samsung phone
-
జేబులోనే పేలిన శాంసంగ్ ఫోన్
న్యూఢిల్లీ : శాంసంగ్ కంపెనీకి చెందిన ఓ స్మార్ట్‌ఫోన్ మళ్లీ పేలింది. అయితే ఈ సారి ఛార్జింగ్ పెడుతుండగానో, ఫోన్ మాట్లాడుతుండగానో కాదు జేబులో పెట్టుకోగానే అది పేలిపోయింది. ఈ ఫోన్ పేలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ సారి పేలుడు ఘటను చోటుచేసుకుంటున్న గెలాక్సీ నోట్7 కాదు, శాంసంగ్ గ్రాండ్ డ్యూస్ స్మార్ట్‌ఫోన్ అట. డైలీ మెయిల్ రిపోర్టు ప్రకారం, 47 సంవత్సరాల హోటల్ సూపర్ వైజర్ యులియాన్టో ఇండోనేషియాలోని ఓ హోటల్ లాబీలో వేచి చూస్తున్నాడు. ఒక్కసారిగా ఆయన జేబులో నుంచి హీటింగ్ సెన్సేషన్ రావడం మొదలైంది. అనంతరం ఒక్కసారిగా జేబులోనే ఫోన్ పేలిపోయింది. వెంటనే ఆ మంటలు చొక్కాకు కూడా అంటుకున్నాయి. అనంతరం ఆయన వేచిచూస్తున్న రూమంతా పొగ కమ్ముకుంది. పేలిన ఫోన్ నుంచి మంటలు రావటంతో యులియాన్టో ముఖానికి గాయాలు అయ్యాయి. షాక్ నుంచి తేరుకుని వెంటనే చొక్కా విప్పేసినట్టు యులియాన్టో చెప్పాడు. ఈ ఘటన సెప్టెంబర్ 30న చోటుచేసుకుంది. ఇదంతా యులియాన్టో వేచిచూస్తున్న హోటల్ లాబీ సీసీటీవీలో రికార్డైంది. శాంసంగ్ ఈ ఫోన్‌ను 2013లో లాంచ్ చేసింది. ఫోన్ లో ఒకేసారి వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ ఆన్ చేసి వినియోగించటం వల్లే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై ఇండోనేషియా పోలీసులు, టెలికాం నిపుణులు విచారణ చేపట్టారు. వినియోగదారుల భద్రతను ముఖ్యమైన అంశంగా తీసుకున్న కంపెనీ, అవసరమైన మద్దతంతా కల్పిస్తామని చెప్పింది. గతేడాది గెలాక్సీ నోట్ 7 ఫోన్ పేలుళ్ల ఘటనలతో శాంసంగ్ తీవ్ర ఇరకాటంలో పడిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలు స్మార్ట్ఫోన్ల రారాజును తీవ్రంగా దెబ్బకొట్టాయి. -
విమానంలో ఉండగా.. శాంసంగ్ ఫోన్లో మంటలు
అమెరికాలోని కెంటకీ రాష్ట్రం నుంచి మరికొద్ది సేపట్లో బయల్దేరాల్సిన విమానంలో శాంసంగ్ ఫోనుకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా విమానాన్ని ఖాళీ చేయించారు. కెంటకీ నుంచి బాల్టిమోర్ వెళ్లాల్సిన విమానంలో ఉన్న ప్రయాణికుడి వద్ద ఉన్న శాంసంగ్ ఫోనులోంచి పొగలు వచ్చినట్లు ఒక కస్టమర్ తమకు ఫిర్యాదు చేశారని విమాన సిబ్బంది తెలిపారు. బ్రియాన్ గ్రీన్ అనే వ్యక్తి వద్ద ఉన్న సరికొత్త శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోనులోంచి ఈ పొగలు, మంటలు వచ్చాయని గుర్తించారు. అయితే శాంసంగ్ కంపెనీ మాత్రం.. అతడి వద్ద ఏ ఫోను ఉన్నదీ ఇంకా తమకు స్పష్టం కాలేదని తెలిపింది. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ అధికారులను తాము సంప్రదిస్తున్నామని, కాలిపోయిన ఫోన్ స్వాధీనం చేసుకుని, అందుకు కారణాలేంటో పరిశీలిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ అయిన శాంసంగ్.. తాము ఇప్పటికి 25 లక్షల స్మార్ట్ ఫోన్లను రీప్లేస్ చేశామని చెప్పింది. బ్యాటరీలో లోపం వల్లే ఈ ఫోనుకు మంటలు అంటుకోవడం లేదా పేలడం జరుగుతున్నట్లు తెలిసింది. తాను కూడా ఇలా ఫోన్ మార్చుకున్నానని, అయినా మార్చిన ఫోన్ కూడా మంటలు అంటుకుందని బ్రియాన్ గ్రీన్ చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే కంపెనీ మార్చి ఇచ్చిన ఫోన్లు కూడా అంతంగానే ఉన్నాయన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. కొత్త మోడల్ ఫోన్లకు అమెరికా వినియోగదారుల ఉత్పత్తుల భద్రతా కమిషన్ నుంచి అనుమతి కూడా వచ్చింది. విమానంలో ఉండగా శాంసంగ్ ఫోన్లు వాడొద్దని, వాటిని స్విచాఫ్ చేసి ఉంచాలని చాలావరకు విమానయాన సంస్థలు చెబుతున్నాయి. -
ఫోను కాలిందని.. ప్యాంటు విప్పి పరుగులు!
రోజూలాగే అతగాడు ప్యాంటు జేబులో ఫోన్ పెట్టుకుని.. మోటార్ సైకిల్ మీదు వెళ్తున్నాడు. అంతలో ఉన్నట్టుండి జేబు వేడెక్కినట్లు అనిపించింది. ఎందుకైనా మంచిదని ఫోన్ చూసుకున్నాడు.. అప్పటికే అది బాగా వేడెక్కింది. దాంతో బయటకు తీయబోయాడు.. అప్పటికే అది కాలడం మొదలైంది. కష్టమ్మీద బయటకు తీసి, కింద పారేశాడు. కానీ ఆలోపే ఆయన చేతులు, తొడ భాగాలు కొంతవరకు కాలిపోయాయి. చైనాలోని జాంగ్ అనే యువకుడు జేబులో పెట్టుకున్న ఫోన్ ఏమీ చేయకుండానే దానంతట అదే కాలిపోయిందని చుటియాన్ మెట్రోపోలిస్ డైలీ పత్రిక తెలిపింది. దాంతో అతగాడు అప్పటికప్పుడే రోడ్డుమీద ప్యాంటు విప్పేసి దాన్ని అవతల పారేసి పరుగులు తీయడం మొదలుపెట్టాడు. అతడు వాడుతున్నది కూడా ఆషామాషీ ఫోన్ కాదు. శామ్సంగ్ ఎస్ఎం-జి90089డబ్ల్యు. జాంగ్ గనక వెంటనే స్పందించి ఉండకపోతే.. మరింత పెద్ద ప్రమాదం సంభవించేదట. ఆ ఫోన్‌ను తాను 2014లో ఒక లోకల్ స్టోర్‌లో దాదాపు రూ. 41వేలు పెట్టి కొన్నానని, అందులో విడిభాగాలు కూడా కంపెనీవి తప్ప వేరేవేవీ వాడలేదని జాంగ్ చెప్పాడు. ఇప్పటివరకు ఫోన్ కూడా బాగానే ఉందని, ఉన్నట్టుండి ఎందుకు కాలిపోయిందో తెలియలేదని అన్నాడు. ఈ విషయం తెలిసిన శామ్సంగ్ సిబ్బంది జాంగ్‌కు కాల్ చేసి, ఆ ఫోన్ తమవద్దకు తీసుకురావాలని, దాన్ని పరీక్షిస్తామని చెప్పినట్లు తెలిసింది.