భారీగా శ్యాంపిల్ మందుల విక్రయాలు
–ఔషధ నియంత్రణ శాఖ అధికారుల దాడులు
–రూ.2లక్షల విలువ చేసే మందుల స్వాధీనం
కర్నూలు(హాస్పిటల్): నగరంలోని వన్‌టౌన్ ప్రాంతంలో ఓ వ్యక్తి నుంచి ఔషధ నియంత్రణ శాఖ అధికారులు భారీగా శ్యాంపిల్ మందులను స్వాధీనం చేసుకున్నారు. కుమ్మరివీధిలోని సుంకులమ్మ గుడి సమీపంలో నివాసముంటున్న కె.గిరిధర్‌సింగ్ కొన్నేళ్ల క్రితం ఓ మెడికల్ ఏజెన్సీలో పనిచేసేవాడు. మందులపై తనకున్న పరిజ్ఞానంతో పలువురు మెడికల్ రెప్స్‌తో పాటు కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి తదితర ప్రాంతాల నుంచి శ్యాంపిల్ మందులను తెచ్చుకునేవాడు. వీటిని జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్ఎంపీలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి, మహబూబ్‌నగర్, గద్వాల వంటి ప్రాంతాలకు సరఫరా చేసేవాడు. ఆర్ఎంపీలు ఇతని వద్ద తక్కువ ధరకు మందులను కొని రోగులకు ఎక్కువ ధరకు అంటగడుతున్నారు. విషయం తెలుసుకున్న ఔషధ నియంత్రణ శాఖ ఏడీ చంద్రశేఖరరావు నేతృత్వంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు అబిద్‌అలి, జె. విజయలక్ష్మి మంగళవారం ఆయన ఇంటిపై దాడులు నిర్వహించారు. గిరిధర్‌సింగ్ ఇంట్లో లేకపోవడంతో అతనికి ఫోన్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అతను రాకపోవడంతో వీఆర్వో టి.సుదర్శన్‌రెడ్డి సమక్షంలో గోడౌన్ తాళాలు పగులగొట్టి వంద రకాలైన రూ.2లక్షల విలువ చేసే మందులను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మందుల వివరాలు సేకరించి పంచనామా చేశారు. కాగా నిందితుడు గిరిధర్‌సింగ్ పరారీలో ఉన్నాడు.