‘సమైక్యం కోసమే శంఖారావం
కర్నూలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయన సోదరి షర్మిల సమైక్య శంఖారావం పేరిట బస్సు యాత్ర చేస్తున్నారని ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అదనపు పరిశీలకులు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
మంగళవారం ఎస్వీ కాంప్లెక్స్‌లోని సమావేశ భవనంలో పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కర్నూలు, కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, నగర కన్వీనర్ బాలరాజు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, నిడ్జూరు రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ గిడ్డయ్య, తోట వెంకటక్రిష్ణారెడ్డి తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల బస్సు యాత్ర వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 5వ తేదీన ఉదయం 10 గంటలకు డోన్‌లో, సాయంత్రం 5 గంటలకు కర్నూలులోని పాతబస్టాండ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో షర్మిల పాల్గొని ప్రసంగిస్తారన్నారు. 6వ తేదీ ఉదయం 10 గంటలకు నంద్యాల బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం.. సాయంత్రానికి షర్మిల బస్సు యాత్ర కడప జిల్లాలోకి ప్రవేశిస్తుందన్నారు.
రెండు ప్రాంతాలు కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని నమ్మి ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని తమ పార్టీ ప్లీనరీ నుంచి నేటి వరకు అనేక పర్యాయాలు లేఖల్లో కోరిందని.. కాంగ్రెస్, టీడీపీలు మాత్రం ఓట్లు, సీట్ల కోసమే స్వార్థ రాజకీయాలకు తెర తీశాయన్నారు. కర్నూలులో లక్ష గళ ఘోష నినాదంతో చేసిన కార్యక్రమం సీమాంధ్రలోని 13 జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తమ వైఖరి ప్రకటించిన తర్వాతే ఆందోళనల్లో పాల్గొనాలని.. అప్పటి వరకు ఆయా పార్టీల నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెబుతూనే చంద్రబాబు నాయుడు సీమాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తున్నాడంటే ఇక్కడి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కుమారుడిని ప్రధానిని చేసుకోవడం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రక్రియకు సోనియా గాంధీ శ్రీకారం చుట్టారని విమర్శించారు. 35 రోజుల పాటు నిరంతరాయంగా సమైక్య ఉద్యమం సాగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటే ఉద్యమ స్వరూపం మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, వ్యాపార వాణిజ్య వర్గాలు షర్మిలమ్మ శంఖారావం బస్సు యాత్రకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.