sandalwoods
-
అత్తరు.. అవినీతి కంపు
మడకశిర: ఇంటి పేరు కస్తూరి... ఇంటిలో గబ్బిలాల కంపు అన్న చందంగా మారింది సెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాల తీరు. ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తూ గంధపు చెక్కల స్మగ్లర్లతో సంబంధాలు నెరపుతూ, అక్రమ వ్యాపారానికి తెర తీశారు. ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తున్న ఈ తంతు ఇటీవల పోలీసుల తనిఖీలతో వెలుగు చూసింది. అక్కడ కాదంటే ఇక్కడికొచ్చి... సెంట్ తయారీలో కీలకమైన గంధపు నూనె ఉత్పత్తి ఫ్యాక్టరీల నిర్వహణకు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అనుమతి లేదు. కొన్ని నిబంధనలతో ఫ్యాక్టరీలను నిర్వహించుకునేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కేరళ వాసులు కొందరు మడకశిర నియోజకవర్గం అమరాపురంలో 30 ఏళ్ల క్రితం ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ మూతపడింది. రొళ్ల, అగళి మండలం హుళ్లేకెర, అమరాపురం మండలం బసవనపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. నిబంధనలు గాలికి.. ప్రభుత్వ నిబంధనలను సెంట్ ఫ్యాక్టరీ నిర్వాహకులు తుంగలో తొక్కారు. అటవీ శాఖ అనుమతితో కొనుగోలు చేయాల్సిన గంధపు చెక్కలను నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లోని స్మగ్లర్ల ద్వారా అక్రమ మార్గాల్లో పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుని నూనె ఉత్పత్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమరాపురం మండలం బసవనపల్లి సెంట్ ఫ్యాక్టరీలో అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు రూ.1.25 కోట్లు విలువైన 35 క్వింటాళ్ల గంధపు చెక్కలు, 16 లీటర్ల గంధం నూనెను ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫ్యాక్టరీని సీజ్ చేశారు. ఈ విషయంగా ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. రెన్యూవల్ చేసుకోకుండానే ఫ్యాక్టరీని నడిపిన రోజులూ ఉన్నట్లుగా పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసింది. గంధపు చెక్కలను ఉడకబెట్టే సమయంలో వివిధ రకాల పొట్టు తప్ప కలపను వాడరాదనే నిబంధన ఉంది. అయితే ఫ్యాక్టరీ నిర్వాహకులు యథేచ్ఛగా కట్టెలను వాడి పర్యావరణానికి హాని కలిగించినట్లు గుర్తించారు. నిబంధనలకు పాతరేస్తూ ఉత్పత్తి చేసిన గంధం నూనెను అరబ్ దేశాలకు దొడ్డిదారిన ఎగుమతి చేసి రూ.కోట్లలో నిర్వాహకులు గడించినట్లు తెలుస్తోంది. మామూళ్ల మత్తులో ఫ్యాక్టరీల పర్యవేక్షణను అటవీశాఖ అధికారులు, పోలీసులు గాలికొదిలేశారనే ఆరోపణలున్నాయి. కట్టుదిట్టమైన నిఘా మడకశిర నియోజకవర్గంలోని సెంట్ ఫ్యాక్టరీలపై ఇకపై గట్టి నిఘా పెడతాం. కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాల నుంచి గంధపు చెక్కలు అక్రమంగా ప్యాక్టరీలకు చేరకుండా చర్యలు తీసుకుంటాం. నిబంధనలు పాటించకపోతే ప్యాక్టరీల లైసెన్సులను రద్దు చేస్తాం. -
మాజీ మంత్రి తనయుడి ఇంట్లో డ్రగ్స్
బెంగళూరు: శాండల్ వుడ్ డ్రగ్ కేసులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ దర్యాప్తులో కొంత మంది ప్రముఖులు వారి బంధువులు పేర్లు కూడా ఉన్నాయి. ఇక ఈ లిస్ట్‌లో ఆదిత్య అల్వా కూడా నిందితులుగా ఉన్నారు. ఆదిత్య అల్వా మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ సోదరుడు. శాండల్‌వుడ్ డ్రగ్ కేసులో కాటన్‌పేట్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఆదిత్య 6వ నిందితుడిగా ఉన్నారు. ఆదిత్య అల్వా నివాసంలో ఎన్సీబీ అధికారులు దాడులు చేయగా 55 గ్రాముల పొడి గంజాయి లభించింది. లాక్డౌన్ సమయంలో ఆల్వా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను డ్రగ్ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. పార్టీలో డ్రగ్స్ సేకరించి, సరఫరా చేయడంలో ఆదిత్య అల్వా ప్రధాన పాత్ర పోషించాడని ఇప్పటికే ఎన్సీబీ విచారిస్తున్న నిందితుడు రవిశంకర్ అంగీకరించాడు. ఆదిత్య అల్వా పేరు వెలుగులోకి రావడంతో సెప్టెంబర్ 4 నుంచి పరారీలో ఉన్నాడు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు అవడంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంతవరకు ఆయనకు ఉపశమనాన్ని కలిగించలేదు. క్రైమ్ బ్రాంచ్ అతనికి లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. ఆదిత్యను అరెస్టు చేయడానికి సిద్ధమయ్యింది. చదవండి: డ్రగ్స్ కేసు: తెరపైకి ప్రముఖుల పేర్లు.. -
ఎయిర్‌పోర్టులో గంధపు చెక్కల కలకలం..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గంధపు చెక్కల అక్రమ రవాణా కలకలం సృష్టించింది. అక్రమంగా తరలిస్తున్న 114 కిలోల గంధపు చెక్కలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ నుంచి ఖర్టూమ్‌కు అక్రమంగా తరలించేందుకు యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. సూడాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించిన ఎయిర్పోర్ట్ అధికారులు.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఎర్రచందనం గోడౌన్లు ఖాళీ
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : ఎర్రచందనం దుంగలు గోడౌన్లో ఉన్నాయంటే అక్కడ పని చేసే అధికారులకు నిత్యం టెన్షన్.. కాపలా ఉంటున్న సిబ్బందికైతే కంటిమీద కునుకు ఉండదు. సీసీ కెమెరాలతో 24 గంటలు పర్యవేక్షణ చేయాల్సి వచ్చేది. స్మగ్లర్ల బారి నుంచి విలువైన ఎర్రచందనాన్ని కాపాడుకోవడానికి అటవీశాఖ అధికారులు అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. ఇకపై అటవీశాఖాధికారులకు ఎర్రచందనం కష్టాలు తొలగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అటవీశాఖ కార్యాలయాల్లోని గోడౌన్లలో ఎంతో కాలంగా నిల్వ ఉంచిన చందనం దుంగలను తిరుపతిలోని సెంట్రల్ గోడౌన్లకు తరలిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం నుంచి డీఎఫ్ఓలకు ఆదేశాలు అందాయి. ప్రొద్దుటూరు అటవీశాఖ డివిజన్ పరిధిలో 5 రేంజర్ కార్యాలయాలు ఉన్నాయి. అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఎర్రచందనాన్ని ఆయా రేంజర్ కార్యాలయాలకు తరలిస్తారు. కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి డివిజన్ కార్యాలయానికి తరలించి అక్కడ భద్రపరుస్తారు. ఇలా 10 ఏళ్ల నుంచి ప్రొద్దుటూరులో సుమారు 1600 మెట్రిక్ టన్నులు పైగా చందనం దుంగలను భద్రపరిచారు. గతంలో ఎర్రచందనం గోడౌన్లలో చోరీ ప్రొద్దుటూరు డివిజన్లోని ప్రొద్దుటూరుతో పాటు పలు రేంజర్ కార్యాలయాల్లో గతంలో ఎర్రచందనం దుంగలు చోరీకి గురి అయ్యాయి. అటవీశాఖ సిబ్బంది కొన్నింటిని చోరీ చేసి తరలించగా, కొన్ని చోట్ల గుర్తు తెలియని దొంగలు దుంగలను ఎత్తుకొని వెళ్లారు. చోరీకి సంబంధించి పలువురు సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ కూడా చేశారు. అప్పటి నుంచి చందనం దుంగలు నిల్వ ఉంచిన గోడౌన్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి రక్షణ కోసం 24 గంటల పాటు సిబ్బంది కాపలా కాసేవారు. ఒక విధంగా చెప్పాలంటే గోడౌన్లకు కాపలా కాయడం సిబ్బందికి కత్తిమీద సాములా మారిందని చెప్పవచ్చు. 