బిజీ బిజీగా కమలనాథులు...
కోర్ గ్రూప్‌గా ఏర్పడిన మోడీ, రాజ్‌నాథ్, గడ్కారీ, జైట్లీ
సర్కారు ఏర్పాటు అవకాశాల నేపథ్యంలో కీలక చర్చలు
న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు అధికంగా కనిపిస్తుండడంతో ఆ పార్టీలోని నలుగురు కీలక నేతలు కోర్‌గ్రూప్‌గా ఏర్పడ్డారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సీనియర్ నేతలు అరుణ్‌జైట్లీ, నితిన్ గడ్కారీలు బుధవారం గాంధీనగర్‌లో భేటీఅయ్యారు. పార్టీపరంగా తదుపరి చేపట్టాల్సిన చర్యలపై కసరత్తు ప్రారంభించారు. అవసరమైతే మరికొన్ని పార్టీల మద్దతు తీసుకోవడం, ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి పార్టీ సీనియర్లు ప్రభుత్వంలో పోషించాల్సిన పాత్రపై చర్చించడంతోపాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మంతనాలు సాగించారు. ప్రభుత్వ ఏర్పాటులో అవసరమనుకుంటే పార్టీ ఎజెండాను సమర్థించే పార్టీలకు ఒక్క ఎంపీ సీటు ఉన్నా వారి మద్దతు తీసుకోవడానికి వెనుకాడరాదని కోర్‌గ్రూప్ యోచిస్తున్నట్లు తెలిసింది.
బీజేపీలో ఇప్పటివరకూ కీలక నిర్ణయాలను పార్టీ పార్లమెంటరీ బోర్డు తీసుకోగా ఇకపై కోర్‌గ్రూప్ తీసుకుంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అంతకుముందు రాజ్‌నాథ్, గడ్కారీలు పార్టీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ను ఆమె నివాసంలో కలుసుకుని చర్చలు జరిపారు. ప్రభుత్వంలో తాను పోషించాల్సిన పాత్రపై పార్టీ చర్చించ కపోవడంతో సుష్మ అసంతృప్తితో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ వాదనను సుష్మ తోసిపుచ్చారు. కాగా, కోర్‌గ్రూప్ భేటీ అనంతరం రాజ్‌నాథ్ విలేకరులతో మాట్లాడుతూ అద్వానీతో చర్చించాకే ప్రభుత్వంలో ఆయన పాత్రపై నిర్ణయం తీసుకుం టామన్నారు. మోడీ ప్రధాని కావడం ఖాయమన్నారు. కాగా, బీజేపీ అధ్యక్షుడిగా తిరిగి పగ్గాలు చేపట్టేందుకు లాబీయింగ్ జరుపుతున్నట్లు వస్తున్న వార్తలను గడ్కారీ తోసిపుచ్చారు. కాగా, ఈనెల 17న బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఢిల్లీలో సమావేశం కానుంది.