Samaikyandhra Resultion
-
ఎర్రచందనం స్మగ్లర్ల వెనుక కిరణ్: భూమన
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాల్సిన అవసరముందన్నారు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ది సాధ్యం కాదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ జాతీయపార్టీల మద్దతు కూడగట్టారని తెలిపారు. కేంద్రానికి సీఎం కిరణ్ తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల వెనక సీఎం హస్తముందని అన్నారు. సీఎం సోదరుడి ప్రోత్సాహం వల్లే స్మగ్లర్లు చెలరేగిపోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు నిజమైన స్నేహితుడు చంద్రబాబేనని కరుణాకర రెడ్డి ఎద్దేవా చేశారు. -
సీఎం కిరణ్ కు వైఎస్ విజయమ్మ లేఖ
-
సమైక్య తీర్మానం చేద్దాం: వైఎస్సార్సీపీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రజల్లోకి వచ్చీ రావడంతోనే సమైక్య ఉద్యమం ఒక్కసారిగా మరింత ఊపందుకుంది. 16 నెలల చెర నుంచి మంగళవారం బెయిల్‌పై విడుదల అవ్వగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్య ఉద్యమ బాటలో పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా కొనసాగేలా చూసేందుకు భారీ ఉద్యమానికి సమాయత్తం కావాలంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, నేతలకు ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగంగానే... రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపేందుకు తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలని పార్టీ ఎమ్మెల్యేలు గురువారం డిమాండ్ చేశారు. శుక్రవారం వారు స్పీకర్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయనున్నారు. సెప్టెంబర్ 30న జగన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలంతా గవర్నర్‌ను కూడా కలిసి సమైక్య తీర్మానం కోసం అసెంబ్లీని సమావేశపరచాలని కోరనున్నారు. మరోవైపు ఇదే డిమాండ్‌తో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. విభజనపై కేబినెట్ నోట్ సిద్ధం కాకముందే సమైక్య తీర్మానం చేసి హస్తినకు పంపాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు సమైక్య రాష్ట్రం కోసం ముందునుంచీ గళమెత్తుతున్న పార్టీలను కూడా కలుపుకుని మరింత ఉధృతంగా ఉద్యమించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. అందులో భాగంగా సీపీఎం రాష్ట్ర అగ్ర నేతలను వైఎస్సార్సీపీ నేతలు గురువారం కలిసి చర్చించారు. దాంతోపాటు సమైక్యాంధ్ర కోసం అక్టోబర్ 4న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరగనున్న రైతు ఆందోళన, ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొనాలని కూడా జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారు. అందుకు అనుమతి కోరుతూ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇంకోవైపు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం శుక్రవారం ఢిల్లీలో నిర్వహిస్తున్న ఆందోళనలో విజయమ్మ కూడా పాల్గొననున్నారు. -
నోట్‌కు ముందే తీర్మానం
* వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్.. సీఎంకు లేఖ * విభజనకైనా, ఏకీకరణకైనా అసెంబ్లీ తీర్మానం సంప్రదాయం.. * అదే సంప్రదాయం ప్రకారం ముందుగానే సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపుదాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయడానికి తక్షణమే శాసనసభను సమావేశ పరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పార్టీ శాసనసభాపక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. విభజన నోట్ కేంద్ర కేబినెట్ ముందుకు రావడానికి ముందే ఈ తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాల్సిన అవసరముందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి గురువారం ఆమె లేఖ రాశారు. అందులోని వివరాలిలా ఉన్నాయి... ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని జూలై 30న సీడబ్ల్యూసీ ఏకపక్షంగా, అడ్డగోలుగా ఏకగ్రీవ తీర్మానం చేసిన నాటి నుంచీ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అక్కడ జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోయాయి. ఈ అవాంఛిత రాజ్యాంగ సంక్షోభానికి పూర్తి బాధ్యత వహించాల్సింది కేంద్ర, రాష్ట్రాలు రెండింట్లోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకోవడం సముచితం. సంబంధిత రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేయనిదే కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ మొదలే కాబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. పైగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం మొదటి ఎస్సార్సీ సిఫార్సుల మేరకే జరిగినా... ఆ మేరకు ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాల విలీనానికి అంగీకరిస్తూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీల నుంచి తీర్మానాలు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి, అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కేబినెట్ నోట్ సిద్ధమవక ముందే తీర్మానాన్ని ఆమోదించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. - వైఎస్ విజయమ్మ