డిస్కోడ్యాన్సర్కు 'శారద' చిక్కులు!
'డిస్కోడ్యాన్సర్' సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొని అటుపై ఎన్నో హిట్లు సాధించి.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయారంగేట్రం చేసి ప్రస్తుతం ఎంపీ(రాజ్యసభ)గా కొనసాగుతున్న మిథున్ చక్రవర్తి చి్క్కుల్లో పడ్డారు. పశ్చిమబెంగాల్, ఒడిశా, అసోం రాష్ట్రాలను కుదిపేసిన శారద చిట్‌ఫండ్ కేసులో ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనకు సమన్లు జారీచేసింది.
కోట్ల విలువైన కుంభకోణం వ్యవహారంతో తన ప్రమేయం లేదని రుజువుచేసేలా అకౌంట్ల వివరాలను వెల్లడించనందునే మనీలాండరింగ్ చట్టం ప్రకారం మిథున్‌కు సమన్లు జారీచేసినట్లు ఈడీ వర్గాలు గురువారం వెల్లడించాయి. అయితే వార్తలను మిథున్ చక్రవర్తి న్యాయవాది బిమన్ శంకర్ తోసిపుచ్చారు. ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని పీటీఐ వార్తా సంస్థతో అన్నారు.
శారద చిట్‌ఫండ్ కంపెనీ ప్రకటనలకు మిథున్ చక్రవర్తి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. అందుకుగానూ ఆయన రెండు కోట్ల రూపాయలు స్వీకరించారని, అదంతా అక్రమ డబ్బేనని ఈడీ విచారణలో తేలింది.ఇదే విషయమై గత ఏడాది జూన్‌లో ఈడీ అధికారులు మిథున్ చక్రవర్తిని ముంబైలో ప్రశ్నించారు. కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలంటే తన బ్యాంక్ అకౌంట్ల వివరాలన్నీ వెల్లడిస్తానని మిథున్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగతంగానైనా, లాయర్ ద్వారానైనా ఖాతాల వివరాలు తెలపాలని మిథున్‌కు ఈడీ సమన్లు జారిచేసింది.