sania mirza-martina hingis
-
సానియా జంటకు షాక్
మయామి: వరుసగా రెండో టోర్నమెంట్లో ప్రపంచ నంబర్‌వన్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు చుక్కెదురైంది. మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ ద్వయం రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 4-6, 2-6తో మార్గరీటా గస్పర్యాన్ (రష్యా)-మోనికా నికెలెస్కూ (రుమేనియా) జోడీ చేతిలో ఓడిపోయింది. 66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోవడం గమనార్హం. గత నెల రోజుల్లో సానియా-హింగిస్ జంట వరుసగా మూడు టోర్నీల్లో (ఖతార్ ఓపెన్, ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్) క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయింది. -
రెండోరౌండ్ లో సానియా జోడి
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)ల జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. గురువారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో టాప్‌సీడ్ సానియా ద్వయం 6-2, 6-3తో మరియానో మారినో (కొలంబియా)-టెలియానా పెరీరా (బ్రెజిల్)లపై గెలిచి రెండోరౌండ్లోకి ప్రవేశించింది. దీంతో సానియా-హింగిస్ వరుసగా 31వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. 70 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-స్విస్ జంటకు ప్రత్యర్థుల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో నాలుగోసీడ్ రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జా (రొమేనియా) 7-5, 6-3తో ఒమర్ జాసికా-నిక్ కిర్గియోస్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టారు. -
సానియా జంటకు సవాల్
సింగపూర్: ఈ ఏడాది జతగా ఎనిమిది టైటిల్స్ నెగ్గి అత్యద్భుతమైన ఫామ్‌లో ఉన్న సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట ఆఖరి సవాల్‌కు సిద్ధమైంది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ఈ ఇండో-స్విస్ ద్వయం డబుల్స్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గతేడాది కారా బ్లాక్‌తో కలిసి డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించిన సానియా ఈసారి అదే ఫలితాన్ని పునరావృతం చేస్తుందో లేదో వేచి చూడాలి. మొత్తం ఎనిమిది జంటలు రెండు గ్రూప్‌లుగా విడిపోయి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో టైటిల్ కోసం తలపడతాయి. ‘రెడ్’ గ్రూప్‌లో సానియా-హింగిస్లతోపాటు తిమియా బాబోస్-మ్లాడెనోవిచ్; రాకెల్ కాప్స్జోన్స్-అబిగెయిల్; హలవకోవా-హర్డెకా... ‘వైట్’ గ్రూప్‌లో బెథానీ మాటెక్ సాండ్స్-లూసీ సఫరోవా; హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్; కరోలిన్ గార్సియా-స్రెబోత్నిక్; ముగురుజా-కార్లా నవారోలక చోటు కల్పించారు. ఇదే వేదికపై సింగిల్స్ టైటిల్స్ కోసం షరపోవా, సిమోనా హలెప్, అగ్నెస్కా రద్వాన్‌స్కా, ఫ్లావియా పెనెట్టా, ముగురుజా, పెట్రా క్విటోవా, ఎంజెలిక్ కెర్బర్, లూసీ సఫరోవా బరిలో ఉన్నారు. -
క్వార్టర్స్‌లో సానియా జంట
బీజింగ్: వరుసగా నాలుగో టైటిల్‌పై గురి పెట్టిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. టాప్ సీడ్ హోదాలో తొలి రౌండ్లో ‘బై’ పొందిన ఈ ఇండో-స్విస్ జోడీ... బుధవారం జరిగిన రెండో రౌండ్లో 1-6, 6-4, 10-6తో ‘సూపర్ టైబ్రేక్’లో సారా ఎరాని-ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 76 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా ద్వయం తొలి సెట్‌ను కోల్పోయినా... రెండో సెట్లో వెంటనే తేరుకుంది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో సమన్వయంతో ఆడి విజయాన్ని ఖాయం చేసుకుంది. సానియా జోడీ 13 మ్యాచ్‌ల తర్వాత ప్రత్యర్థి జంటకు సెట్‌ను చేజార్చుకోవడం గమనార్హం. మరోవైపు ఇదే వేదికపై జరుగుతున్న ఏటీపీ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)-జాన్ ఇస్నెర్ (అమెరికా) జంటకు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో బోపన్న-ఇస్నెర్ జోడీ 4-6, 3-6తో ట్రయెస్కీ (సెర్బియా)-పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) ద్వయం చేతిలో ఓడిపోయింది. బోపన్న ఓటమితో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా)తో జతకట్టిన లియాండర్ పేస్ కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. -
సెమీస్‌లో సానియా జోడి
వుహాన్: వరుస విజయాలతో జోరు మీదున్న సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... వూహాన్ ఓపెన్ డబ్ల్యుటీఏ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్ఫైనల్లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 6-2, 6-2తో ఐదోసీడ్ రాక్వెల్ కోప్స్ జోన్స్-అబిగలి స్పీయర్స్ (అమెరికా)పై నెగ్గారు. తొలిరౌండ్లో బై పొందిన భారత్-స్విస్ ద్వయం ప్రిక్వార్టర్స్‌లో 6-3, 6-2తో క్లౌడియా జాన్స్ ఇగ్నాసిక్ (పోలెండ్)-అనాస్టాసియా రొడినోవా (ఆస్ట్రేలియా)పై గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. -
సెమీస్‌లో బోపన్న జంట
సానియా జోడీకి షాక్ న్యూఢిల్లీ : మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరియన్ మెర్జియా (రుమేనియా) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న-మెర్జియా ద్వయం 6-3, 6-2తో అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)-సెబాస్టియన్ కాబెల్ (కొలంబియా) జంటపై గెలిచింది. గురువారం జరిగిన రెండో రౌండ్లో బోపన్న-మెర్జియా 6-4, 4-6, 10-5తో రోజర్ వాసెలిన్-నికొలస్ మహుట్ (ఫ్రాన్స్)లపై విజయం సాధించారు. అయితే లియాండర్ పేస్ (భారత్)-డానియల్ నెస్టర్ (కెనడా) జోడీకి రెండో రౌండ్లో ఓటమి ఎదురైంది. పేస్-నెస్టర్ జంట 6-7 (4/7), 3-6తో ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్)-మాక్స్ మిర్నీ (బెలారస్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. ఇదే టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో భారత స్టార్ సానియా మీర్జా పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం 7-6 (7/5), 3-6, 9-11తో బెథానీ మాటెక్ (అమెరికా)-లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడింది. ఈ సీజన్లో సానియా జంటకిది రెండో ఓటమి.