ఎర్రచందనం గోడౌన్‌లు ఖాళీ | Sandalwood Transport To Tirupati From YSR Kadapa | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం గోడౌన్‌లు ఖాళీ

Published Thu, Jan 3 2019 12:59 PM | Last Updated on Thu, Jan 3 2019 12:59 PM

Sandalwood Transport To Tirupati From YSR Kadapa - Sakshi

ప్రొద్దుటూరులో నిల్వ ఉన్న ఎర్రచందనం దుంగలు

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : ఎర్రచందనం దుంగలు గోడౌన్‌లో ఉన్నాయంటే అక్కడ పని చేసే అధికారులకు నిత్యం టెన్షన్‌.. కాపలా ఉంటున్న సిబ్బందికైతే కంటిమీద కునుకు ఉండదు. సీసీ కెమెరాలతో 24 గంటలు పర్యవేక్షణ చేయాల్సి వచ్చేది. స్మగ్లర్‌ల బారి నుంచి విలువైన ఎర్రచందనాన్ని కాపాడుకోవడానికి అటవీశాఖ అధికారులు అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. ఇకపై అటవీశాఖాధికారులకు ఎర్రచందనం కష్టాలు తొలగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అటవీశాఖ కార్యాలయాల్లోని గోడౌన్‌లలో ఎంతో కాలంగా నిల్వ ఉంచిన చందనం దుంగలను తిరుపతిలోని సెంట్రల్‌ గోడౌన్‌లకు తరలిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం నుంచి డీఎఫ్‌ఓలకు ఆదేశాలు అందాయి. ప్రొద్దుటూరు అటవీశాఖ డివిజన్‌ పరిధిలో 5 రేంజర్‌ కార్యాలయాలు ఉన్నాయి. అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఎర్రచందనాన్ని ఆయా రేంజర్‌ కార్యాలయాలకు తరలిస్తారు. కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి డివిజన్‌ కార్యాలయానికి తరలించి అక్కడ భద్రపరుస్తారు. ఇలా 10 ఏళ్ల నుంచి ప్రొద్దుటూరులో సుమారు 1600 మెట్రిక్‌ టన్నులు పైగా చందనం దుంగలను భద్రపరిచారు.

గతంలో ఎర్రచందనం గోడౌన్‌లలో చోరీ
ప్రొద్దుటూరు డివిజన్‌లోని ప్రొద్దుటూరుతో పాటు పలు రేంజర్‌ కార్యాలయాల్లో గతంలో ఎర్రచందనం దుంగలు చోరీకి గురి అయ్యాయి. అటవీశాఖ సిబ్బంది కొన్నింటిని చోరీ చేసి తరలించగా, కొన్ని చోట్ల గుర్తు తెలియని దొంగలు దుంగలను ఎత్తుకొని వెళ్లారు. చోరీకి సంబంధించి పలువురు సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్‌ కూడా చేశారు. అప్పటి నుంచి చందనం దుంగలు నిల్వ ఉంచిన గోడౌన్‌ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి రక్షణ కోసం 24 గంటల పాటు సిబ్బంది కాపలా కాసేవారు. ఒక విధంగా చెప్పాలంటే గోడౌన్‌లకు కాపలా కాయడం సిబ్బందికి కత్తిమీద సాములా మారిందని చెప్పవచ్చు.

1200 మెట్రిక్‌ టన్నులు తిరుపతికి తరలింపు
అడవుల్లోనే కాకుండా గోడౌన్‌లలో కూడా ఎర్రచందనానికి రక్షణ కరువైంది. గతంలో జరిగిన పలు సంఘటనలను దృష్టిలో ఉంచుకొని తిరుపతిలోని సెంట్రల్‌ గోడౌన్‌కు దుంగలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రొద్దుటూరు అటవీశాఖ డివిజన్‌ కార్యాలయ గోడౌన్‌ల  నుంచి ఇప్పటి వరక 1200 మెట్రిక్‌ టన్నుల బీ, సీ గ్రేడ్‌ చందనం దుంగలను తరలించారు. మరో 30 టన్నులు ఉందని, వాటిని కూడా ప్రత్యేక లారీల్లో తరలిస్తున్నామని డీఎఫ్‌ఓ గురుప్రభాకర్‌ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అటవీశాఖ గోడౌన్‌లలో నిల్వ ఉన్న దుంగలను తిరుపతికి తరలిస్తున్నారు. చందనాన్ని ఏ, బీ, సీ గ్రేడ్‌లుగా విభజించారు. గతంలో ఇక్కడి నుంచి ఏ గ్రేడ్‌ దుంగలను మాత్రమే డ్రెస్సింగ్‌ చేసి తిరుపతిలోని సెంట్రల్‌ గోడౌన్‌కు తరలించేవారు. గ్లోబల్‌ టెండర్‌ల ద్వారా వాటిని విక్రయించేవారు. బీ,సీ గ్రేడ్‌ల దుంగలు ఆయా అటవీశాఖ గోడౌన్‌లలోనే ఉండిపోయేవి. ఈ రకాలకు గ్లోబల్‌ టెండర్‌లు పిలిచినా  టెండర్లలో పాల్గొనే కొనుగోలుదారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీశాఖ గోడౌన్‌లకు వెళ్లి ఎర్రచందనాన్ని పరిశీలించేవారు. బయ్యర్లకు రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం ఇబ్బందిగా ఉండేది. ఒకే చోట దుంగలు ఉండటం వల్ల కొనుగోలు చేసే వారికి సౌకర్యంగా ఉంటుందని, అంతేగాక భద్రత విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తవని అధికారులు అంటున్నారు. ఇకపై పోలీసు, అటవీశాఖ అధికారుల దాడుల్లో పట్టుబడిన చందనాన్ని వారం రోజుల్లోగా సెంట్రల్‌ గోడౌన్‌కు తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గోడౌన్‌లో ఉన్న దుంగలను తూకం వేసి, అది ఏ కేసులో స్వాధీనం చేసుకున్నారో క్రైం నెంబర్‌ కూడా నమోదు చేసుకొని తిరుపతికి పంపిస్తున్నారు. దుంగలను తిరుపతికి తరలించడంతో ఊపిరి పీల్చుకున్నామని అటవీశాఖ అధికారులు, సిబ్బంది అంటున్నారు.

ప్రభుత్వ ఆదేశాలతో తరలింపు
ప్రభుత్వ ఆదేశాలతో చాలా ఏళ్ల నుంచి నిల్వ ఉంచిన బీ, సీ గ్రేడ్‌ ఎర్రచందనం దుంగలను తిరుపతిలోని సెంట్రల్‌ గోడౌన్‌కు తరలిస్తున్నాం. ఇప్పటికే 1200 మెట్రిక్‌ టన్నులు తరలించాం. ఇంకా 30 టన్నుల వరకు ఉంది. భద్రత కోణంలో ఆలోచన చేసి విలువైన చందనం ఒకే చోట ఉంటే మంచిదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. – గురుప్రభాకర్, డీఎఫ్‌ఓ, ప్రొద్దుటూరు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement