కబ్జాకోరల్లో బాసర ఆలయ భూములు
భైంసా : చదువుల తల్లి బాసర సరస్వతీ క్షేత్రం అమ్మవారి భూములకు రక్షణ కరువైంది. దేశంలో రెండు సరస్వతీ ఆలయాలుండగా.. ఒకటి జమ్మూకాశ్మీర్లో మరో టి ఇక్కడ ఉంది. దీంతో బాసర అమ్మవారికి గతంలో భక్తులు భూములను విరాళంగా అందించారు. వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో ప్రస్తుతం కబ్జాకోరల్లో మగ్గుతున్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే భూములపై దేవాదాయ శాఖ కూడా అంతగా పట్టించుకోకపోవడంతో కబ్జాదారులు ఆ భూములకు కన్నం వేస్తున్నారు.
ఆలయ భూములు ఇవే..
బాసర సరస్వతీ ఆలయానికి 158 ఎకరాల 38 గుంటల భూమి ఉంది. బాసర శివారల్లో 93.7 ఎకరాలు ఉంది. బాసరలో 72 ఎకరా ల్లో ఆలయం, అతిథిగృహలు, ఉద్యానవనాలు ని ర్మించారు. మిగితా 21 ఎకరాల భూమి అర్చకుల అ ధీనంలో ఉంది. ఈ భూమిపై పలు కేసులు న్యాయస్థానాలు, దేవాదాయశాఖ ట్రిబ్యునల్ పరిధిలో విచారణలో ఉన్నాయి. ఏళ్లుగా భూములపై విచారణ కొనసాగడంతో ఈ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది.
డివిజన్ వ్యాప్తంగా భూములు...
బాసర గ్రామంతోపాటు నిర్మల్ డివిజన్లో 49.26 ఎకరాలు సరిహద్దు మహారాష్ట్రలోనూ మరో 16.5 ఎకరాల భూమి ఉంది. ధర్మాబాద్ పక్కనే ఉన్న బా లాపూర్ శివారులో ఈ భూమి ఉంది. భైంసా మం డలం గుండేగాంలో 11.28ఎకరాలు, సిరాల గ్రామం లో 6.22 ఎకరాలు, తానూరు మండలం బోల్సాలో 13.18ఎకరాలు, బెల్తరోడాలో 16.15ఎకరాల భూ మి ఉంది. రికార్డుల్లో ఉన్న ఈ భూములు గుర్తించడానికి అధికారులు క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేపట్టడం లేదు.
గతంలో వేలంపాట ద్వారా అధికారులు ఈ భూములను స్థానిక గ్రామస్తులకు సాగు చేసుకునేం దుకు కేటాయించే వారు. భూములున్న గ్రామాల్లో ముందస్తు చాటింపులు వేయించి వేలం నిర్వహించేవారు. రానురాను ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. సంబంధిత గ్రామాల్లో కొంత మంది ఈ భూములను అనధికారికంగా సాగుచేసుకుంటున్నారు.
రెవెన్యూ మంత్రి చెప్పినా..
ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ సదస్సు నిమిత్తం బాసర వచ్చిన అప్పటి మంత్రి రఘువీరారెడ్డికి బాసర గ్రా మస్తులు, ఆలయ భూములపై ఫిర్యాదు చేశారు. స భా వేదికపైనే మంత్రి ఆలయ భూములపై పూర్తిస్థా యి సర్వే నిర్వహించి న్యాయస్థానాల పరిధిలోని అ న్యాక్రాంతమైన భూముల స్వాధీనానికి చర్యలు తీ సుకోవాలని ఆదేశించారు. సిబ్బంది కొరత సాకుగా చూపి ఇప్పటికీ పూర్తిస్థాయి సర్వే చేపట్టలేదు.
కోట్ల రూపాయల విలువ..
ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందుతున్న బాసరలో భూముల ధరలు కోట్ల రూపాయలు పలుకుతున్నా యి. చదువుల తల్లి సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు నలుమూలలా భక్తులు తరలివస్తున్నారు. పక్కనే ట్రిపుల్ ఐటీ ఏర్పాటైంది. దీంతో ఒక్కసారిగా ఇక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఆలయ భూములు కూడా కోట్లాది రూపాయల విలువ చేస్తున్నాయి. దీంతో చాలా మంది వీటిపై కన్నేశారు.
హద్దులు చెరిపేసి పక్కవారు ఆలయ భూముల్లోకి చొరబడుతున్నారు. ఆలయ భూములకు హద్దురాళ్లు, రక్షణ కంచె లేకపోవడంతో రియల్టర్లు సైతం ఈ భూమిపై కన్నేస్తున్నారు. ఇంత జరుగుతున్నా భూముల పరిరక్షణకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టడం లేదు. బడాబాబుల కన్నుపడ్డ ఈ భూములను తెలంగాణ సర్కారే కాపాడాలని భక్తు లు కోరుతున్నారు. కానుకల రూపంలో అమ్మవారికి ఇచ్చిన భూములపై ఇప్పటికైనా అధికారులు దృష్టిపెట్టి వాటిని స్వాధీనం చేసుకోవాలంటున్నారు.
పకడ్బందీ సర్వే - విజయరామారావు, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్
బాసర ఆలయ భూములపై పకడ్బందీ సర్వే నిర్వహిస్తున్నాం. ఆలయ భూములు పరుల పరం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ భూములపై ట్రిబ్యునల్ పరిధిలో విచారణ కొనసాగుతోంది. భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. భూముల స్వాధీనానికి నోటీసులు జారీ చేశాం.