జైపూర్: 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో సీబీఐకి ఎదురుదెబ్బ తగిలింది. లష్కరే తోయిబా ప్రధాన సభ్యుడు అబ్దుల్ కరీమ్ తుండాను రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. పేలుళ్ల కేసులకు సంబంధించి.. తుండాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
.. అదే సమయంలో ఈ కేసులో అమీనుద్దీన్, ఇర్ఫాన్ అనే ఇద్దరికి జీవితఖైదు విధించింది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కరీం తుండా బాగా దగ్గర. బాంబుల తయారీలో నైపుణ్యం ఉన్నందునే కరీం తుండాను ‘మిస్టర్ బాంబ్’గా పేర్కొంటారు. గతంలో.. లష్కరే తోయిబా, ఇండియన ముజాహిద్దీన్, జైషే మహమ్మద్, బబ్బర్ ఖాల్సా సంస్థలకు పని చేశాడు.
బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా పేర్కొంటూ పలు ఉగ్రసంస్థలు దేశంలో వరుస పేలుళ్లకు పాల్పడ్డాయి. 1993లో కోటా, కాన్పూర్, సూరత్, సికింద్రాబాద్ స్టేషన్ల పరిధిలో రైళ్లలో జరిగిన పేలుళ్లు యావత్ దేశాన్ని షాక్‌కి గురి చేశాయి. ఈ కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. అయితే వివిధ నగరాల్లో నమోదైన ఈ కేసులంటిని ఉగ్రవాద నిరోధక చట్టం ఆధారంగా రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది. కరీం తుండాను నిర్దోషిగా రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించడాన్ని.. సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని సీబీఐ భావిస్తోంది.
సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. కార్పెంటర్ పని చేసే తుండా.. ముంబై పేలుళ్ల తర్వాతే నిఘా సంస్థల పరిశీలనలోకి వచ్చాడు. ఉత్తరాఖండ్ నేపాల్‌సరిహద్దులో 2013లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశాయి. 1996 పేలుడు కేసుకు సంబంధించి హర్యానా కోర్టు అతనికి జీవితఖైదు విధించింది. ఇక.. బాంబు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి కరీం తన ఎడమ చేతిని కోల్పోయాడు.
Comments
Please login to add a commentAdd a comment