మోడీ ప్రభుత్వం సామాన్యుల పక్షం: రాంమాధవ్
నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాన్యుల పక్షాన నిలబడుతుందని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి రాంమాధవ్ స్పష్టం చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో రాంమాధవ్ సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రభుత్వ విషయాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం ఉండదన్నారు. బీజేపీ రిమోట్ కంట్రోల్ నాగపూర్లో ఉన్నదన్న వ్యాఖ్యలను రాంమాధవ్ ఖండించారు. సీమాంధ్ర ప్రాంత అభివృద్ధికి నిధుల కోసం ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
రాజ్యాంగానికి లోబడి రామమందిరం నిర్మాణం, ఆర్టికల్ 370 తదితర అంశాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అంచనాలకు మించి ఫలితాలు సాధించిందని చెప్పారు. దేశంలో నెలకొన్న సమస్యలపై ప్రజలకు వివరించామని... అలాగే అవినీతి మకిలి అంటించుకున్న ప్రభుత్వాన్ని మార్చాలంటూ ఇంటింటికి చేసిన ప్రచారం మంచి ఫలితాన్ని ఇచ్చిందన్నారు. అంతేకాకుండా ఓటింగ్లో పాల్గొన్నాలంటూ తమ విజ్ఞప్తిపై ప్రజలు సానుకూలంగా స్పందించారన్నారు.