ఇంటిపై విరిగిపడిన కొండచరియలు: నలుగురి మృతి
విశాఖ: విశాఖ జిల్లాలోని తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీలో ఆదివారం తెల్లవారుజామున విషాదం వెలుగుచూసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కాలనీలో పలు ఇళ్లపై కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురుసజీవ సమాధి అయ్యారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
గాయపడిన వారిని అప్పల సూరి(55), మరియమ్మ(45), బాల(40), శ్రీరాం(20) విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో చికిత్సపొందుతూ శ్రీరాం అనే యువకుడు ఆదివారం ఉదయం 9 గంటలకు మృతిచెందాడు. అధికారులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. విశాఖలో సాయంత్రం నుంచి బాగా వర్షం కురుస్తోంది. ఆ వర్షానికి తడిసి కొండ చరియలు జారిపడి ఉంటాయని భావిస్తున్నారు. కాగా, మృతులు సూర్యనారాయణ(65), మహాలక్ష్మీ(55), ఆదినారాయణ(7), శ్రీరాం(20)గా పోలీసులు గుర్తించారు.
సంఘటనా స్థలాన్నిపరిశీలించిన అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు, తదితరులు బాధితులను పరామర్శించారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు.