తెలంగాణ ఏర్పాటుకు ఇది సందర్భం కాదు: జికె పిళ్లై
ముంబై: తెలంగాణ ఏర్పాటుకి ఇది సందర్భం కాదని కేంద్ర హోమ్ శాఖ మాజీ సెక్రటరి గోపాల కృష్ణ పిళ్లై (జికె పిళ్లై) వ్యాఖ్యానించారు. ముంబై నుంచి వెలువడే ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డిఎన్ఎకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణా ప్రజలు ఎంతో కాలంగా కోరుకుంటున్నారని అంటూనే, అయితే ఇది సరైన సమయం కాదని ఆయన అన్నారు.
తెలంగాణాకి ప్రత్యేక ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయడమన్నది జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చేసిన సూచనల్లో అత్యుత్తమమైందని పిళ్లై అభిప్రాయపడ్డారు. ఆ ప్రయోగం ఎటువంటి ఫలితాన్నిస్తుందో రెండు మూడేళ్లు చూశాక, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై అప్పుడు నిర్ణయం తీసుకొని ఉండవల్సిందని ఆయన అన్నారు.
రాజధాని విషయంలో శ్రుతి మించిన యాగీ జరుగుతోంది గానీ, నీటి సమస్యే ప్రధానమైనదని, ప్రత్యేక రాష్త్ర ఆవిర్భావం వల్ల తలెత్తే ముఖ్యమైన సమస్యల గురించి అడిగిన ఒక ప్రశ్నకి బదులుగా అన్నారు. సారవంతమైన కోస్తా భూములకి నీరు తెలంగాణా నుంచే రావలసి ఉన్నందు వల్ల, తెలంగాణాలో ఆనకట్టలు కడితే తాము ఏమైపోతామోనన్న ఆందోళన కోస్తా ప్రజల్లో ఉందని ఆయన అన్నారు. అయితే, ఆనకట్టలు ఎవరి ఇష్టమొచ్చినట్టు వారు కట్టుకునే అవకాశం లేదని, దానికి అంతర్ రాష్ట్ర జల మండలి అంగీకారం కావల్సిఉంటుందని మాజీ హోమ్ సెక్రెటరి అన్నారు.
తెలంగాణా ఏర్పాటు వల్ల దేశంలో ప్రత్యేక రాష్ట్రం కోసం చేస్తున్న డిమాండ్లకు మరింత ఊపందుకుంటాయన్న అభిప్రాయాన్ని అంగీకరిస్తూ, రెండవ రాష్ట్ర పునర్విభజన కమిటీ (ఎస్సార్సీ) ఏర్పాటు చేయడమే దానికి పరిష్కారమని పిళ్లై అన్నారు. ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటుచేయడానికి ఒక ప్రాతిపదికను రెండవ ఎస్సార్సీ స్పష్టంగా రూపొందించాలన్నారు. ఆ తర్వాత మాత్రమే, కొత్త రాష్ట్రాల డిమాండ్ మీద పార్లమెంటు తరిచి నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.