నయీం కేసులో మరో కీలక మలుపు
నయీం గ్యాంగులో కీలక సభ్యుడు, అతడితో కలిసి కిడ్నాపులు, మోసాలు, నేరపూరిత కుట్రలు, భూ ఆక్రమణలు, బెదిరించి డబ్బు వసూళ్లు తదితర నేరాలకు పాల్పడిన సామా సంజీవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై పీడీ యాక్టు నమోదు చేశారు. హయత్‌నగర్ పరిధిలోని సాహెబ్‌నగర్ ప్రాంతానికి చెందిన సంజీవరెడ్డి నయీం గ్యాంగులో కీలక సభ్యుడని, అతడితో కలిసి ఆరు నేరాల్లో ఇతడిపై కేసులు ఉన్నాయని రాచకొండ పోలీసు కమిషనరేట్ ఒక ప్రటకనటలో తెలిపింది. పహాడి షరీఫ్, ఆదిభట్ల పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రధానంగా ఇతడు నేరాలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అతడి పనులు ప్రజాభద్రతకు ముప్పుగా పరిణమించాయని, అతడిని కొన్నాళ్ల పాటు సమాజానికి దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో పీడీ చట్టం కింద కొంతకాలం పాటు జైల్లో ఉంచామని పోలీసులు తెలిపారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలను కాపాడేందుకు అతడిపై పీడీ చట్టం పెట్టాల్సిందిగా పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశించారన్నారు.
కాగా, మరోవైపు నయీం అనుచరుడు పుల్లూరి మహేష్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నయీం ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచి మహేష్ పరారీలో ఉన్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి అతడి మృతదేహం కనిపించడంతో ఏమై ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది.