రైతులను ఆదుకుంటాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ. 50 కోట్లతో గోదాంల నిర్మాణం చేపట్టి రైతులను ఆదుకుంటామని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మంగళవారం శంకర్‌పల్లిలో రూ.30 కోట్లతో నిర్మించిన రైల్వే బ్రిడ్జి, రెండు కోట్ల నిధులతో చేపట్టిన మార్కెట్ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా రైతులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామీణ ప్రాంతాలను నగరాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
హైదరాబాద్ - బీజాపూర్ అంతర్ రాష్ట్ర రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయటంతో పాటు శంకర్‌పల్లిని నగర పంచాయితీగా ఏర్పాటు చేసి ముంబై-బెంగుళూరు జాతీయ రహదారులను కలిపేలా మరో రెండు లింక్ రోడ్ల నిర్మాణాలకు నిధులు అందిస్తామని తెలిపారు. శంకర్‌పల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. దేశంలో రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు.