samjhauta express blasts
-
అన్ని ‘సంఝౌతా’ కేసులేనా?
సాక్షి, న్యూఢిల్లీ : 12 ఏళ్ల క్రితం 68 మంది ప్రయాణికులను బలితీసుకున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుడు కేసులో నిందితులంతా విడుదలయ్యారు. నెంబర్ వన్ నిందితుడు స్వామి అసీమానంద్ సహా నిందితులందరిని మార్చి 20వ తేదీన కేసును విచారించిన ప్రత్యేక కోర్టు విడుదల చేసిన విషయం తెల్సిందే. నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలను సమర్పించడంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విఫలమైనే కారణంగానే నిందితులను విడుదల చేస్తున్నట్లు ప్రత్యేక కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఇంతకుముందు మక్కా మసీదు, ఆజ్మీర్ షరీఫ్ బాంబు పేలుళ్ల కేసుల నుంచి కూడా స్వామి అసీమానంద్ సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగానే విడుదలయ్యారు. హిందూత్వ టెర్రర్ కేసులన్నింటిలో సరైన సాక్ష్యాధారాలు సేకరించడంలో ఎన్ఐఏ విఫలమైందంటూ కోర్టులు పలు సార్లు ఆరోపించడం ఇక్కడ గమనార్హం. ప్రత్యేక కోర్టు తీర్పుతో విడుదలైన అసీమానంద బయటకు రాగానే తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. 2010, డిసెంబర్ నెలలో, 2011, జనవరి నెలలో బాంబు పేలుళ్ల వెనక తన హస్తం ఉందని కోర్టు ముందు అసీమానంద స్వయంగా వాంగ్మూలం ఇచ్చారు. కొన్ని నెలల తర్వాత మాటమార్చి పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేయడం వల్ల అలా తాను వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత ‘కారవాన్’ అనే వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను పోలీసులు చిత్ర హింసలకు గురిచేశారన్న విశయాన్ని ఖండించారు. ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన అన్ని హింసాత్మక సంఘటనల్లో తన హస్తం ఉందని గర్వంగా చెప్పుకున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ముస్లింలు లక్ష్యంగా జరిగిన అన్ని బాంబు పేలుళ్ల సంఘటనలకు ఆరెస్సెస్ నాయకులు మోహన్ భగవత్, ఇంద్రేశ్ కుమార్ల దీవెనలు కూడా ఉన్నాయని ఆయన ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2006లో జరిగిన మాలెగావ్ బాంబ్ కేసు, 2007లో జరిగిన సంఝౌతా బాంబ్ కేసు, 2007లో జరిగిన మెక్కా మసీదు పేలుడు కేసు, 2007లోనే జరిగిన అజ్మీర్ షరీఫ్ పేలుడు కేసు, 2008లో జరిగిన మాలేగావ్ మరో కేసు... వీటన్నింటి వెనక హిందూత్వ శక్తుల హస్తం ఉందనే ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. ఈ అన్ని కేసుల వెనక హిందూత్వ శక్తుల నెట్వర్క్ హస్తం ఉందనడానికి సరైన ఆధారాలు ఉన్నాయని ‘సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుడు కేసు’ ప్రత్యేక దర్యాప్తు బృందానికి మూడేళ్లపాటు నాయకత్వం వహించిన హర్యానా పోలీసు అధికారి వికాస్ నారాయణ్ రాయ్ 2016, జూన్ 6వ తేదీన ‘ది వైర్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ కేసు దర్యాప్తు సందర్భంగా ఆయన ఇండోర్ వెళ్లడం, అక్కడి ఆరెస్సెస్ సభ్యుడు సునీల్ జోషి, అతని ఇద్దరు అనుచరుల హస్తం ఉందని విచారణలో తేలడం, ఆ బృందం సునీల్ జోషిని అరెస్ట్ చేసేలోగా ఆయన హత్య జరగడం తదితర పరిణామాల గురించి పోలీసు అధికారి వికాస్ నారాయణ్ రాయ్ పూసగుచ్చినట్లు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. సంఝాతా కేసులో నిందితులను మార్చి 20వ తేదీన ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ‘ది వైర్ న్యూస్’ నాటి వికాస్ నారాయణ్ రాయ్ ఇంటర్వ్యూను ఈ మార్చి 21వ తేదీన పునర్ ప్రచురించింది. ఈ హిందూత్వ కేసుల దర్యాప్తును 2011లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) స్వీకరించినప్పటి నుంచి కొన్ని కేసులు కాల గర్భంలో కలిసి పోయాయి. కొన్ని కేసుల్లో సాక్ష్యాధారాలు లేక నిందితులు విడుదలయ్యారు. కొన్ని కేసుల్లో నిందితులంతా బెయిల్‌పై విడుదలయ్యారు. ఒక్క కేసులో కూడా ఒక్క నిందితుడికి కూడా శిక్ష పడలేదు. 2008 నాటి మాలెగావ్ కేసులో నిందితులైన సాధ్వీ ప్రజ్ఞా, లెఫ్ట్‌నెంట్ కల్నల్ పురోహిత్ బెయిల్‌పై విడుదలయ్యారు. నాటి ఆరెస్సెస్ స్థానిక నాయకుడు ఇంద్రేశ్ కుమార్ నేడు ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎదిగారు. సాక్ష్యాధారాలు లేక సంఝౌతా కేసు నుంచి కూడా పురోహిత్ విడుదలయ్యారు. ఎవరి మధ్య ఏం ‘సంఝౌతా’ కుదరిందోగానీ నేరస్థులతా తప్పించుకున్నారు. దేశంలో జరగుతున్న టెర్రరిస్టు దాడుల కేసులను త్వరతిగతిన దర్యాప్తు జరిపి నేరస్థులకు తగిన శిక్ష విధించేందుకు 2009లో కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ సంస్థను ఏర్పాటు చేసింది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ టెర్రరిస్టు కేసుల దర్యాప్తునకు ఏ రాష్ట్రం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంస్థకు చీఫ్‌గా 2017లో ఐపీఎస్ అధికారి వైసీ మోదీ నియమితులయ్యారు. -
అంతా దుష్ప్రచారమని తేలింది
న్యూఢిల్లీ: హిందూ ఉగ్రవాదం, గోద్రా ఘటన, నీరవ్ మోదీ కేసులపై కొందరు చేసిన దుష్ప్రచారం ఒక్కరోజులోనే బట్టబయటైందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం అన్నారు. బుధవారం సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో పేలుడు కేసులో కింది కోర్టు యూపీఏ ప్రభుత్వం ఆపాదించిన హిందూ ఉగ్రవాదం అభియోగాన్ని కొట్టేసిందనీ, గోద్రా కేసులో మరో వ్యక్తిని దోషిగా తేల్చిందనీ, నీరవ్ మోదీ లండన్‌లో అరెస్టయ్యాడనీ, ఇవన్నీ ఒకే రోజు జరిగాయని జైట్లీ చెప్పారు. ‘నిజానికి, అబద్ధానికి ఉన్న ప్రాథమిక తేడా ఏంటంటే నిజం నిలిచి ఉంటుంది. అబద్ధం పడిపోతుంది. కొందరు చేసిన దుష్ప్రచారమంతా అబద్ధమని తేలింది. నిజం గెలిచింది’అని జైట్లీ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. -
దక్కని న్యాయం
పన్నెండేళ్లక్రితం ఢిల్లీ నుంచి లాహోర్ వెళ్తున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో అమృత్‌సర్‌కు సమీపంలోని అట్టారిలో పేలుడు సంభవించి 68మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతంలో నిందితులుగా ఉన్న వారంతా నిర్దోషులేనని బుధవారం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో కేసు కొట్టేస్తున్నట్టు ప్రత్యేక న్యాయమూర్తి చెప్పారు. అన్ని కేసుల్లో జరిగినట్టే ఇక్కడ కూడా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు చెందినవారు తమకు న్యాయం దక్కలేదని విలపిస్తుంటే... ఇంత సుదీర్ఘకాలం తర్వాత తమ నిర్దోషిత్వం బయటపడిం దని విడుదలైనవారు చెబుతున్నారు. మన న్యాయస్థానాల్లో ఏళ్లతరబడి విచారణ సాగడం, తీర్పులు వెలువడటం రివాజే. ఇందువల్ల నిజమైన నేరస్తులు తప్పించుకుంటున్నట్టే, ఏ నేరమూ చేయని వారు అన్యాయంగా ఏళ్ల తరబడి జైలు జీవితం గడపవలసి వస్తున్నది. ఇప్పుడు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చిన కేసు అనేకవిధాల కీలకమైనది. ఇందులో మరణించినవారిలో, గాయపడినవా రిలో అత్యధికులు పాక్ పౌరులు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ఉదంతానికి ముందు, తర్వాత దేశంలో చాలాచోట్ల ఉగ్రవాద ఘటనలు జరిగాయి. కానీ దానికి