‘ఓటుకు కోట్లు’ కేసు.. కోర్టుకు చేరిన రేవంత్, సండ్ర స్వర నమూనాలు
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితోపాటు మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలకు ఉచ్చు బిగుసుకుంటోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం విదితమే. ఈ సందర్భంగా చిత్రీకరించిన వీడియో, ఆడియోలను నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ (ఎఫ్ఎస్ఎల్)కు అందజేశారు. అలాగే కేసులో రెండో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్‌తో సండ్ర ఫోన్లో జరిపిన సంభాషణలను సైతం ఎఫ్ఎస్ఎల్ విశ్లేషించింది.
టేపులన్నీ నిజమైనవేనని నిర్ధారించినందున వారికి స్వర నమూనా పరీక్షలు నిర్వహించాలని గతంలో ఏసీబీ అధికారులు కోర్టుకు విన్నవించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య స్వర నమూనాలను అసెంబ్లీ అధికారులు గురువారం ఏసీబీ కోర్టుకు సమర్పించారు. వారిరువురితో పాటు సెబాస్టియన్, ఉదయసింహ మీడియాతో మాట్లాడిన టేపులను సైతం ఎఫ్ఎస్ఎల్ విశ్లేషణకు అందజేయాలంటూ ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.