మాటబొమ్మ
ప్రాణంలేని ఒక బొమ్మ లైవ్‌లో మాట్లాడుతుంది. బర్త్‌డే పార్టీలో అల్లరి చేస్తుంది. నీ పేరు ఏంటి అంటే నీ పేరు చెప్పు అని బడాయికి పోతుంది.. ముద్దు ముద్దు మాటలతో అల్లరి చేసే ఆ బుజ్జిగాడిని చూసి పిల్లలు సంబర పడిపోతుంటారు. కానీ అదంతా వెంట్రిలాక్విస్ట్ మాయ! పెదాలు కదలకుండా బొమ్మను ఆడిస్తూ నవ్వులు పూయించే ఆర్ట్ వెంట్రిలాక్విజం. శనివారం లామకాన్‌లో ప్రముఖ వెంట్రిలాక్విస్ట్ సంతోష్ వర్క్‌షాప్ నిర్వహించారు.
..:: ఓ మధు
ఒకప్పుడు గ్రీక్, లాటిన్ దేశాల్లో చెట్లూ, పుట్టలు మాట్లాడినట్టు చేసే బ్లాక్ మ్యాజిక్ రాను రాను ఒక ఆర్ట్ ఫాంగా మారిందని చెప్తారు. మన దేశంలో వెంట్రిలాక్విజంపై అవగాహన తక్కువ. మన దగ్గర వెంట్రిలాక్విజం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అమెరికాలో ప్రత్యేకంగా ఫలానా వాళ్లే వెంట్రిలాక్విజం చెయ్యటం అంటూ ఉండదు. మార్కెటింగ్, మతప్రచారం, టీచింగ్ ఇలా పలు రకాలుగా ఈ ఆర్ట్‌ని వాడుతుంటారు. కాగా, 90ల్లో టీవీ ప్రకటనల్లో లిజ్జత్ పాపడ్ అంటూ వచ్చిన బొమ్మ గుర్తుండే ఉంటుంది. అందరికీ పరిచయం వున్న ఈ ఆర్ట్‌కు ఆదరణ బాగానే ఉన్నా, నేర్చుకోవటం పట్ల ఆసక్తి లేదు.
ఉపాధి మార్గం..
హైదరాబాద్‌లో ఈ ప్రదర్శనలకు ఎంతో స్కోప్ ఉన్నా... ఆర్టిస్టులు 20కి మించి లేరు. ఉన్నా.. తెలుగు తప్ప ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రదర్శన ఇవ్వలేరు. ఇలా రెండు, మూడు భాషలు తెలిస్తే కార్పొరేట్ ఈవెంట్స్ చేసుకోవచ్చు. మాములుగా పుట్టిన రోజులకు ఇచ్చే షోస్‌కి 2వేల వరకు వస్తే, కార్పొరేట్ ఈవెంట్స్ ద్వారా 10-12 వేల వరకు వచ్చే అవకాశం ఉంది. కొంచెం శ్రద్ధగా నేర్చుకుంటే వెంట్రిలాక్విజమ్‌ను 6 నెలల్లో ఒంటపట్టించుకోవచ్చు. ఈ థ్రిల్లింగ్ ఆర్ట్ గురించి అవగాహన కలిగించేందుకు బంజారాహిల్స్ లామకాన్‌లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు వెంట్రిలాక్విస్ట్ సంతోష్. ఈ వర్క్‌షాప్‌లో పిల్లలు, పేరెంట్స్ ఉత్సాహంగా పాల్గొని బేసిక్స్ నేర్చుకున్నారు. కంపెనీ సెక్రటరీగా పనిచేస్తూ.. సాయంత్రం వేళల్లో వెంట్రిలాక్విజం ప్రదర్శనలు ఇస్తున్న సంతోష్‌కి ఈ ఆర్ట్‌తో ఉన్న అనుబంధం 15 ఏళ్లు.
పవర్ఫుల్ ఆర్ట్...
‘షో స్టార్ట్ అయ్యాక నా ముందున్న ఆడియెన్స్‌ని ఎంటర్టెయిన్ చెయ్యటంలో కలిగే ఆనందం వెలకట్టలేనిది. నా ఉద్యోగానికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా షోస్ ఇవ్వగలుగుతున్నాను. నాలాగే చాలామంది ఈ ఆర్ట్‌ని నేర్చుకుని ఎంటర్టెయిన్ చెయ్యవచ్చు. బర్త్‌డే పార్టీల్లో బొమ్మతో ప్రదర్శన ఇచ్చినప్పుడు పిల్లలు వచ్చి బొమ్మకు కేక్ తినిపిస్తుంటారు. అంతగా ఆడియన్స్‌ని ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉన్న ఈ ఆర్ట్ చాలా పవర్ఫుల్ కూడా. వర్క్‌షాప్స్ ద్వారా అన్ని వర్గాల వారిని అట్రాక్ట్ చెయ్యాలనుకుంటున్నాను. నేర్చుకోవాలనుకుంటే తెలుగు యూనివర్సిటీలో వెంట్రిలాక్విజం డిప్లొమా కోర్సు ఉంది’ అని చెబుతున్నారు సంతోష్!