వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రజల్లోకి వచ్చీ రావడంతోనే సమైక్య ఉద్యమం ఒక్కసారిగా మరింత ఊపందుకుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రజల్లోకి వచ్చీ రావడంతోనే సమైక్య ఉద్యమం ఒక్కసారిగా మరింత ఊపందుకుంది. 16 నెలల చెర నుంచి మంగళవారం బెయిల్‌పై విడుదల అవ్వగానే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య ఉద్యమ బాటలో పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా కొనసాగేలా చూసేందుకు భారీ ఉద్యమానికి సమాయత్తం కావాలంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు, నేతలకు ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగంగానే... రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపేందుకు తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలని పార్టీ ఎమ్మెల్యేలు గురువారం డిమాండ్ చేశారు.
శుక్రవారం వారు స్పీకర్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయనున్నారు. సెప్టెంబర్ 30న జగన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలంతా గవర్నర్‌ను కూడా కలిసి సమైక్య తీర్మానం కోసం అసెంబ్లీని సమావేశపరచాలని కోరనున్నారు. మరోవైపు ఇదే డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. విభజనపై కేబినెట్ నోట్ సిద్ధం కాకముందే సమైక్య తీర్మానం చేసి హస్తినకు పంపాలని ఆమె డిమాండ్ చేశారు.
మరోవైపు సమైక్య రాష్ట్రం కోసం ముందునుంచీ గళమెత్తుతున్న పార్టీలను కూడా కలుపుకుని మరింత ఉధృతంగా ఉద్యమించాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. అందులో భాగంగా సీపీఎం రాష్ట్ర అగ్ర నేతలను వైఎస్సార్‌సీపీ నేతలు గురువారం కలిసి చర్చించారు. దాంతోపాటు సమైక్యాంధ్ర కోసం అక్టోబర్ 4న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరగనున్న రైతు ఆందోళన, ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొనాలని కూడా జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారు. అందుకు అనుమతి కోరుతూ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇంకోవైపు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం శుక్రవారం ఢిల్లీలో నిర్వహిస్తున్న ఆందోళనలో విజయమ్మ కూడా పాల్గొననున్నారు.