ముందు జరిగిన దాదాపు అన్ని ఉదంతా ల్లోనూ వివిధ ఉగ్రవాద సంస్థల్లో పనిచేస్తున్న ముస్లిం యువకులు అరెస్టయ్యేవారు. సంఝౌతా పేలుడు ఉదంతం కూడా ఆ సంస్థల పనేనని చాలామంది అనుకున్నారు. కానీ ఎన్ఐఏ తొలిసారి హిందూ అతివాద సంస్థకు చెందినవారికి ఇందులో ప్రమేయమున్నదని నిర్ధారించింది. దీనికన్నా ముందు 2006లో 37మంది మరణానికి దారితీసిన మాలెగావ్ పేలుళ్ల కేసులో 9మంది ముస్లిం యు వకులు నిందితులని మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక బృందం, అనంతరం సీబీఐ కూడా నిర్ధారిం చాయి. 2011లో ఎన్ఐఏ ఆ నిందితులకు దీంతో ఎలాంటి ప్రమేయమూ లేదని, ఇది అతివాద హిందూ సంస్థ పని అని తేల్చింది. ముస్లిం యువకులకు బెయిల్ మంజూరైంది. హిందూ అతివాద సంస్థకు చెందిన 8మందిపై అభియోగాలు మోపినా 2016లో ఈ కేసులో నిందితులందరూ నిర్దోషు లని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. సంఝౌతా కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి ఇప్పుడు నిర్దోషిగా విడుదలైన అసీమానంద ఈ ఉదంతంలో మాత్రమే కాదు...మాలెగావ్ పేలుళ్లు, అజ్మీర్ పేలుళ్లు, హైదరాబాద్‌లోని మక్కా మసీదు పేలుళ్లలో తనతోపాటు మరికొందరు పరివార్ నేతల ప్రమేయమున్నదని అంగీకరించాడని అప్పట్లో ఎన్ఐఏ ప్రకటించింది. ఇది పెను దుమారానికి దారితీసింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడిచింది. కావాలనే ఆరెస్సెస్ నేతలను ఈ పేలుళ్ల కేసుల్లో ఇరికించి అప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నారని బీజేపీ ఆరోపిస్తే... ఆరెస్సెస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కోరింది. రాజకీయంగా ఇంత కలకలం సృష్టించిన కేసు గనుక ఎన్ఐఏ ఎంతో జాగ్రత్తగా దర్యాప్తు జరుపుతుందని అందరూ ఆశిస్తారు. నిజానికి దేశంలో పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదాన్ని అరికట్టడానికే ఆ సంస్థను ఏర్పాటు చేశారు. 2009లో ఆవిర్భవించిన ఆ సంస్థకు ఉగ్రవాద కేసుల దర్యాప్తులో నిజానికి మంచి పేరుంది. అది ఇంతవరకూ దర్యాప్తు చేసిన 187 కేసుల్లో 95 శాతం న్యాయస్థానాల్లో రుజువై నిందితులకు కఠినశిక్షలు పడ్డాయి. అయితే సమర్థవంతమైన దర్యాప్తు, పకడ్బందీగా సాక్ష్యాల సేకరణ, సాధ్యమైనంత త్వరగా విచారణ ప్రారంభమై అది చకచకా పూర్తయ్యేలా చూడటం, సాక్షులకు రక్షణ కల్పించడం ఏ కేసులోనైనా అత్యంత కీలకమైనవి. ఇవే దర్యాప్తు సంస్థల సమర్థతకు గీటురాళ్లు. వీటిల్లో ఎక్కడ తడబడినా, అలవిమాలిన జాప్యం చోటుచేసుకున్నా కేసు మొత్తం బోర్లా పడుతుంది. నిజమైన దోషులు తప్పించుకుంటారు. ఇప్పుడు నిర్దోషులుగా విడులైనవారంతా తమను కావాలని ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇందులో ఇరికించిందని, ఉనికిలో లేని హిందూ ఉగ్రవాదాన్ని సృష్టించి, రాజకీయ కక్ష తీర్చు కునేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతం బాధితుల్లో ఎక్కువమంది తమ పౌరులే గనుక ముంబై ఉగ్రదాడి ఉదంతం గురించి పాక్‌ను మన దేశం నిలదీసినప్పుడల్లా మరి సంఝౌతా పేలుళ్ల మాటేమిటని ఆ దేశం ఎదురు ప్రశ్నిస్తోంది. తాజా తీర్పు వెలువడ్డాక సైతం అది ఇస్లామాబాద్‌లోని మన హైకమిషనర్‌ను పిలిపించి నిరసన తెలియజేసింది. మరణించిన పాక్ పౌరులకు సంబంధించిన కుటుంబసభ్యులుగానీ, గాయపడినవారుగానీ పలుమార్లు సమన్లు జారీ చేసినా ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి రాలేదు. ఇదే రైల్లో పాక్‌లోని తమ బంధువుల్ని చూడటానికి వెళ్తున్న మన పౌరులు కూడా మృతుల్లో ఉన్నారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలతో ఉన్నవారు నిందితుల్ని గుర్తుపట్టలేకపోయారు. నిజానికి అది అసాధ్యం కూడా. అందువల్ల పరిస్థితుల ఆధారంగా నిందితుల ప్రమేయాన్ని రుజువు చేయడమే మార్గం. ఆ విషయంలో కూడా ఎన్ఐఏ విజయం సాధించలేకపోయింది. 