దయ చూపని ఢిల్లీ ప్రభుత్వం!
న్యూఢిల్లీః సహాయం అడిగితే చీదరింపులు ఎదురయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి 'వీల్స్' అరిగేలా తిరిగినా ఉపయోగం లేకపోయింది. చివరికి సీఎంనే కలసి తన గోడు వెళ్ళబోసుకుందామనుకున్న వికలాంగ వ్యక్తికి... అక్కడా కనికరం కలుగలేదు. తన వీల్ ఛైర్ విరిగిపోయిందని, కొత్త ఛైర్ కొనిమ్మని ఢిల్లీ పెద్దల కాళ్ళా వేళ్ళా పడినా పట్టించుకున్నవారే లేకపోయారు.
దేశ రాజధాని నగరంలో ఓ వికలాంగ వ్యక్తికి ఎదురైన ఛీత్కారాలు సాధారణ ప్రజలకు, చూపరులకు ఆందోళన కలిగించాయి. కొత్త వీల్ ఛైర్ కోసం ఆరు నెలలపాటు ఎక్కిన గుమ్మం ఎక్కకుండా తిరిగినా అధికారుల మనసు కరుగలేదు. రెండుకాళ్ళూ లేక వీల్ ఛైరే ఆధారంగా బతుకుతున్న రాజా.. తకు కొత్త వీల్ ఛైర్ కావాలంటూ సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నో అర్జీలు పెట్టుకున్నాడు. అయతే ప్రభుత్వంనుంచి ఎటువంటి సమాధానం దొరకలేదు. చివరికి పెద్ద బాస్ (సీఎం కేజ్రీవాల్) నే కలసి తన బాధను వివరిద్దామనుకున్నాడు. అక్కడకూడా తీవ్ర అవమానాలను ఎదుర్కొన్న రాజా.. చివరికి చేసేది లేక వెనుదిరిగాడు.
అనంతరం రాజా కష్టాలను విన్న ఓ మనసున్న మారాజు అతడికి వీల్ ఛైర్ ను బహూకరించాడు. ఢిల్లీ పౌరుడు, ఫిల్మ్ మేకర్.. గౌరవ్ ఆగ్రే బహూకరించిన ఛైర్ తో అతని కళ్ళలో చూసిన ఆనందాన్ని వర్ణిస్తూ అతడి ఫొటోలను గౌరవ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.