sangh pariwar
-
అవసరమున్నంత కాలం రిజర్వేషన్లు: ఆరెస్సెస్
పుష్కర్: సామాజిక, ఆర్థిక అసమానతలు ఉన్నాయి కనుకనే రిజర్వేషన్ల అవసరం ఉన్నదనీ, లబ్ధిదారులకు రిజర్వేషన్ల అవసరమున్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగుతాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్పష్టం చేసింది. మంచినీటి విషయంలోనూ, శ్మశానాల్లోనూ, దేవాలయాల్లోనూ అందరికీ ప్రవేశం ఉండాలనీ, నీటి వనరుల వాడకాన్ని కులంపేరుతో నిరాకరించడం తగదనీ ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధానకార్యదర్శి దత్తాత్రేయ హోసబేల్ తేల్చి చెప్పారు. సమాజంలో ఆర్థిక, సామాజిక అంతరాలున్నాయనీ, అందుకే రిజర్వేషన్ల కొనసాగింపు అవసరమనీ ఆర్ఎస్ఎస్ భావిస్తోం దన్నారు. రాజస్తాన్‌లోని పుష్కర్‌లో మూడు రోజుల పాటు జరిగిన సంఘ్‌పరివార్ కోఆర్డినేషన్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి 35 ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల నుంచి 200 మంది ప్రతిని«ధులతోపాటు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి.నడ్డా, జనరల్ సెక్రటరీ బి.ఎల్.సంతోష్‌లు హాజరయ్యారు. -
మందిర నిర్మాణం మరవొద్దు
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆ దిశగానే ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పలు సంఘ్ పరివార్ సంస్థల ప్రతినిధులు సహా వేలాది మంది పాల్గొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వీహెచ్‌పీ నిర్వహించిన ఈ సభలో వేలాదిమంది రామభక్తులు, హిందూవాదులు పాల్గొన్నారు. కాషాయ రంగు టోపీలు ధరించి సభకు వచ్చిన వారంతా ‘మాకు శాంపుల్ వద్దు. టెంపుల్ కావాలి. రామరాజ్యం మళ్లీ తెస్తాం. మందిరం నిర్మిస్తాం’ అంటూ నినాదాలు చేశారు. అధికారంలో ఉన్నవారు ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదంటూ బీజేపీ ప్రభుత్వంపై ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) సీనియర్ నాయకుడు సురేశ్ భయ్యాజీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రాముడి గుడి కట్టాలంటే చట్టం తీసుకురావడమే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ధర్మసభలో ప్రసంగిస్తున్న సాధ్వీ రితంభర అప్పటివరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని భయ్యాజీ తెలి పారు. సభలో ఆయన మాట్లాడుతూ ‘అయోధ్యలో రాముడి గుడి కడతామని ఈ రోజు అధికారంలో ఉన్నవారు గతంలో మాట ఇచ్చారు. మందిర నిర్మాణం డిమాండ్‌ను నెరవేర్చాలి. ఆలయాన్ని కట్టాలని మేం అడుక్కోవడం లేదు. మా భావాలను వ్యక్తపరుస్తున్నాం’ అని అన్నారు. సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించాలని కోరుతూ ‘న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయిన దేశం అభివృద్ధి పథంలో నడవదు. సుప్రీంకోర్టు ప్రజల మనోభావాలు/అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మేం ఏ మతంతోనూ గొడవ పడాలనుకోవడం లేదు’ అని భయ్యాజీ పేర్కొన్నారు. ‘మోదీని వదిలిపెట్టం’ హరిద్వార్‌కు చెందిన స్వామి హంసదేవాచార్య మాట్లాడుతూ రామ మందిరాన్ని కట్టకపోతే ప్రధాని మోదీని తాము వదిలిపెట్టబోమని అన్నారు. హామీ మోదీ నెరవేర్చాల్సిందేనని కోరారు. వీహెచ్‌పీ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ కోగ్జే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలను గౌరవించాలనీ, ప్రజలే సుప్రీం తప్ప కోర్టు కాదని అన్నారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలూ అయోధ్యలో రామమందిర నిర్మాణం డిమాండ్‌కు మద్దతు తెలపాలన్నారు. వీహెచ్‌పీ సభ నేపథ్యంలో ఢిల్లీలో పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రామ్ లీలా మైదానంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రామ్‌లీలా మైదానంలోకి ప్రవేశిస్తున్న వీహెచ్‌పీ కార్యకర్తలు, మద్దతుదారులు -
ఐలయ్యకు మావోయిస్టుల మద్దతు
సాక్షి, హైదరాబాద్: వైశ్యులను కించపరిచాడనే పేరిట ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై జరుగుతున్న దాడిని మావోయిస్టు పార్టీ ఖండిస్తోందని రాష్ట్ర కమిటీ అధికారి ప్రతినిధి జగన్ మంగళవారం ఒకప్రకటనలో తెలిపారు. భావ ప్రకటనా స్వేచ్చను ఎవరూ అడ్డుకునే హక్కు లేదని, దేశంలో సంఘ్‌పరివార్ నేతృత్వంలోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని మావోయిస్టు పార్టీ అభిప్రాయపడింది. కులం గురించి మట్లాడటాన్ని నేరంగా చిత్రీకరిస్తూ బెదిరింపులకు పాల్పడ్టం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర ఉందని ప్రతినిధి జగన్ ఆరోపించారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకు వేసి ఐలయ్య పుస్తకాలపై నిషేదం తీసుకురావడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని పార్టీ అభిప్రాయపడుతోందని వెల్లడించారు. చంద్రబాబు వ్యవహారం అభిప్రాయాలని, అక్షరాల్ని నిషేదించాలనుకునే నియంతృత్వం వైఖరి అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. ఐలయ్య రాసిన అంశాలపై కౌంటర్ వాదన చేయవచ్చని, కానీ బెదిరించడం అప్రజాస్వామ్యమని, కంచె ఐలయ్యకు అన్నిరకాలుగా తమ పార్టీ మద్దతునిస్తోంది, ప్రజాస్వామ్య వాదులంతా ఐలయ్యకు అండగా నిలవాలని అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరం ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా బ్రాహ్మణీయ, హిందూ మనోత్మాదానికి వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. -
కించపరిచే వ్యాఖ్యల్ని సహించం..మోదీ
న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన నేపథ్యంలో జరుగుతున్న వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ యూఎన్ఐ తో మాట్లాడారు. మైనారిటీలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం సరైనది కాదంటూ పరోక్షంగా సంఘపరివార్‌కు చురకలంటించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఆయన సంఘపరివార్‌ను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెచ్చగొట్టే ప్రసంగాలను సహించబోమని, కించపరిచే వ్యాఖ్యల్ని ఉపేక్షించబోమని ఆయన తేల్చి చెప్పారు. ఎలాంటి కుల, మత వివక్షను క్షమించేదిలేదని ప్రధాని స్పష్టం చేశారు. దేశంలో మంచి రోజులు తీసుకురావడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందన్నారు. రైతుల సంక్షేమం కోసం తాము ప్రవేశపెట్టిన భూసేకరణ సవరణ బిల్లును రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. -
'డబుల్ గేమ్ ఆడుతున్న బీజేపీ, సంఘ్ పరివార్ '
లక్నో: బీజేపీ, సంఘ్ పరివార్ డబుల్ గేమ్ ఆడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రీటా బహుగుణ జోషి విమర్శించారు. హిందూ రాష్ట్ర, లవ్ జిహాద్ పేరుతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని ధ్వజమెత్తాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు కమలనాథులు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఒకపక్క హిందూ రాష్టం, మరోపక్క ప్రేమ జిహాద్ అంటూ బీజేపీ, సంఘ్ పరివార్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని బహుగుణ అన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. -
బాబుపై ‘సంఘ్’ వార్!
* టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులను ఓడించేందుకు ఆర్ఎస్ఎస్ పథకం హైదరాబాద్: తెలంగాణ తెచ్చిన పార్టీగా బీజేపీకున్న గుర్తింపును ఆసరా చేసుకుని తెలంగాణలో బలపడేందుకు పొత్తు పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు పన్నిన ఎత్తుకు కమలం పార్టీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ పైఎత్తులు వేస్తోంది. తెలంగాణలో బీజేపీని పనిగట్టుకొని దెబ్బతీసిన చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెప్పాలని ఆ సంస్థ భావిస్తోంది. టీడీపీతో పొత్తు వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని స్థానిక నేతలు గట్టిగా వాదించినా.. తన లాబీయింగ్‌తో బీజేపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకున్న బాబు తీరుపై ఆర్ఎస్ఎస్ మండిపడుతోంది. కర్ణాటక తరహాలో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలనుకున్న తన ఆలోచనలకు చంద్రబాబు గండికొట్టడంతో ఈ ఎన్నికల్లో ఆయన పార్టీని దెబ్బతీయాలన్న నిశ్చయానికొచ్చింది. అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఓటమే లక్ష్యంగా పథక రచన చేసింది. ఎన్డీయే గూటిలో చేరినట్టు చంద్రబాబు స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో.. ఆ పార్టీకి ఒకటో అరో వచ్చే ఎంపీ స్థానాలతో కేంద్రంలో బీజేపీ లాభపడనుంది. అందువల్ల లోక్‌సభ స్థానాల్లో దేశం అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తూనే, అసెంబ్లీ స్థానాల్లో తమ్ముళ్లను ఓడించాలన్నది ఆర్ఎస్ఎస్ వ్యూహం. దీంతో క్రాస్ ఓటింగ్ నినాదాన్ని అందుకుంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు సమాచారం రాష్ట్రానికి చెందిన ఆర్ఎస్ఎస్ ప్రముఖులు రెండు రోజుల క్రితమే దీనికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. టీడీపీ బలంగా ఉన్న అసెంబ్లీ స్థానాలను ఎంపిక చేసి.. ఆయా ప్రాంతాల్లోని ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయి కార్యకర్తలకు సమాచారమిచ్చారు. ఒక్కో ఊరిలో కనీసం వందమంది ఓటర్లకు తమ సందేశం చేరవేయాలని ఆదేశించారు. లోక్‌సభ వరకు టీడీపీ అభ్యర్థికే ఓటు వేసి, అసెంబ్లీకి మాత్రం టీడీపీ అభ్యర్థికి కాకుండా ఇతరులకు ఓటు వేసేలా ప్రజలను చైతన్య పరచాలని ఆర్ఎస్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఆ ‘ఇతరుల్లో’ కాంగ్రెస్ అభ్యర్థి ఉండకూడదని కూడా స్పష్టం చేశారు. ఈ విషయంలో ఓటర్లకు పూర్తి స్థాయిలో స్పష్టతనివ్వాలని సూచించారు. లోక్‌సభ స్థానాల్లో టీడీపీకి వేసే ప్రతి ఓటు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మేలు చేస్తుందని, అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి వేసే ప్రతి ఓటు బీజేపీకి నష్టం చేస్తుందని విడమర్చి చెప్పాల్సిందిగా సంఘ్ ముఖ్యలు సూచించినట్టు సమాచారం. టీఆర్ఎస్-కాంగ్రెస్-టీడీపీ/బీజేపీ త్రిముఖ పోటీలో చాలా మంది అభ్యర్థులు వెయ్యి నుంచి రెండు వేల ఓట్ల తేడాతోనే విజయం సాధించే అవకాశమున్నందున, ఒక్కో అసెంబీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వంద మంది ఓటర్లకు తమ సమాచారం చేరితే లక్ష్యం నెరవేరుతుందని సంఘ్ గట్టిగా నమ్ముతోంది. ఈ క్రాస్ ఓటింగ్ నినాదాన్ని క్షేత్ర స్థాయిలో బీజేపీ కార్యకర్తలకు అందించి.. వారి సహకారాన్ని కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నట్టు సమాచారం. -
పార్టీ కంటే ఆయనే ఎక్కువ!!
టీవీలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వస్తుంటుంది. ఉన్నట్టుండి యానిమేషన్ బొమ్మలు వస్తాయి. అవతలి బ్యాట్స్‌మన్ ఔట్ అయ్యాడని బౌలర్ అప్పీలు చేస్తాడు. కానీ అంపైర్ అడ్డంగా తల ఊపుతాడు. బౌలర్ మరోసారి అప్పీలు చేస్తూ, ఈసారి జేబులోంచి డబ్బులు తీస్తాడు. అయినా అంపైర్ తల అడ్డంగానే ఊగుతుంది. మరోసారి బౌలర్ రెండు చేతుల్లోనూ డబ్బులతో అప్పీలు చేస్తాడు. అప్పడూ అంపైర్ అడ్డంగా తల ఊపి.. అవినీతి ఉండకూడదంటే, ఈసారి మోడీ ప్రభుత్వం రావాలని చెబుతాడు. అక్కడ బీజేపీకి ఓటేయమన్న అక్షరాలు కనపడతాయి గానీ, చెప్పే మాటలు మాత్రం మోడీ ప్రభుత్వం అనే అంటారు. ఇదే కాదు.. ఏ వెబ్సైట్ తెరిచినా దాదాపుగా మోడీ ప్రభుత్వం అన్న ప్రచారమే కనపడుతోంది. ఇదంతా.. ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పార్టీ కంటే ఎక్కువగా భావించి చేస్తున్నదేనని పలువురు విమర్శిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్తున్నారు. మన రాష్ట్రం నుంచి కూడా సినీ హీరోలు పలువురిని తీసుకెళ్లి మోడీతో సమావేశం ఏర్పాటు చేయించడం ద్వారా మోడీ ప్రభను మరింత వెలిగించేందుకు వీలైనంత ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా కూడా బీజేపీ నాయకులు ఏమాత్రం వెనుకాడటం లేదు. బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ కూడా మోడీని ఇదే స్థాయిలో పైకి తీసుకెళ్తోంది. ఈసారి ఎలాగైనా మోడీ బొమ్మ చూపించే అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష కమలనాథుల్లోను, సంఘ్ పరివార్‌లో కూడా కనిపిస్తోంది. నరేంద్ర మోడీ లాంటి వాళ్లు ఓట్లు తీసుకురాగలరని, అలాంటి వాళ్లను ప్రమోట్ చేయడంలో తప్పేమీ లేదని ఆర్ఎస్ఎస్ జాతీయ అధికార ప్రతినిధి రాం మాధవ్ అన్నారు. పార్టీలో ఎప్పటినుంచో ఉన్న సీనియర్ నాయకుడు మురళి మనోహర్ జోషిని పక్కన పెట్టి మరీ వారణాసి లోక్‌సభ స్థానాన్ని మోడీకి కట్టబెట్టిన విషయం తెలిసిందే. అలాగే జశ్వంత్ సింగ్‌కు బార్మర్ నుంచిపోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ స్థానంలో కాంగ్రెస్ నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన కల్నల్ సోనారామ్ చౌదరికి టికెట్ ఇచ్చారు. Time For Change, Time For BJP. Bahut Hui Mehngai Ki Maar, Abki Baar Modi Sarkar. pic.twitter.com/5qTf8jhMYs — Rajnath Singh (@BJPRajnathSingh) March 24, 2014 పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈసారి మోడీ సర్కారు రావాలనే ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తొలుత ఈసారి బీజేపీ ప్రభుత్వం రావాలన్న రాజ్‌నాథ్.. తర్వాత ఆ 'తప్పు'ను సరిచేసుకుని, మోడీ ప్రభుత్వం రావాలని ట్వీట్ చేయడం గమనార్హం!!