1200 మెట్రిక్ టన్నులు తిరుపతికి తరలింపు అడవుల్లోనే కాకుండా గోడౌన్లలో కూడా ఎర్రచందనానికి రక్షణ కరువైంది. గతంలో జరిగిన పలు సంఘటనలను దృష్టిలో ఉంచుకొని తిరుపతిలోని సెంట్రల్ గోడౌన్‌కు దుంగలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రొద్దుటూరు అటవీశాఖ డివిజన్ కార్యాలయ గోడౌన్ల నుంచి ఇప్పటి వరక 1200 మెట్రిక్ టన్నుల బీ, సీ గ్రేడ్ చందనం దుంగలను తరలించారు. మరో 30 టన్నులు ఉందని, వాటిని కూడా ప్రత్యేక లారీల్లో తరలిస్తున్నామని డీఎఫ్ఓ గురుప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అటవీశాఖ గోడౌన్లలో నిల్వ ఉన్న దుంగలను తిరుపతికి తరలిస్తున్నారు. చందనాన్ని ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించారు. గతంలో ఇక్కడి నుంచి ఏ గ్రేడ్ దుంగలను మాత్రమే డ్రెస్సింగ్ చేసి తిరుపతిలోని సెంట్రల్ గోడౌన్‌కు తరలించేవారు. గ్లోబల్ టెండర్ల ద్వారా వాటిని విక్రయించేవారు. బీ,సీ గ్రేడ్ల దుంగలు ఆయా అటవీశాఖ గోడౌన్లలోనే ఉండిపోయేవి. ఈ రకాలకు గ్లోబల్ టెండర్లు పిలిచినా టెండర్లలో పాల్గొనే కొనుగోలుదారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీశాఖ గోడౌన్లకు వెళ్లి ఎర్రచందనాన్ని పరిశీలించేవారు. బయ్యర్లకు రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం ఇబ్బందిగా ఉండేది. ఒకే చోట దుంగలు ఉండటం వల్ల కొనుగోలు చేసే వారికి సౌకర్యంగా ఉంటుందని, అంతేగాక భద్రత విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తవని అధికారులు అంటున్నారు. ఇకపై పోలీసు, అటవీశాఖ అధికారుల దాడుల్లో పట్టుబడిన చందనాన్ని వారం రోజుల్లోగా సెంట్రల్ గోడౌన్‌కు తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గోడౌన్లో ఉన్న దుంగలను తూకం వేసి, అది ఏ కేసులో స్వాధీనం చేసుకున్నారో క్రైం నెంబర్ కూడా నమోదు చేసుకొని తిరుపతికి పంపిస్తున్నారు. దుంగలను తిరుపతికి తరలించడంతో ఊపిరి పీల్చుకున్నామని అటవీశాఖ అధికారులు, సిబ్బంది అంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో తరలింపు ప్రభుత్వ ఆదేశాలతో చాలా ఏళ్ల నుంచి నిల్వ ఉంచిన బీ, సీ గ్రేడ్ ఎర్రచందనం దుంగలను తిరుపతిలోని సెంట్రల్ గోడౌన్‌కు తరలిస్తున్నాం. ఇప్పటికే 1200 మెట్రిక్ టన్నులు తరలించాం. ఇంకా 30 టన్నుల వరకు ఉంది. భద్రత కోణంలో ఆలోచన చేసి విలువైన చందనం ఒకే చోట ఉంటే మంచిదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. – గురుప్రభాకర్, డీఎఫ్ఓ, ప్రొద్దుటూరు. -
కంచే గంధం మేసింది..
ఇందిరాపార్కులో గంధపు దుంగల అపహరణ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ తోటమాలి కవాడిగూడ: ఇందిరా పార్కులో కొన్నేళ్లుగా యదేచ్ఛగా సాగుతున్న గంధపు దుంగల దొంగతనం బట్టబయలైంది. పార్కులో పనిచేసే ఓ ఉద్యోగి కాషాయ వస్త్రాలు ధరించి దుంగలను తరలిస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. ఇందిరాపార్కులో సుమారు 250కి పైగా గంధపు చెట్లు సహజంగా మొలిచాయి. పార్కు అధికారులు ఈ చెట్లకు ప్రత్యేక నంబర్లను వేసి సంరక్షిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక రిజిస్ట్రర్ కూడా ఉంది. కానీ దాన్ని సక్రమంగా నిర్వహించడం లేదు. రెండేళ్ల క్రితం పార్కులోని గంధం చెట్లను నరుకుతుండగా ఓ వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. మంగళవారం నరికిన గంధపు దుంగలను స్వామిజీ వేషంలో ఉన్న వ్యక్తి తరలిస్తుండగా సెక్యూరిటీ గార్డులు పట్టుకుని షాక్ తిన్నారు. సదరు వ్యక్తి పార్కులో తోటమాలిగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి భద్రయ్య. ఇతనికి పార్కులోని క్యాంటీన్లో పనిచేసే ఓ యువకుడు సహకరిస్తున్నాడు. గంధపు దుంగలను క్యాంటీన్లోనే భద్రపరచి అనంతరం బయటకు తరలిస్తున్నారు. పార్కులో గంధపు చెట్ల నరికివేతలోను, కొమ్మలు మాయం చేయడంలోను పార్కు అధికారుల అందండలపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం దొరికిన దుంగలు కాల్చిన చెట్ల నుంచి నరికినట్టు ఉండడంతో.. గత 15 రోజుల్లో రెండు సార్లు పార్కులో చెలరేగిన మంటలు ఉద్దేశ పూర్వకంగానే జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై ఇందిరాపార్కు ఉద్యానవన అధికారి శ్రీధర్‌ను వివరణ కోరగా గంధం దుంగల తరలింపుపై గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.