2006లో తమ ఇంట్లో జరిగిన ఒక సమావేశంలో అసీమా నందతోపాటు సునీల్ జోషి, సాధ్వి ప్రజ్ఞాసింగ్ వగైరాలు పాల్గొన్నారని, అందులో ఈ పేలుళ్లకు పథకరచన జరిగిందని 2010లో చెప్పిన భరత్ మోహన్‌లాల్ 2015లో ఆ వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకున్నాడు. అతనితోపాటు సాక్షులుగా ఉన్న మరో పదిమంది ఆ పనే చేశారు. బాంబులు సేక రించడానికి, దీనికి అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చడానికి కారకుడని ఎన్ఐఏ భావించిన సునీల్ జోషిని ఆ పేలుళ్ల ఉదంతం తర్వాత కొద్దికాలానికే ‘గుర్తు తెలియని వ్యక్తులు’ హత్య చేశారు. ఆఖరికి ఘటనకు ముందు నిందితులు బస చేసిన డార్మిటరీలో కూడా అందుకు సంబంధించిన రికార్డులు లేవు. ఏతావాతా కేసు వీగిపోయింది. ఇలాంటి కేసుల్లో ఇన్నేళ్లపాటు దర్యాప్తు సాగించాక, విచారణ జరిగాక కూడా దోషుల్ని శిక్షించలేకపోతే అంతర్జాతీయంగా మన దర్యాప్తు సంస్థల, మన న్యాయస్థానాల ప్రతిష్ట మసకబారుతుంది. అందువల్లే ఈ కేసులో ఎన్ఐఏ మరిన్ని జాగ్రత్తలు తీసు కుని ఉంటే బాగుండేది. -
‘సంఝౌతా’లో అసిమానంద్ నిర్దోషి
పంచకుల: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2007 నాటి సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల కేసులో హరియాణాలోని పంచకులలో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న స్వామి అసిమానంద్, లోకేశ్ శర్మ, కమల్ చౌహాన్, రాజిందర్ చౌదరిలను నిర్దోషులుగా ప్రకటించింది. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలను సమర్పించలేకపోయిందని ఎన్ఐఏ ప్రత్యేక జడ్జి జగ్దీప్ సింగ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ కేసులో పాకిస్తాన్‌కు చెందిన ప్రత్యక్ష సాక్షులను విచారించాలని రహీలా వకీల్ అనే పాక్ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. విచారణ కోసం ఎన్ఐఏ అధికారులు పంపిన నోటీసులు తమకు అందలేదని ఆమె న్యాయవాది కోర్టుకు తెలిపారు. తాము భారత్‌కు రాకుండా అధికారులు వీసాలు నిరాకరించారని వెల్లడించారు. అయితే ఈ వాదనల్ని ఎన్ఐఏ న్యాయవాది రాజన్ మల్హోత్రా ఖండించారు.ఈ కేసులో అసిమానంద్ ఇప్పటికే బెయిల్‌పై బయట ఉండగా, మిగతా ముగ్గురు నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. అసలేం జరిగింది? ఢిల్లీ నుంచి లాహోర్‌కు వెళుతున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్ 2007, ఫిబ్రవరి 18న రాత్రి 11.53 గంటలకు హరియాణాలోని పానిపట్ నగరానికి సమీపంలో ఉన్న దివానా రైల్వే స్టేషన్‌ను దాటగానే శక్తిమంతమైన బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో 68 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో అత్యధికులు పాకిస్తాన్ పౌరులే. అక్షర్ధామ్(గుజరాత్), సంకట్మోచన్ మందిర్(వారణాసి), రఘునాథ్ మందిర్(జమ్మూ) సహా దేశవ్యాప్తంగా ఆలయాలపై దాడులకు ప్రతీకారంగానే నిందితులు సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్లు జరిపారని ఎన్ఐఏ చార్జిషీట్లో తెలిపింది. భారత హైకమిషనర్‌కు పాక్ సమన్లు ఈ ఉగ్రదాడిలో చాలామంది పాకిస్తానీలు ప్రాణాలు కోల్పోయారనీ, దోషులను శిక్షించేందుకు భారత విచారణ సంస్థలు సరైనరీతిలో పనిచేయలేదని పాకిస్తాన్ పేర్కొంది. నిందితులను ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడంపై ఇస్లామాబాద్‌లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియాకు సమన్లు జారీచేసి నిరసన తెలిపింది. మతవిద్వేషానికి కేరాఫ్ అసిమానంద్ పశ్చిమబెంగాల్లోని హుగ్లీ జిల్లా కమర్పకూర్‌లో స్వామి అసిమానంద్ జన్మించాడు. పాఠశాల స్థాయిలోనే హిందుత్వ సంస్థ పట్ల ఆకర్షితులయ్యాడు. 