ఉన్నారు.
మరోవైపు ఈపీఎఫ్ఓ బోర్డు ప్రతిపాదించిన రూ.25వేల కనీస వేతన పరిమితికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టి దాన్ని తగ్గించనుందని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రావిడెంట్ ఫండ్ కవరేజ్ వ్యవహారంలో మధ్యే మార్గాన్ని అనుసరిస్తూ కనీస వేతనాన్ని 21వేల రూపాయలుగా నిర్ణయించనున్నట్టు ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. కాగ, 2014 సెప్టెంబర్ 1న వేతన సీలింగ్ నెలకు 15వేల రూపాయలుగా ఉండేటట్టు ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. అప్పటివరకు ఈ పరిమితి రూ.6500గా ఉండేది.
కాగా, ఈపీఎఫ్ఓ ప్రతిపాదన అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వంపై రూ.2,700 కోట్ల అదనపు భారం పడే అవకాశముంది. దాదాపు 4 కోట్ల మంది ఈపీఎఫ్ఓ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రసుత్తం రూ.6,700 కోట్లు వెచ్చిస్తోంది.