గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని కోరుకుంటున్నట్లు ఆరెస్సెస్ దాదాపు స్పష్టం చేసింది. బీజేపీ-సంఘ్ పరివార్ నేతల రెండు రోజుల సమావేశం సోమవారం ముగిసిన అనంతరం ఆరెస్సెస్ నేత రామ్ మాధవ్ మీడియాతో మాట్లాడారు. మోడీకి ప్రజల్లో గౌరవాదరాలు ఉన్నాయని, అయితే, ప్రధాని అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించాలనేది బీజేపీపైనే ఆధారపడి ఉందని ఆయన అన్నారు. దేశమంతా మార్పు కోరుకుంటోందని, ఈ విషయాన్ని తామూ గుర్తించామని చెప్పారు.
దేశంలోని ఓటర్లు మార్పు కోరుకుంటున్న విషయాన్ని తాము సమావేశంలో చెప్పామన్నారు. మోడీని ఉద్దేశించే ‘మార్పు’ గురించి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించగా, ప్రజలు ఏ పదవి కోసం ఎవరిని కోరుకుంటున్నారో అందరికీ స్పష్టంగా తెలుసునని బదులిచ్చారు. ప్రధాని పదవికి మోడీ అభ్యర్థిత్వంపై బీజేపీలో ఎలాంటి సంక్షోభం లేదని చెప్పారు. కాగా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు వచ్చేవారం భేటీ కానుందని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. మోడీ పుట్టినరోజు సెప్టెంబర్ 17న జరగనుండగా, ఆలోగానే ఆయనను బీజేపీ తన ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీపైనే ఆరెస్సెస్ మొగ్గు
Published Wed, Sep 11 2013 3:11 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement