saroornagar police
-
మాస్కు లేకుండా మాజీ ఎమ్మెల్యే తీగల, రూ.1000 ఫైన్
సాక్షి, హైదరాబాద్: మాజీ శాసన సభ్యులు, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డికి సరూర్‌నగర్ పోలీసులు చలానా విధించారు. కారులో మాస్క్ లేకుండా వెళుతున్న తీగల కృష్ణారెడ్డికి పోలీసులు 1000 రూపాయల చలానా వేశారు. కర్మన్‌ఘాట్ చౌరస్తా వద్ద సరూర్‌నగర్ పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. అదేసమయంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తన కారులో వెళ్తున్నారు. పోలీసులు ఆయన కారును తనిఖీ చేశారు. ఆ సమయంలో తీగల కృష్ణారెడ్డి మాస్క్ ధరించలేదు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని సరూర్‌నగర్ సబ్ ఇన్స్పెక్టర్ ముకేష్.. మాజీ ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. కారులో వెళ్తున్నా మాస్కు ధరించాలా? అంటూ ఆయన ఎస్ఐతో గొడవకు దిగారు. ఈ క్రమంలో సబ్ఇన్స్పెక్టర్ ముకేశ్‌కు తీగల కృష్ణారెడ్డికి మధ్య వాగ్వాదం నెలకొంది. మాకు అంతా సమానులే అంటూ పోలీసులు తీగలకు ఎట్టకేలకు 1000 రూపాయల చలానా విధించారు. -
ఘోరం.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..!
మానవత్వం మంటగలిసింది.. కామంతో కళ్లు మూసుకుపోయి.. విచక్షణ కోల్పోయి.. రాక్షసత్వం ఆవహించి.. అభం శుభం ఎరుగని ఏడాదిన్నర వయసున్న బాలుడ్ని హత్య చేశాడో దుర్మార్గుడు. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని గుట్టుచప్పుడు కాకుండా బాలుడ్ని అంతమొందించి ఫిట్స్‌తో చనిపోయాడని నమ్మించాడు. చివరకు పోలీసుల విచారణలో అసలు నిజం బయటపెట్టాడు. సాక్షి, హైదరాబాద్ : సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బర్మా మౌనిక అనే మహిళ భర్త అజయ్‌లాల్‌తో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. వీరికి రోహిత్ (18 నెలలు) అనే బాలుడు ఉన్నాడు. ఈ క్రమంలో దిల్సుఖ్నగర్ కోదండరాంనగర్‌లో నివాసం ఉండే వాషింగ్‌మెషిన్ టెక్నీషియన్ మద్దికుంట రాజుతో వివాహేతర సంబంధం ఏర్పడి, మౌనిక అతనితో కలిసి అక్కడే సహజీవనం చేస్తోంది. ఈ నెల 28న మౌనిక పనిమీద బయటకు వెళ్లగా.. ఇదే అదనుగా భావించిన రాజు బాలుడ్ని అడ్డు తొలగించుకోవాలని భావించి తీవ్రంగా చాతీపై కొట్టాడు. దీంతో గాయపడిన బాలుడికి.. ఫిట్స్ వచ్చాయని ఇరుగుపొరుగు వారిని నమ్మించి, మౌనికకు ఫోన్ చేసి చెప్పి స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మౌనిక రోదిస్తూ తన భర్త అజయ్‌లాల్‌కు ఫోన్ చేసి బాబు ఫిట్స్‌తో చనిపోయాడని తెలి్పంది. అయితే వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన అజయ్‌లాల్ (బోరబండ, మధురానగర్ నివాసి) మొదట పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతిగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు 29న ఉదయం సరూర్‌నగర్ పోలీసులకు కేసు బదిలీ చేశారు. అజయ్‌లాల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఇన్స్పెక్టర్ సీతారాం, ఎస్ఐ రవికుమార్‌లు కోదండరాంనగర్లోని మద్దికుంట రాజు ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. బాబు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక ఆధారంగా బయటకు కనబడని గాయాల వల్లే బాబు ప్రాణాలు పోయినట్లు తేలింది. దీంతో అనుమానంతో మద్దికుంట రాజును పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే కొట్టి చంపినట్లు ఒప్పుకున్నాడు. బాలుడి తండ్రి ఫిర్యాదుతో రాజు వేసిన పథకం బెడిసి కొట్టింది. ఈ మేరకు నిందితుడ్ని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: నిత్య పెళ్లికొడుకు: ఒకరిద్దరు కాదు.. ఏకంగా 9 మంది.. -
సీనియర్ సిటిజన్లను కాపాడిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : వరదల్లో చిక్కుకున్న వృద్ధుల ప్రాణాలు కాపాడటానికి పోలీసులు తెగువ చూపించారు. ప్రాణాలకు తెగించి మరీ వారికి సహాయం చేశారు. శనివారం కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వివేకానంద నగర్లోకి సైతం భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఓ ఇద్దరు వృద్ధులు వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని తమ ఇంట్లో చిక్కుకుపోయారు. ఎటూ వెళ్లలేక, ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ గడిపారు. ( హైదరాబాద్ వరదలు: వైరల్ వీడియోలు ) ఈ విషయం తెలుసుకున్న సరూర్ నగర్ పోలీసులు వారిని రక్షించటానికి రంగంలోకి దిగారు. ఎస్ఐ రవికుమార్ జేసీబీ సహాయంతో ఇంటి పైకి ఎక్కి వాళ్లిద్దర్ని కిందకు తీసుకువచ్చాడు. అనంతరం అక్కడినుంచి సురక్షిత ప్రాంతానికి తరలించాడు. వృద్ధలను కాపాడటంలో చొరవ చూపిన ఇన్స్పెక్టర్ సీతారాం, ఎస్ఐ రవి కుమార్‌లను జనం కొనియాడుతున్నారు. -
ఓవైసీపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
హైదరాబాద్: హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ ఇత్తెహాదులు ముస్లిమీన్ (ఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఓవైసీపై కేసు నమోదుకు 11వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు సరూర్ నగర్ పోలీసులను ఆదేశించింది. హైదరాబాద్ నగరానికి చెందిన అడ్వకేట్ కరుణా సాగర్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీ చేసింది. జాతీయ దర్యప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసిన ఉగ్రవాదులకు న్యాయసహాయం అందిస్తామనడం దేశద్రోహులకు ఆక్సిజన్ అందించడం లాంటిదేనని పిటిషనర్ ఆరోపించారు. ఇది పరోక్షంగా ఉగ్రవాదులకు మద్దతు పలకడమేనని కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన కోర్టు ఓవైసీ పై కేసు నమోదుకు ఆదేశించింది. హైదరాబాద్ లో భారీ విధ్వసానికి కుట్రుపన్నిన ఉగ్రవాదులను ఎన్ఐఏ వలపన్ని అరెస్టు చేసింది. దీనిపై స్పందించిన ఓవైసీ ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. -
భార్య షికారుకు రాలేదని బలవన్మరణం
హైదరాబాద్: భార్య షికారుకు రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. సరూర్‌నగర్ ఎస్ఐ నరేందర్ కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లాకు చెందిన వంశీకృష్ణ(26), చిత్తూరుకు చెందిన హిమబిందును ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలంగా వీరు దిల్సుఖ్నగర్ శారదానగర్‌లో ఉంటున్నారు. వంశీకృష్ణ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. శనివారం హిమబిందు పుట్టిన రోజు కావడంతో సాయంత్రం ఇద్దరూ కలిసి బయటకు వెళ్దామని భర్త అన్నాడు. ఇందుకు భార్య నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వంశీకృష్ణ రాత్రి సమయంలో గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత భార్య తలుపు తట్టినా తీయలేదు. దీంతో బావమరిది వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా వంశీకృష్ణ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని మృతి చెంది ఉన్నాడు. ఈ మేరకు కుటుంబసభ్యులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.