వెస్టర్న్ రైల్వేకు కొత్త ఏటీవీఎంలు
సాక్షి, ముంబై: ఈ నెల చివరి వరకు వెస్టర్న్ రైల్వే 400 ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్ (ఏటీవీఎం)లను కొనుగోలు చేయనుంది. త్వరలోనే పాత ఏటీవీఎంల స్థానంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. బోరివలి, కాందివలి, అంధేరి రైల్వే స్టేషన్లలో పాత ఏటీవీఎంల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేశారు. ఈ నెల చివరి వరకు వివిధ రైల్వే స్టేషన్లలో దాదాపు 400 కొత్త ఏటీవీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు వెస్టర్న్ రైల్వే పీఆర్వో శరత్ చంద్రాయన్ తెలిపారు. ఇటీవల కాలంలో పాత ఏటీవీఎంల విషయంలో చాలా సమస్యలు తలెత్తాయన్నారు. వీటిలో చాలావరకు పని చేయడం లేదన్నారు. ఈ విషయమై ప్రయాణికుల నుంచి తమకు చాలా ఫిర్యాదులు అందాయన్నారు.
కార్డును రీడ్ చేయడం, టికెట్‌ను ప్రింట్ చేయడం పెద్ద సమస్యగా మారడంతో అధికారులు ఈ సమస్యను పరిష్కరించారన్నారు. ఈ కొత్త ఏటీవీఎంలను పలు రైల్వే స్టేషన్లలో రైల్వేఫుట్ ఓవర్ బ్రిడ్జి చివరలో ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల రైల్వే ఆవరణలోకి ప్రవేశించగానే ప్రయాణికులు వీలైనంత త్వరగా టికెట్లను కోనుగోలు చేసే వీలు ఉంటుందన్నారు. అంతేకాకుండా ఈ ఏటీవీఎంలను అంధేరి స్టేషన్లో మెట్రో రైల్ ప్రవేశ ద్వారం వద్ద కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా, ఏటీవీఎం స్మార్ట్‌కార్డు రెన్యువల్ కోసం ప్రతి రైల్వే స్టేషన్లో ఒక టికెట్ కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ ప్రయాణికులు స్మార్ట్ కార్డును కొనుగోలు చేసినా అదేవిధంగా రెన్యువల్ చేసినా వారికి అదనంగా 5 శాతం రీచార్చ్ లభిస్తుంది.