పీవోకే సాధనే ప్రధాని ఎజెండా
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రధాని మోదీ మౌన స్వామి కాదు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను దేశంలోకి తీసుకురావడమే ఆయన ఏకైక ఎజెండా. అక్కడున్న ప్రజలూ మన దేశ పౌరులే’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ వ్యాఖ్యానించారు. ‘లుక్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్, వాట్ నెక్ట్స్’ అనే అంశంపై ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా రామ్‌మాధవ్ హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా దేశానికి, భారతీయులకు గౌరవం లభించాలన్నదే ప్రధాని లక్ష్యమన్నారు. ‘‘తూర్పు దేశాలతో భారత్ దౌత్య సంబంధాలు, విదేశాంగ విధానం మారుతూ ఉంటుంది. దౌత్య విధానం అంటే శాశ్వత మిత్రత్వం, శత్రుత్వం ఉండదు.
కేవలం శాశ్వత ఆసక్తి మాత్రమే ఉంటుంది. వ్యూహాత్మక విధానం మనది. మాజీ ప్రధాని నెహ్రూ హయాంలో చైనాకు దగ్గరవ్వాలనే ఆలోచనతో ఆసియన్ దేశాల సమావేశంలో టిబెట్ జెండా తీసేయడం వల్ల చాలా నష్టపోయాం. హిందీ-చీనీ భాయి, భాయి అన్నది నినాదమే కానీ వ్యూహం కాలేకపోయింది. 1962లో చైనాతో యుద్ధంలో మనం ఎవరితోనూ స్నేహపూర్వక సంబంధాలు నెరపకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ద్వీప దేశాలతోనూ స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. తూర్పు దేశాలతో స్నేహబంధం అంటే అమెరికాతో వైరం కాదు’’ అని రామ్‌మాధవ్ పేర్కొన్నారు. విదేశీ విధానంపై ఇకపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
కశ్మీర్‌పై అప్పుడే పట్టుబట్టి ఉంటే...
‘‘1972లో ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫీకర్ అలీ భుట్టోల మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందం ప్రకారం 94 వేల పాక్ ఖైదీలను బేషరతుగా విడిచిపెట్టాం. అప్పుడే కశ్మీర్ అంశాన్ని పట్టుబట్టి పొందగలిగి ఉంటే కశ్మీర్ పాక్ అంతర్భాగమం టూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించే ధైర్యం చేసే వారు కాదు’’ అని రామ్‌మాధవ్ వ్యాఖ్యానించారు. దేశంలో మీడియాలోని ఓ వర్గం ముష్కరులను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కశ్మీర్‌లోని శాంతి కాముకుల గురించి పట్టించుకోకుండా సైన్యం ఎన్‌కౌంటర్‌లో హతమైన బుర్హాన్ వనీ వంటి దేహద్రోహులపట్ల సానుభూతి వ్యక్తం చేయడం సరికాదన్నారు. ‘అవేర్‌నెస్ ఇన్ యాక్షన్’ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇఫ్లూ వైస్ చాన్స్‌లర్ సునైనాసింగ్, సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్‌రావు, రఘునందన్‌రావు పాల్గొన్నారు.