1971 సైన్స్ విభాగంలో డిగ్రీ చేశాక వన్‌వాసీ కల్యాణ్ ఆశ్రమంలో సేవకుడిగా చేరాడు. క్రైస్తవ మిషనరీలకు, ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలివ్వడలో దిట్ట. 1990ల్లో గుజరాత్‌లోని దంగ్ జిల్లాలో శబరి ధామ్ ఆశ్రమాన్ని ప్రారంభించాడు. హైదరాబాద్‌లోని మక్కా మసీదు, మహారాష్ట్రలోని మాలేగావ్, రాజస్తాన్‌లోని అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులో అసిమానంద్ నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ మూడు కేసుల్లోనూ అసిమానంద్ నిర్దోషిగా తేలారు. -
సంఝౌతా కేసులో స్వామి అసీమానందకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల కేసులో స్వామి అసీమానందతో పాటు నలుగురిని ఎన్ఐఏ కోర్ట్ నిర్దోషులుగా ప్రకటించింది. 12 ఏళ్ళ తరువాత సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుళ్ళ కేసులో హర్యానా లోని పంచకుల ఎన్ఐఏ కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. బాంబు పేలుళ్లలో నిందితుల హస్తం ఉందని నిరూపించే సాక్షాలు సమర్పించడంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ బృందం విఫలమవడంతో స్వామి అసీమానంద సహా నలుగురు నిందితులకు పంచకుల నేషనల్ ఇన్వెస్టిగేషన్ కోర్ట్ ఊరట కల్పించింది. 2007 ఫిబ్రవరి 18న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో ఐఈడీ పేలుడులో 63 మంది ప్రయాణికులు మరణించారు. బాధితులు పాకిస్తాన్‌కు చెందిన వారు కావడం గమనార్హం. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ నుంచి పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం అఠారీకి వెళుతుండగా హర్యానాలోని పానిపట్ జిల్లా దీవానా రైల్వేస్టేషన్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. పేలుడు కేసుపై దర్యాప్తునకు ఫిబ్రవరి 20, 2007న సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం 2010లో కేసును ఎన్ఐఏకు బదలాయించింది. కాగా దర్యాప్తులో భాగంగా 290 మంది సాక్షులను ఎన్ఐఏ విచారించింది. ఈ కేసులో స్వామి అసీమానంద, సునీల్ జోషి, లోకేష్ శర్మ, సందీప్ డాంగే, రామచంద్ర కలసాంగ్ర, రాజేంద్ర చౌదరి, కమల్ చౌహాన్లను దోషులుగా ఎన్ఐఏ తన చార్జిషీట్లో ఆరోపించింది. ఇక కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొన్న సునీల్ జోషి 2007 లో మధ్యప్రదేశ్ దీవాస్ లో మరణించగా, ఇతర నిందితులు రామచంద్ర కలసాంగ్ర, సందీప్ డాంగేల ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం గమనార్హం -
స్వామి అసిమానందకు బెయిల్ మంజూరు
సమ్ఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల కేసులో నిందితునిగా గత ఆరేళ్లుగా జైల్లో ఉన్న నవకుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసిమానందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే.. బెయిల్ షరతులను ఆయన పాటించకపోవడంతో, అసిమానంద ఇంకా జైల్లోనే ఉండాల్సి వస్తుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం లేకపోవడంతో.. ప్రత్యేకంగా ఒక స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేయడానికి ఏమైనా అవకాశం ఉందేమోనని ఎన్ఐఏ పరిశీలిస్తోంది.