ప్రశాంతంగానే ఉన్నా కొనసాగుతున్న ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ: మతఘర్షణలతో అట్టుడికిపోయిన త్రిలోక్‌పురిలో 144 సెక్షన్ కింద విధించిన నిషేధాజ్ఞలను బుధవారం ఆరు గంటలపాటు సడలించారు. పరిస్థితి ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిషేధాజ్ఞలను సడలించామని పోలీసు జాయింట్ కమిషనర్ సంజయ్ బేనీవాల్ చెప్పారు. ప్రజలు అవసరమైన సామగ్రి కొనుక్కోవడానికి వీలుగా సోమవారం గంట సేపు, మంగళవారం మూడు గంటల పాటు నిషేధాజ్ఞలను సడలించారు. ఛత్ పూజను దృష్టిలో పెట్టుకుని సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు నిషేధాజ్ఞలను సడలించామని చెప్పారు. ఈ పూజ చేసేవారు సాయంత్రం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోవడానికి వీలుగా సడలింపు ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు.
అక్టోబర్ 23న హిందూ ముస్లింలకు మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు 68 మందిని అరెస్టు చేశారు. తమ వద్ద నున్న ఫొటోలు, వీడియోల ఆధారంగా పోలీసులు ఈ అరెస్టులు చేసినట్లు బేనీవాల్ చెప్పారు. ఐదుగురు ప్రధాన నిందితులలో ఇర్ఫాన్‌ను మంగళవారం సాయంత్రం అరె స్టు చేశారు. మిగతా నలుగురు మొబిన్, ఆసిఫ్, తారిఖ్, జాఫర్ కోసం గాలింపు కొనసాగుతోంది. 36 బ్లాకులున్న త్రిలోక్‌పురిలో ఢిల్లీ పోలీసు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్ర భద్రతా బలగాలకు చెందిన వెయ్యి మంది పోలీసులు, 30కి పైగా పోలీసు వ్యాన్లు, వాటర్ కేనన్లు, అల్లర్ల నియంత్రణ వాహనాలతో పహరా కాస్తున్నారు. నిఘా కోసం పోలీసులు డ్రోన్‌ని కూడా ఉపయోగిస్తున్నారు.
త్రిలోక్‌పురిలో నిషేధాజ్ఞలు మరికొన్ని రోజులు కొనసాగించాలని పోలీసులు యోచిస్తున్నారు. పరిస్థితి పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నందున్న ఏ క్షణాన్నైనా హింస చెలరేగవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నవరాత్రులను పురస్కరించుకుని బ్లాక్ నంబర్-2లో మాతాకీ చౌకీ ఏర్పాటు చేసిన చోట శుక్రవారం జాగరణ్ నిర్వహించవలసి ఉంద ని, అలాగే నవంబర్ 4న మొహర్రంను పురస్కరించుకుని తాజియాల ఊరేగింపు తీస్తారని, మత సంబంధమైన ఈ రెండు కార్యక్రమాల దృష్ట్యా మరికొన్నాళ్ల పాటు భద్రతను మరింత కట్టుదిట్టంగా ఉంచవలసిన ఆవశ్యకత ఉందని పోలీసులు అంటున్నారు .