పార్టీ కంటే ఆయనే ఎక్కువ!!
టీవీలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వస్తుంటుంది. ఉన్నట్టుండి యానిమేషన్ బొమ్మలు వస్తాయి. అవతలి బ్యాట్స్మన్ ఔట్ అయ్యాడని బౌలర్ అప్పీలు చేస్తాడు. కానీ అంపైర్ అడ్డంగా తల ఊపుతాడు. బౌలర్ మరోసారి అప్పీలు చేస్తూ, ఈసారి జేబులోంచి డబ్బులు తీస్తాడు. అయినా అంపైర్ తల అడ్డంగానే ఊగుతుంది. మరోసారి బౌలర్ రెండు చేతుల్లోనూ డబ్బులతో అప్పీలు చేస్తాడు. అప్పడూ అంపైర్ అడ్డంగా తల ఊపి.. అవినీతి ఉండకూడదంటే, ఈసారి మోడీ ప్రభుత్వం రావాలని చెబుతాడు. అక్కడ బీజేపీకి ఓటేయమన్న అక్షరాలు కనపడతాయి గానీ, చెప్పే మాటలు మాత్రం మోడీ ప్రభుత్వం అనే అంటారు. ఇదే కాదు.. ఏ వెబ్సైట్ తెరిచినా దాదాపుగా మోడీ ప్రభుత్వం అన్న ప్రచారమే కనపడుతోంది.
ఇదంతా.. ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పార్టీ కంటే ఎక్కువగా భావించి చేస్తున్నదేనని పలువురు విమర్శిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్తున్నారు. మన రాష్ట్రం నుంచి కూడా సినీ హీరోలు పలువురిని తీసుకెళ్లి మోడీతో సమావేశం ఏర్పాటు చేయించడం ద్వారా మోడీ ప్రభను మరింత వెలిగించేందుకు వీలైనంత ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా కూడా బీజేపీ నాయకులు ఏమాత్రం వెనుకాడటం లేదు. బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ కూడా మోడీని ఇదే స్థాయిలో పైకి తీసుకెళ్తోంది.
ఈసారి ఎలాగైనా మోడీ బొమ్మ చూపించే అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష కమలనాథుల్లోను, సంఘ్ పరివార్లో కూడా కనిపిస్తోంది. నరేంద్ర మోడీ లాంటి వాళ్లు ఓట్లు తీసుకురాగలరని, అలాంటి వాళ్లను ప్రమోట్ చేయడంలో తప్పేమీ లేదని ఆర్ఎస్ఎస్ జాతీయ అధికార ప్రతినిధి రాం మాధవ్ అన్నారు. పార్టీలో ఎప్పటినుంచో ఉన్న సీనియర్ నాయకుడు మురళి మనోహర్ జోషిని పక్కన పెట్టి మరీ వారణాసి లోక్సభ స్థానాన్ని మోడీకి కట్టబెట్టిన విషయం తెలిసిందే. అలాగే జశ్వంత్ సింగ్కు బార్మర్ నుంచిపోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ స్థానంలో కాంగ్రెస్ నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన కల్నల్ సోనారామ్ చౌదరికి టికెట్ ఇచ్చారు.
Time For Change, Time For BJP. Bahut Hui Mehngai Ki Maar, Abki Baar Modi Sarkar. pic.twitter.com/5qTf8jhMYs
— Rajnath Singh (@BJPRajnathSingh) March 24, 2014
పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ కూడా ఈసారి మోడీ సర్కారు రావాలనే ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తొలుత ఈసారి బీజేపీ ప్రభుత్వం రావాలన్న రాజ్నాథ్.. తర్వాత ఆ 'తప్పు'ను సరిచేసుకుని, మోడీ ప్రభుత్వం రావాలని ట్వీట్ చేయడం గమనార్హం!!