తుని రైల్వేస్టేషన్లో మహిళ ప్రసవం
తుని(తునిరూరల్), న్యూస్‌లైన్ : తుని రైల్వేస్టేషన్లో బుధవారం ఓ గర్భిణి ప్రసవించింది. పుట్టిన కవలలు పురిట్లోనే చనిపోవడంతో విషాదం నెలకొంది. తుని ఆశ్రమ వీధికి చెందిన రాయిపాటి ఏసమ్మ అనే ఆరు నెలల గర్భిణి బుధవారం స్థానిక ఏరియా ఆస్పత్రికి వైద్యపరీక్షలకు వచ్చింది. ఆమెకు రక్తం లేకపోవడాన్ని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ విష్ణువర్థని గుర్తించారు. వెంటనే కాకినాడ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. కాకినాడ వెళ్లేందుకు ఏసమ్మ రైలుకోసం స్థానిక స్టేషన్‌కు వెళ్లింది. అంతలోనే పురిటి నొప్పులు మొదలయ్యాయి. గమనించిన ప్రయాణికులు రైల్వే ఆస్పత్రి వర్గాలకు ఈ విషయాన్ని తెలిపారు. కానీ ఎవ్వరూ స్పందించకపోవడంతో సమీపంలో ఉన్న కోటనందూరు పీహెచ్సీ సూపర్వైజర్ సరోజని సహాయంతో చీరలతో గదిని ఏర్పాటు చేశారు. ఏసమ్మ కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే జన్మించేసరికే ఇద్దరు పిల్లలు చనిపోయారు. అనంతరం 108లో బాలింతను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏసమ్మకు ‘ఓ’ నెగిటివ్ రక్తం అవసరమని, నెలలు నిండకుండా ప్రసవం కావడంతో బిడ్డలు మృతి చెందారని సూపరింటెండెంట్ విష్ణువర్థని, డాక్టర్ రవిచంద్రలు తెలిపారు.