సినీ గీతాల కన్నా సనాతన ధర్మమే ఆకట్టుకుంది
ఆర్ష సాహిత్యంపై దాడులు పెరుగుతున్నాయి
మన ధర్మాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నం
చాగంటికి కులపరమైన ఉద్దేశాలు అంటగట్టొద్దు
‘సాక్షి’తో సామవేదం షణ్ముఖ శర్మ ప్రత్యేక ఇంటర్వ్యూ
రాజమహేంద్రవరం కల్చరల్ : ‘సినీ పరిశ్రమలో పాటలు రాస్తున్న సమయంలోనే వైదిక వాజ్ఞ్మయంపై కొన్ని చానళ్లలో ప్రసంగించే అవకాశం వచ్చింది. దీంతో ప్రవచనాలతో బిజీ అయిపోయాను. సినిమాలకు పాటలు రాయడం కన్నా... సనాతన ధర్మప్రచారమే నన్ను ఆకట్టుకుంది. నా మనసుకు నచ్చిన మార్గాన్ని ఎంచుకున్నా’నని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. కొంతమూరులో ఆయన నిర్మించిన శ్రీవల్లభ గణపతి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో నగరానికి వచ్చిన ఆయన సోమవారం ‘సాక్షి’తో ప్రత్యేకం మాట్లాడారు. ఆయన మాటల్లోనే...
బాలు ఆ నిర్మాతకు చివాట్లు పెట్టారు
నేను రాసిన సినీగీతంలో ఒక పదం అర్థం కావడంలేదు కనుక, ఆ పదాన్ని మార్చమని ఓ నిర్మాత నన్ను అడిగారు. దాన్ని మార్చి మరో పదం రాశాను. పాడటానికి వచ్చిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆ పదాన్ని ఎందుకు మార్చవలసివచ్చిందని నన్ను అడిగారు. నిర్మాత కోరిక మేరకు మార్చానని చెప్పాను. బాలు ఆ నిర్మాతకు చివాట్లు పెట్టి, పాత పదాన్నే ఉంచారు.
బాపు, రమణలు ఎంతో ప్రోత్సహించారు
భాగవతం సీరియల్కు పాటలు రాయడానికి బాపు, రమణలు నన్ను ఆహ్వానించారు. వారితో సంభాషణల్లో ఎక్కువగా భారత, భాగవత, రామాయణాల నుంచి కోట్ చేస్తుండేవాడిని. నా చేత వాళ్లు మళ్లీ మళ్లీ మాట్లాడించుకునేవారు.
మంచిని తీసుకుందాం
మన ప్రాచీన కావ్యాలు, ఆర్ష సాహిత్యంపై దాడులు ఎక్కువవుతున్నాయి. నేటి కాలానికి అన్వయించని విషయాలుంటే వాటిని పరిహరించి, మంచిని తీసుకుందాం. మన ధర్మాన్ని దెబ్బతీయడానికి కొందరు కుహనా మేధావులను పురిగొల్పుతున్నారు. ఈ కుహనా మేధావులు ఆర్షసాహిత్యాన్ని చూస్తున్న కోణంలో గతంలో ఎవరూ చూడలేదు. హృదయం నిర్మలంగా లేకుంటే అద్భుతాలు కూడా అసహ్యంగానే కనిపిస్తాయి.
ఇవి ఉపాసనకు సంబంధించిన అంశాలు
గణపతి కల్యాణం, హనుమంతుని కల్యాణం ఇత్యాదులు కథాపరమైన అంశాలు కావు. ఉపాసనకు సంబంధించిన అంశాలు. హనుమ జ్ఞానమూర్తి. జ్ఞానం ఉన్నచోట వర్చస్సు ఉంటుంది. కనుక హనుమంతునికి, సువర్చలకు వివాహం జరిపిస్తున్నాం. గణపతి బుద్ధిప్రదాత కనుకనే సిద్ధిబుద్ధిలతో గణపతి కల్యాణం జరిపిస్తున్నాం.
చాగంటిని కులాల ఉచ్చులోకి లాగొద్దు
సరస్వతీపుత్రుడు చాగంటి కోటేశ్వరరావు మీద కువిమర్శలు సనాతనధర్మంపై జరుగుతున్న దాడులుగానే భావించాలి. చాగంటికి కులపరమైన ఉద్దేశాలు అంటగట్టడం మంచి పద్ధతి కాదు.