ఖైదీ నం.1
జైలు శిక్ష.. ఒక్కరోజే
కొత్త అనుభూతినిస్తున్నసంగారెడ్డి పాత జైలు
♦ రూ. 500 కట్టి మీరూ బందీ కావొచ్చు
♦ నాలుగు గోడల మధ్య జీవితం ఉద్విగ్నం, దుర్భరం అంటున్న ‘ఖైదీలు’
♦ గడచిన 8 నెలల్లో స్వీయబందీలైన 14 మంది
సాక్షి, హైదరాబాద్
మనం ఫోన్‌కు ఖైదీలం.
వాట్స్‌యాప్, ఫేస్బుక్, చాటింగ్..
ఒకటేమిటి ఫోన్ గీసిన గిరిలో బందీలం!
చేతిలో ఫోన్ ఆడకపోతే ఆలోచన రాదు, అడుగు పడదు. అలాంటి ఫోన్ మనకు దూరమైతే..?
ఆప్యాయంగా పలకరించే మనవాళ్లు కన్పించకుంటే..? ఊహించుకుంటేనే భయంకరం కదా..!
మరి రోజులు.. నెలలు.. ఏళ్లు.. ఖైదీలు జైలు గోడల మధ్య ఎలా గడుపుతారు?? ఇదిగో ఇలా...
ఆ నాలుగు గోడల మధ్య..
అది సంగారెడ్డి పాత జైలు. ముగ్గురు యువకులు లోనికి ప్రవేశించారు. వారిలో కిషన్, ప్రవీణ్ న్యాయవాదులు. రవి కుమార్ ట్యాక్స్ కన్సల్టెంట్. ఇద్దరు కానిస్టేబుళ్లు వారిని లోనికి తీసుకెళ్లారు. వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు, పర్సులు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఖైదీ యూనిఫామ్‌తో ఆ ముగ్గురు యువకులు బ్యారెక్స్‌లోకి వెళ్లారు. సినిమాల్లో చూడ్డమేగానీ జైలు గది ఎలా ఉంటుందో చూసిన అనుభవం లేదు. అందులో కాలుపెట్టగానే మనసులో ఒకింత తెలియని ఆందోళన. కానీ.. నిజం ఖైదీలం కాదుగా.. మరో 24 గంటల్లో విడుదలవుతాం కదా అన్న ఆలోచన మనసును తట్టడంతో మళ్లీ మామూలైపోయారు. రోజంతా జైల్లో గడిపారు. జీవితం అందించిన ఓ కొత్త పాఠాన్ని మదిలో పదిలపరుచుకున్నారు. ‘క్షణికావేశంలో కానీ, వ్యూహాత్మకంగా కానీ నేరం చేయొద్దు..’బయటకు వచ్చిన తర్వాత ఆ ముగ్గురు మౌనంగా ఎవరికివారు అనుకున్నమాట ఇది!!
మీరూ ‘ఖైదు’కావొచ్చు...
దేశంలో ఎక్కడా లేనట్టు సంగారెడ్డి పాత జైలు ఓ కొత్త అనుభూతిని పంచుతోంది. ఒకప్పుడు కరుడుగట్టిన నేరగాళ్లను ఉంచిన ఈ జైలు ఇప్పుడు... ‘ఖైదీ అనుభవం’పంచుతోంది. తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వీకే సింగ్ ఆలోచన నుంచి పుట్టిన ఓ కార్యక్రమం ‘ఖైదీ’లకు కొత్త అనుభూతిని ఇస్తోంది. జైలు జీవితం ఎలా ఉంటుందన్న ఆసక్తిని స్వీయానుభవంగా మార్చుకోవాలనుకునేవారు ఓ రోజు అందులో అచ్చం ఖైదీలాగా ‘బందీ’కావచ్చు. ఇందుకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. గత సంవత్సరం జూన్ 5న మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తోంది. గడచిన ఎనిమిది నెలల్లో 14 మంది ‘జైలు అనుభూతి’పొందారు. హైదరాబాద్ సంస్థానంలో సాలార్జంగ్–1 ప్రధానిగా ఉన్న సమయంలో 1796లో సంగారెడ్డిలో ఈ జైలు రూపుదిద్దుకుంది. తెలంగాణలో ఇదే అతి పురాతన జైలు. ఇప్పుడది చారిత్రక వారసత్వ కట్టడం. కంది సమీపంలో కొత్తగా నిర్మితమైన అధునాతన భవన సముదాయంలోకి జైలు తరలించటంతో ఇప్పుడిది మ్యూజియంగా మారింది.
‘ఖైదీ’లు ఏమంటున్నారంటే..?
కొత్త కోణాన్ని పరిచయం చేసింది
నాకు కోపం చాలా ఎక్కువ. చిరాకులో ఉన్నప్పుడు నియంత్రణ కోల్పోతా. ఆ సమయంలో ఆవేశం నా మనసు మాట విననివ్వదు. కానీ.. ఈ 24 గంటల ‘జైలు జీవితం’నా స్వభావానికి కొత్త కోణాన్ని పరిచయం చేసింది. ఇప్పుడు ఆవేశానికిలోనయ్యేలోపు మనసు నియంత్రణలోకి వస్తోంది. గొడవలకు దూరంగా ఉంటాను. ఎందుకంటే ఆ ‘జైలు జీవితం’నాకు తారసపడొద్దు. అక్కడ ఒక్కో నిమిషం ఒక రోజుతో సమానం. జీవితంలో అంతకుమించిన దుర్భర ఘట్టం మరొకటి ఉండదేమో
విజయ్‌కుమార్, మహారాష్ట్రలో వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్(పుణె)
బాబోయ్.. అదో సాహసం
సాయంత్రం నుంచి ఉదయం వరకు ఎవరూ కనిపించరు. బ్యారెక్‌లో ఒంటరిగా గడపటం.. తలుచుకుంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. బయటకు పంపరు, మూత్రవిసర్జన చేయాలన్నా గదిలో ఓ మూలన సగం గోడతో ఉండే టాయిలెటే గతి. బోర్‌గా అనిపిస్తుంది.. తినాలనిపించదు.. నిద్ర సరిగా ఉండదు. కానీ అదో మంచి అనుభవాన్నిస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు కారణాలు వెతుక్కుంటాం, పరిష్కారం దిశగా చూస్తాం. ఇక్కడది కనిపిస్తుంది.
– సామ్రాట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్
ప్రజల్లో ఆలోచన పుట్టించాలనే: వీకే సింగ్, డీజీ, తెలంగాణ జైళ్ల శాఖ
కొందరికి ఎన్నిసార్లు చెప్పినా కొన్ని విషయాలు బుర్రకెక్కవు. నేరం చేసి జైలుకు వెళ్తే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో స్వయంగా తెసుకుకునేందుకు చక్కటి అవకాశమే ఈ కార్యక్రమం ఉద్దేశం. అండమాన్‌లోని పురాతన జైలును మ్యూజియంగా మార్చారు. తెలంగాణలో అతి పురాతన జైలు సంగారెడ్డి పాత జైలు. కొత్త భవనం కట్టాక పాతదాన్ని కూల్చకుండా మ్యూజియంగా మార్చాలనుకున్నాం. అందులో ఓ భాగాన్ని అందుకు కేటాయించాం. రెండో భాగాన్ని ‘జైలు అనుభూతి’కోసం వాడాలనుకున్నాం. ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోని పురాతన జైళ్లను కూడా ఇలా మార్చాలనే యోచన అధికారుల్లో వచ్చింది.
