samaikyanadhra
-
తెలంగాణ ఏర్పాటుకు ఇది సందర్భం కాదు: జికె పిళ్లై
ముంబై: తెలంగాణ ఏర్పాటుకి ఇది సందర్భం కాదని కేంద్ర హోమ్ శాఖ మాజీ సెక్రటరి గోపాల కృష్ణ పిళ్లై (జికె పిళ్లై) వ్యాఖ్యానించారు. ముంబై నుంచి వెలువడే ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డిఎన్ఎకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణా ప్రజలు ఎంతో కాలంగా కోరుకుంటున్నారని అంటూనే, అయితే ఇది సరైన సమయం కాదని ఆయన అన్నారు. తెలంగాణాకి ప్రత్యేక ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయడమన్నది జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చేసిన సూచనల్లో అత్యుత్తమమైందని పిళ్లై అభిప్రాయపడ్డారు. ఆ ప్రయోగం ఎటువంటి ఫలితాన్నిస్తుందో రెండు మూడేళ్లు చూశాక, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై అప్పుడు నిర్ణయం తీసుకొని ఉండవల్సిందని ఆయన అన్నారు. రాజధాని విషయంలో శ్రుతి మించిన యాగీ జరుగుతోంది గానీ, నీటి సమస్యే ప్రధానమైనదని, ప్రత్యేక రాష్త్ర ఆవిర్భావం వల్ల తలెత్తే ముఖ్యమైన సమస్యల గురించి అడిగిన ఒక ప్రశ్నకి బదులుగా అన్నారు. సారవంతమైన కోస్తా భూములకి నీరు తెలంగాణా నుంచే రావలసి ఉన్నందు వల్ల, తెలంగాణాలో ఆనకట్టలు కడితే తాము ఏమైపోతామోనన్న ఆందోళన కోస్తా ప్రజల్లో ఉందని ఆయన అన్నారు. అయితే, ఆనకట్టలు ఎవరి ఇష్టమొచ్చినట్టు వారు కట్టుకునే అవకాశం లేదని, దానికి అంతర్ రాష్ట్ర జల మండలి అంగీకారం కావల్సిఉంటుందని మాజీ హోమ్ సెక్రెటరి అన్నారు. తెలంగాణా ఏర్పాటు వల్ల దేశంలో ప్రత్యేక రాష్ట్రం కోసం చేస్తున్న డిమాండ్లకు మరింత ఊపందుకుంటాయన్న అభిప్రాయాన్ని అంగీకరిస్తూ, రెండవ రాష్ట్ర పునర్విభజన కమిటీ (ఎస్సార్సీ) ఏర్పాటు చేయడమే దానికి పరిష్కారమని పిళ్లై అన్నారు. ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటుచేయడానికి ఒక ప్రాతిపదికను రెండవ ఎస్సార్సీ స్పష్టంగా రూపొందించాలన్నారు. ఆ తర్వాత మాత్రమే, కొత్త రాష్ట్రాల డిమాండ్ మీద పార్లమెంటు తరిచి నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. -
పోరాటం..అవిశ్రాంతం
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుండటంతో సమైక్యాంధ్ర ఉద్యమం అదేస్థాయిలో ఉవ్వెత్తున కొనసాగుతోంది. తెలుగుజాతిని విడదీయవద్దంటూ జిల్లావాసులు అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు. గురువారం సమైక్యాంధ్రకు మద్దతుగా వివిధ ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కర్నూలులో సమైక్యాంద్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో జేడ్పీ గాంధీ విగ్రహం వద్ద నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు. అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహా త్ముని విగ్రహం ఎదుట మోకాళ్లపై కూర్చొని ఆందోళన జరిపారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది కూడా కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు అర్ధనగ్నంగా రాజ్‌విహార్ వరకు ప్రదర్శన నిర్వహించి జిల్లా పరిషత్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. ఆదోనిలో ట్రాన్స్‌కో ఉద్యోగులు ఆదిమానవుల వేషధారణలో ప్రదర్శన నిర్వహిం చారు. బనగానపల్లెలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లెగర్జన విజయవంతమైంది. నంద్యాలలో పీఆర్, రెవెన్యూ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి. డోన్ పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో 71వరోజు దీక్షలు కొనసాగాయి. వెల్దుర్తిలో ప్రైవేటు స్కూలు యా జమన్యం ఆధ్వర్యంలో అర్థనగ్నంగా దీక్షలు చేపట్టారు. పత్తికొండలో జేఏసీ చేపట్టిన రిలేనిరహార దీక్షల్లో 20 మంది మహిళా ఉపాధ్యాయినులు పాల్గొన్నారు. వీరికి వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు, మాజీ మండలాధ్యక్షురాలు ఎస్.నాగరత్నమ్మ, కాంగ్రెస్ నాయకులు ప్రమోద్కూమార్రెడ్డి సంఘీభావం తెలిపారు. దేవనకొండలో ఐరన్బండబీ సెంటర్ గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో సమైక్యవాదులు యోగా కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగులు పట్టణంలోని హెచ్‌బీఎస్ కాలనీలోని టేకు వనంలో శ్రమదానం చేశారు. -
'సమైక్య ఉద్యమం ఢిల్లీ గాంధీలకు సరిపడటం లేదు'
అనంతపురం: ప్రస్తుతం చేస్తున్న సమైక్య ఉద్యమం ఢిల్లీ గాంధీలకు సరిపడలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. రెండు నెలలకు పైగా సీమాంధ్రలో చేస్తున్న తీవ్ర రూపం దాల్చినా ఢిల్లీ అధిష్టానానికి కన్పించకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఢిల్లీ పెద్దలపై విరుచుకుపడ్డారు. గాంధీ మార్గంలో చేస్తున్న సమైక్య ఉద్యమం ఢిల్లీ గాంధీలకు సరిపడటం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీ గాంధీలు దిగివచ్చే వరకూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఇందులో సరికొత్త వ్యూహాలతో ముందుకుపోతూ ఉద్యమ రూపు రేఖల్ని మార్చాల్సిన అవసరం ఉందని కాపు రామచంద్రారెడ్డి సూచించారు.