‘సంఝౌతా’లో అసిమానంద్‌ నిర్దోషి | Swami Aseemanand and others acquitted in Samjhauta Express blast case | Sakshi
Sakshi News home page

‘సంఝౌతా’లో అసిమానంద్‌ నిర్దోషి

Published Thu, Mar 21 2019 3:42 AM | Last Updated on Fri, Jul 26 2019 5:49 PM

Swami Aseemanand and others acquitted in Samjhauta Express blast case - Sakshi

కాలిపోయిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ (ఫైల్‌). బుధవారం పంచకుల కోర్టులో అసిమానంద్‌

పంచకుల: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2007 నాటి సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ పేలుళ్ల కేసులో హరియాణాలోని పంచకులలో ఉన్న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న స్వామి అసిమానంద్, లోకేశ్‌ శర్మ, కమల్‌ చౌహాన్, రాజిందర్‌ చౌదరిలను నిర్దోషులుగా ప్రకటించింది. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్‌ సరైన ఆధారాలను సమర్పించలేకపోయిందని ఎన్‌ఐఏ ప్రత్యేక జడ్జి జగ్‌దీప్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ కేసులో పాకిస్తాన్‌కు చెందిన ప్రత్యక్ష సాక్షులను విచారించాలని రహీలా వకీల్‌ అనే పాక్‌ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. విచారణ కోసం ఎన్‌ఐఏ అధికారులు పంపిన నోటీసులు తమకు అందలేదని ఆమె న్యాయవాది కోర్టుకు తెలిపారు. తాము భారత్‌కు రాకుండా అధికారులు వీసాలు నిరాకరించారని వెల్లడించారు. అయితే ఈ వాదనల్ని ఎన్‌ఐఏ న్యాయవాది రాజన్‌ మల్హోత్రా ఖండించారు.ఈ కేసులో అసిమానంద్‌ ఇప్పటికే బెయిల్‌పై బయట ఉండగా, మిగతా ముగ్గురు నిందితులు జ్యుడీషియల్‌ కస్టడీలో కొనసాగుతున్నారు.

అసలేం జరిగింది?
ఢిల్లీ నుంచి లాహోర్‌కు వెళుతున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ 2007, ఫిబ్రవరి 18న రాత్రి 11.53 గంటలకు హరియాణాలోని పానిపట్‌ నగరానికి సమీపంలో ఉన్న దివానా రైల్వే స్టేషన్‌ను దాటగానే శక్తిమంతమైన బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో 68 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో అత్యధికులు పాకిస్తాన్‌ పౌరులే.  అక్షర్‌ధామ్‌(గుజరాత్‌), సంకట్‌మోచన్‌ మందిర్‌(వారణాసి), రఘునాథ్‌ మందిర్‌(జమ్మూ) సహా దేశవ్యాప్తంగా ఆలయాలపై దాడులకు ప్రతీకారంగానే నిందితులు సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్లు జరిపారని ఎన్‌ఐఏ చార్జిషీట్‌లో తెలిపింది.

భారత హైకమిషనర్‌కు పాక్‌ సమన్లు
ఈ ఉగ్రదాడిలో చాలామంది పాకిస్తానీలు ప్రాణాలు కోల్పోయారనీ, దోషులను శిక్షించేందుకు భారత విచారణ సంస్థలు సరైనరీతిలో పనిచేయలేదని పాకిస్తాన్‌ పేర్కొంది. నిందితులను ఎన్‌ఐఏ కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడంపై ఇస్లామాబాద్‌లో భారత హైకమిషనర్‌ అజయ్‌ బిసారియాకు సమన్లు జారీచేసి నిరసన తెలిపింది.

మతవిద్వేషానికి కేరాఫ్‌ అసిమానంద్‌
పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ జిల్లా కమర్పకూర్‌లో స్వామి అసిమానంద్‌ జన్మించాడు. పాఠశాల స్థాయిలోనే హిందుత్వ సంస్థ పట్ల ఆకర్షితులయ్యాడు. 1971 సైన్స్‌ విభాగంలో డిగ్రీ చేశాక వన్‌వాసీ కల్యాణ్‌ ఆశ్రమంలో  సేవకుడిగా చేరాడు. క్రైస్తవ మిషనరీలకు, ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలివ్వడలో దిట్ట. 1990ల్లో గుజరాత్‌లోని దంగ్‌ జిల్లాలో శబరి ధామ్‌ ఆశ్రమాన్ని ప్రారంభించాడు.  హైదరాబాద్‌లోని మక్కా మసీదు, మహారాష్ట్రలోని మాలేగావ్, రాజస్తాన్‌లోని అజ్మీర్‌ దర్గా పేలుళ్ల కేసులో అసిమానంద్‌ నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ  మూడు కేసుల్లోనూ అసిమానంద్‌ నిర్దోషిగా తేలారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement