వీరప్పన్ విజయం మరువలేనిది
⇔ నేపథ్య సంగీత దర్శకుడు శాండీ
⇔ సినీ పరిశ్రమలో మరో తెనాలి కెరటం
⇔ ‘సాక్షి’కి స్పెషల్ ఇంటర్వ్యూ
కళల తెనాలి నుంచి ఎందరో వెండితెరను సుసంపన్నం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఉద్దండులయ్యారు. తెరవెనుక వెలుగులు చిందించిన కలం వీరులు, సాంకేతిక నిపుణులు, సంగీత శిఖామణులూ ఉన్నారు. మళ్లీ ఇప్పుడు ఇక్కడి యువతరం సినీరంగంవైపు చూస్తోంది. అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోంది. ఆ కోవలో ఇప్పుడు శాండీ దూసుకొచ్చారు. ప్రసిద్ధ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’ తో తొలిసారిగా నేపథ్య సంగీత దర్శకుడిగా మారారు. ప్రస్తుతం విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న శాండీ ఆ విశేషాలను ఫోన్లో ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
- తెనాలి
ఎంతో సంతోషం
హాయ్.. నాపేరు సందీప్ అద్దంకి. సినిమా ఇండస్ట్రీలో నా పేరు శాండీ. కిల్లింగ్ వీరప్పన్ సినిమాకు నేపథ్య సంగీతం అందించాను. మొదటి సినిమానే రామ్‌గోపాల్‌వర్మతో చేయటం, అది ద్విభాషా చిత్రం కావటం, లహ రి కంపెనీ ఆడియోను విడుదల చేయడం.. అన్నీ విశేషాలే. సినిమాను, పాటలను వేర్వేరుగా క్యాసెట్లుగా రిలీజ్ చేస్తారని తెలిసిందే. నేపథ్య సంగీతాన్ని క్యాసెట్‌గా తీసుకురావటం ఇదే ప్రథమం. అది కూడా నా సంగీతం కావటం సంతోషం.
కుటుంబ నేపథ్యం
మాది తెనాలి. నాన్న అద్దంకి పాల్ ప్రభాకర్ బీఎఫ్ఏ చేశారు. హాబీగా ‘ఎకార్డినిస్ట్గా’వ్యవహరించేవారు. ‘పల్లె పిలిచింది’ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. తల్లి కళాప్రభాకర్ ఆకాశవాణిలో ‘ఎ’ గ్రేడ్ డ్రామా ఆర్టిస్టు. పెద్దన్నయ్య జోసఫ్ ప్రీతమ్ బీఎఫ్ఏ చేశారు. ‘అరుంధతి’ సినిమాకు కాన్సెప్ట్ ఆర్టిస్ట్‌గా చేశారు. ప్రస్తుతం మీనియేచర్ హెడ్. నేను కూడా సినిమా రంగంలో ఉండటం ఆనందంగా ఉంది.
సంగీత శిక్షణ
ఎంబీఏ చేసిన నాకు సంగీతమంటే ఆసక్తి. కీబోర్డు నాన్న దగ్గర నేర్చుకున్నా. తెనాలిలోనే రంగనాయకి, మార్టూరు వెంకటేశ్వర్లు దగ్గర శాస్త్రీయ సంగీతం అభ్యసించాను. వెస్టరన్ సంగీతం జె.విజయపాల్ (హైదరాబాద్) నేర్పారు.
కీబోర్డు ప్లేయర్‌గా..
కీబోర్డు ప్లేయర్‌గా ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా’ నా మొదటి సినిమా. పలు టీవీ సీరియల్స్‌కూ పనిచేస్తుండగా, రామ్‌గోపాల్‌వర్మ దృష్టిలో పడ్డాను. ఆయన తీసిన ‘రక్తచరిత్ర’, ‘బెజవాడ రౌడీ’కు పనిచేశాను. నన్ను గుర్తించి కిల్లింగ్ వీరప్పన్‌లో నేపథ్య సంగీత బాధ్యతలను అప్పగించారు. ప్రత్యేకంగా ఆడియో రిలీజ్, ఇంటర్వ్యూల్లో ప్రశంసలు దక్కాయంటే రామ్‌గోపాల్‌వర్మకు నచ్చినట్టే కదా..
వర్మ కాంప్లిమెంట్
కిల్లింగ్ వీరప్పన్ మొదట కన్నడంలో రిలీజైంది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ హీరో. సూపర్ హిట్టయింది. తెలుగులోనూ టాక్ బాగుంది. సినీపత్రికల ఇంటర్వ్యూల్లో రామ్‌గోపాల్‌వర్మ నా గురించి బాగా చెప్పారు. పాటలకు రవిశంకర్ సంగీతాన్నిస్తే నేపథ్య సంగీతాన్ని నేను సమకూర్చా.
ఇది కొత్త ట్రెండ్
ఒక సినిమాకు ఇద్దరు సంగీత దర్శకులా! అని ఆశ్చర్యపోవద్దు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ పాటల్ని మిక్కీ జె.మేయర్ చేస్తే, నేపథ్య సంగీతాన్ని మణిశర్మ అందించారు. సినీ పరిశ్రమలో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే నండి. మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నా.