మహిళలమన్న సంగతి మర్చిపోవాలి
స్ఫూర్తి సిన్హా
‘‘మహిళగా... మహిళా శాస్త్రవేత్తగా రెండు పాత్రలు పోషించేందుకు రెండింతలు కష్టపడ్డాను అనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు చిన్న వయసులో ఉండగానే భర్తను కోల్పోయాను. ఒక్కోసారి ఆఫీసు పనులు ముగించుకుని ఏ అర్ధరాత్రో అపరాత్రో ఇంటికొస్తే... తినేందుకు కూడా ఏమీ ఉండేది కాదు. కొన్నిసార్లు నా బిడ్డ పవిత్ర సైకిలేసుకుని డీఆర్డీవో క్యాంటీన్ నుంచి బ్రెడ్ లాంటివి పట్టుకొచ్చేది. తగిన అవకాశమిస్తే ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తారు. మహిళలు ఆఫీస్ మీటింగ్స్‌లో, క్లాస్‌రూమ్‌లోనైనా, ఇతర ప్రాంతాల్లోనూ తాము మహిళలమని, ఒంటరిగా ఉన్నామన్న సంగతిని మరచిపోవాలి.
ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. అయితే దీంట్లో సమాజం పాత్ర కూడా చాలా ఉంది. మహిళలు తమతమ రంగాల్లో వృద్ధి చెందేందుకు సురక్షితమైన వాతావరణం ఉండాలి. దురదృష్టవశాత్తూ దేశంలో ఇప్పటికీ అలాంటి పరిస్థితులు లేవు. మహిళలు ఎలాంటి దుస్తులేసుకోవాలి? ఎలాంటి చోట్లకు వెళ్లాలి? ఎవరిని కలవాలి? అని సినిమాల ద్వారా సమాజానికి సందేశాలు పంపాల్సిన పరిస్థితి ఇంకా ఎందుకుంది? నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు మా నాన్న ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని కచ్చితంగా చెప్పగలను. మీకు పెద్దకట్నాలిచ్చి పెళ్లి చేయగలనో లేదో తెలియదుగానీ... శక్తివంచన లేకుండా మీరు చదివినంత చదివిస్తాను అనేవారు ఆయన. ఇలాంటి ప్రోత్సాహం అందరికీ లభించాలని కోరుకుంటున్నాను’’
– శశికళా సిన్హా, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇంటర్‌సెప్టర్ మిస్సైల్స్ ప్రోగ్రామ్, డీఆర్డీవో