లిఫ్టర్ల బలం... జూడోకాల పట్టు
తొలి రోజు భారత్‌కు ఒక స్వర్ణం సహా 5 పతకాలు
కామన్వెల్త్ గేమ్స్ తొలిరోజు భారత అథ్లెట్లు ఆశించిన స్థాయిలో రాణించారు. దీంతో తొలి రోజు మన ఖాతాలో ఐదు పతకాలు చేరాయి. వెయిట్ లిఫ్టర్ సంజిత దేశం తరఫున తొలి స్వర్ణం సాధించింది.
గ్లాస్గో: ఊహించినట్లుగానే కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్లు తమ కండ బలాన్ని చూపించి రెండు పతకాలను కొల్లగొట్టారు. మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో సంజితా కుమ్‌చమ్ 173 (స్నాచ్ 77+ క్లీన్ అండ్ జర్క్ 96) కేజీల బరువు ఎత్తి స్వర్ణం సాధించింది. మీరాబాయి చాను 170 (స్నాచ్ 75+ క్లీన్ అండ్ జర్క్ 95) కేజీలతో రెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. కెచీ ఓప్రా (నైజీరియా) 162 కేజీలతో (స్నాచ్ 70+ క్లీన్ అండ్ జర్క్ 92) కాంస్యం సొంతం చేసుకుంది.
మహిళల జూడో 48 కేజీల కేటగిరీ ఫైనల్లో సుశీలా లిక్మాబామ్ 0-1తో రెనిక్స్ (స్కాట్లాండ్) చేతిలో ఓడి రజతంతో సంతృప్తిపడింది. పురుషుల 60 కేజీల పతక పోరులో నవజ్యోత్ చనా (పంజాబ్) కూడా మెకంజీ (ఇంగ్లండ్) చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. 52 కేజీల విభాగంలో కల్పన తౌడమ్... క్రిస్టియాని లెజెంటిల్ (మారిషస్)పై గెలిచి కాంస్య పతకం దక్కించుకుంది.
పురుషుల 66 కేజీల విభాగం రెప్‌చేజ్ రౌండ్లో గెలిచిన మంజీత్ నందాల్ కాంస్య పతక పోరులో సియెబులా మబుల్ (దక్షిణాఫ్రికా) చేతిలో ఓటమిపాలయ్యాడు.
అంతకుముందు జరిగిన పోటీల్లో సుశీల తొలి రౌండ్లో మరియా మెడ్జా ఈఫా (కామెరూన్)పై; క్వార్టర్స్‌లో మేయర్ (ఆస్ట్రేలియా)పై; సెమీస్‌లో... రైనర్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో నవజ్యోత్... ప్రత్యర్థి డానియెల్ లీ గ్రాంజీ (దక్షిణాఫ్రికా)ను ఒక నిమిషం 51 సెకన్లలో నాకౌట్ చేసి ఫైనల్‌కు అర్హత సాధించాడు.
బ్యాడ్మింటన్‌లో హవా: మిక్స్డ్ టీమ్ గ్రూప్-బి మ్యాచ్‌లో భారత్ 5-0తో ఘనాపై విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ 21-6, 21-16తో డానియెల్ సామ్‌పై; మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు 21-7, 21-5తో స్టెల్లా అమసాహ్పై; పురుషుల డబుల్స్‌లో అక్షయ్ దివాల్కర్-ప్రణవ్ చోప్రా 21-7, 21-11తో ఇమాన్యుయేల్ డోంకోర్-అబ్రమ్ అయెటీలపై; మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని 21-4, 21-10తో ఆర్చర్-బోట్వేలపై; మిక్స్డ్ డబుల్స్‌లో పి.సి.తులసీ-శ్రీకాంత్ 21-5, 21-9తో సామ్-అమసాహ్లపై గెలిచారు.
టీటీలోనూ ఎదురులేదు: టేబుల్ టెన్నిస్‌లో భారత్ ఆకట్టుకుంది. పురుషుల గ్రూప్-3 తొలి మ్యాచ్‌ల్లో 3-0తో వనౌత్పై గెలిచి ముందంజ వేసింది. మహిళల గ్రూప్-4 మ్యాచ్‌ల్లో భారత్ 3-0తో బార్బడోస్పై; 3-1తో నైజీరియాపై విజయం సాధించింది.
స్క్వాష్: మహిళల రెండో రౌండ్లో దీపికా పల్లికల్ 3-0తో చార్లెటీ నాగ్స్ (ట్రినిడాడ్)పై; జోష్న చినప్ప 3-1తో డియోన్ సఫెరీ (వేల్స్)పై; ఆనక అలకమోని 3-0తో డాలియా ఆర్నాల్డ్ (మలేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.
హాకీలో మహిళల శుభారంభం: మహిళల హాకీ ప్రిలిమినరీ రౌండ్లో భారత్ 4-2తో కెనడాపై నెగ్గింది. స్విమ్మింగ్‌లో సాజన్ ప్రకాశ్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్‌కు చేరుకోలేకపోయాడు. హీట్స్‌లో అతను 3:59:29 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 20వ స్థానంలో నిలిచాడు. 100 మీటర్ల ఫ్రీస్టయిల్ హీట్స్‌లో పారా స్విమ్మర్ ప్రశాంత కర్మాకర్ 1.04.86 సెకన్లలో రేసును ముగించి ఫైనల్‌కు అర్హత సాధించాడు. సైక్లింగ్‌లో భారత సైక్లిస్ట్‌లు నిరాశపర్చారు. పురుషుల స్ప్రింట్ ఈవెంట్ క్వాలిఫయింగ్ రౌండ్లో అమర్జిత్, అమ్రిత్, అలన్ బాబీలు వరుసగా 22, 23, 25వ స్థానాల్లో నిలిచారు. 400 మీటర్లలో భారత బృందం ఆఖరి స్థానంతో సరిపెట్టుకుంది.