Sarod legend
-
సరోద్ పండితుడు దాస్‌గుప్తా కన్నుమూత
కోల్‌కతా: సరోద్ పండితుడు బుద్ధదేవ్ దాస్‌గుప్తా(84) దక్షిణ కోల్‌కతాలోని తన నివాసంలో సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన ఆయన కొద్ది రోజులుగా శ్వాససంబంధ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని కుటుంబీకులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. దాస్‌గుప్తా మృతి ఆ రంగానికి తీరని లోటని పేర్కొన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 1933లో బీహార్ రాష్ట్రంలోని భాగల్పూరు ఆస్పత్రిలో జన్మించారు. పండిట్ రాధికా మోహన్ మోయిత్రా వద్ద సరోద్ నేర్చుకున్నారు. 2015లో సంగీత్ మహాసమ్మాన్, బంగాబిభూషణ్ బిరుదులు పొందారు. ఆయన తండ్రి ప్రఫుల్ల మోహన్ దాస్‌గుప్తా జిల్లా మేజిస్ట్రేట్ మాత్రమేగాక సంగీతంలో ప్రజ్ఞాశాలి. బుద్ధదేవ్ దాస్‌గుప్తా చిన్న కుమారుడు యూ.ఎస్ నుంచి వచ్చాక బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. -
శాంతి కోసం అమ్జాద్ పాట
న్యూఢిల్లీ: ప్రపంచంలో శాంతి, ఐక్యతకు పిలుపునిస్తూ అమెరికాలో శనివారం జరిగే సంగీత కచేరీలో ప్రముఖ సరోద్ విద్వాంసుడు అమ్జాద్ అలీ ఖాన్, ఆయన కుమారులు అమాన్, అయాన్లు పాల్గొననున్నారు. ‘చాంట్ 4 చేంజ్’ పేరిట వాషింగ్టన్‌లోని లింకన్ మెమొరియల్‌లో జరిగే ఈ వేడుకలో వీరితో పాటు పలు సామాజిక, రాజకీయ, మత నేపథ్యాల వచ్చే కళాకారులు తమ పాటతో శాంతి కోసం గళమెత్తనున్నారు. ‘చాంట్ 4 చేంజ్ అనేది ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు పిలుపునిస్తుంది. అమాన్, అయాన్ ,నేను ఇందులో పాల్గొని శాంతి,సమైక్యతను ప్రతిబింబించే, గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, సూఫీ గురువు అమీర్ ఖుస్రూలతో ముడిపడిన పాటలను ఆలపిస్తాం’ అని అమ్జాద్ చెప్పారు. ముగ్గురు వుయ్ షల్ ఓవర్‌కమ్, వైష్ణవ్ జానాతో, రఘుపతి రాఘవ రాజారాం లాంటి పాటలను, 13 శతాబ్దంలో ఖుస్రూ సృష్టించిన తారానా గాన శైలిని ప్రదర్శించే అవకాశముంది. వీరికి తబలా వాయిద్యకారుడు అభిజిత్ జతకలుస్తారు.