ఇప్పుడిప్పుడే ఆసక్తి పెరుగుతోంది
ఇప్పటివరకు 14 మంది ‘ఫీల్ ది జైల్’ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఇప్పుడిప్పుడే ఆసక్తి పెరుగుతోంది. వేరే రాష్ట్రాల నుంచి యువకులు ఫోన్ చేసి తేదీలు బుక్ చేసుకుంటున్నారు. వచ్చినవారు మంచి అనుభూతితో వెళ్తున్నారు. కొద్దిరోజుల క్రితం అధ్యయనంలో భాగంగా చెన్నై నుంచి ఓ యువతి వచ్చింది. ఆమెకు రక్షణగా ఇద్దరు మహిళా గార్డులను వినియోగించాం. ఎలాంటి భయం లేకుండా జైలు జీవితాన్ని గడిపి వెళ్లొచ్చు.
– జి.వెంకటేశ్వర్లు, సంగారెడ్డి జిల్లా సబ్‌జైళ్ల అధికారి
బంగ్లా అధికారుల సందర్శన
ఈ జైలును ఇటీవల బంగ్లాదేశ్ అధికారులు సందర్శించారు. ఇక్కడి పరిస్థితులు అధ్యయనం చేసి ఢాకాలోని పురాతన జైలును కూడా ఇలాగే తీర్చి దిద్దాలని వారు నిర్ణయించుకున్నారు. ఆ దేశ ప్రధాని వద్దకు ఈ ప్రతిపాదన వెళ్లింది. ఆ దేశంలో నేరాల సంఖ్య ఎక్కువే. ప్రజల్లో మార్పు కోసం ఈ ఆలోచన భేషుగ్గా ఉపయోగపడుతుందని అధికారులు యోచిస్తున్నారు. అలాగే వారం క్రితం తీహార్ జైలు అధికారులు వచ్చి చూసి వెళ్లారు. ఇది మంచి ఆలోచన అంటూ కితాబిచ్చారు.
ఇదీ టైం టేబుల్..
ఉదయం 6: బ్యారక్ తెరిచి ‘ఖైదీ’ని బయటకు వదులుతారు. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత కాసేపు యోగా చేయించి గార్డెనింగ్ పని అప్పగిస్తారు.
7: టీ ఇస్తారు. తర్వాత ‘విద్యాదానం’పథకంలో భాగంగా చదువు నేర్పిస్తారు. అక్షరాస్యులైతే పుస్తకాలిచ్చి చదువుకోమంటారు.
8: బ్రేక్‌ఫాస్ట్. తర్వాత కాసేపు స్వేచ్ఛగా విహరించే అవకాశం.
11: మధ్యాహ్న భోజనం. అనంతరం విశ్రాంతి
మధ్యాహ్నం 2: టీ
సాయత్రం 5: రాత్రి భోజనం
6: బ్యారెక్‌లోకి పంపి తాళం వేస్తారు
బ్రేక్‌ఫాస్ట్ ఇలా..
సోమవారం: చపాతి, ఆలూ కుర్మా; మంగళవారం: పొంగల్; బుధ: చపాతీ కుర్మా; గురు: ఉప్మా; శుక్ర: పొంగల్; శని: చపాతీ కుర్మా; ఆది: పులిహోర
లంచ్: అన్నం పప్పు, పచ్చడి, రసం, బుధవారం ఉడికించిన గుడ్డు, ఆదివారం మాంసాహారం (తొలి ఆదివారం మటన్, మిగతా మూడు ఆదివారాలు చికెన్)
డిన్నర్: కూర, పెరుగుతో అన్నం
నిబంధనలెన్నో...
ఈ జైల్లో గడపాలనుకునేవారికి తల్లిదండ్రుల/కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తప్పనిసరి. వారితో ఫోన్లో మాట్లాడించాకే అనుమతిస్తారు. ఆ 24 గంటలు ఫోన్ అనుమతి ఉండదు. ఎలాంటి వస్తువులు లోనికి అనుమతించరు. పుస్తకాలు తెచ్చుకోవచ్చు. కానీ కమ్యూనిస్టు భావజాలంతో కూడినవి ఉంటే అభ్యంతరం వ్యక్తం చేస్తారు. వచ్చినవారి మానసిక స్థితిని గమనించాకే అనుమతి ఇస్తారు. మైనర్లను అనుమతించరు.