మెడికల్ రిప్స్ నిరసన దీక్ష
భీమవరం: తమకు కనీస వేతనాలు నిర్ణయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, దీంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్‌జీయూడీ కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం మెడికల్ రిప్స్ నిరాహార దీక్ష చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, తమకు కనీస వేతనాలు నిర్ణయించాలని కోరారు. సేల్స్ ప్రమోషన్ చట్టాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భీమవరంశాఖ అధ్యక్షుడు సీహెచ్‌ఎన్‌ఎం మురళీ ప్రసాద్ మాట్లాడుతూ మెడికల్ రిప్స్‌లో మహిళలకు ప్రసూతి సెలవులు ఆర్నెల్లు ప్రకటించాలని, మేడే సెలవు ఇవ్వాలని కోరారు. దీక్షలో ఎస్.శిరీష్‌కుమార్, కెఎంఎస్‌సీ రాజు, బాలకృష్ణ, పవన్‌కుమార్ తదితరులు కూర్చున్నారు. సీఐటీయూ నాయకుడు వాసుదేవరావు, స్కూల్ బస్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ దీక్షకు మద్దతు తెలిపారు.