మరి.. మరి... సోమరి
సోల్ / బద్ధకం
‘బద్ధకము సంజ నిద్దుర... వద్దుసుమీ దద్దిరంబు వచ్చును దానన్...’ అంటూ శతకకారుడు ఏనాడో హితవు పలికాడు గానీ బద్ధకస్తులు ఇలాంటి వాటిని పట్టించుకుంటారా? లోకం తలకిందులైపోయినా వారి రూటే సెపరేటు. పనికీ బద్ధకస్తులకూ చుక్కెదురు. ఖాళీగా కూర్చొనే బదులు పనేదైనా చేసుకోవచ్చు కదా అని పొరపాటున ఏ బద్ధకస్తుడినైనా అడిగారనుకోండి... ‘కూర్చోవడం మాత్రం పని కాదేంటి?’ అని ఠపీమని ఎదురు ప్రశ్నించి నోరు మూయించగలరు.బద్ధకస్తుల్లో అలాంటి తెలివితేటలకు ఏమాత్రం లోటుండదు. ‘కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఏదైనా పనీపాటా చేసుకోవచ్చు కదా’ అని పెద్దలెవరైనా మందలించబోతే... ‘కూర్చుని తింటే కొండలేం కరుగుతాయి గానీ, కూర్చుని తినేవాళ్లు కొండలా పెరుగుతారు... కావాలంటే నన్ను చూడు’ అని తమ భారశరీరాన్నే
ఉదాహరణగా చూపి చమత్కరించగలరు.
సోమరితనం సహజ లక్షణం
బద్ధకస్తులను సోమరులని, సోంబేరులని ఆడిపోసుకుంటారు గానీ, సోమరితనం మనుషుల సహజ లక్షణం. ఎంతటి పనిమంతులకైనా ఎంతో కొంత బద్ధకం ఉండనే ఉంటుంది. అయితే, అది శ్రుతి మించిన వాళ్లనే లోకం బద్ధకస్తులుగా పరిగణిస్తుంది. ఆదిమానవుడి వారసత్వ లక్షణంగా బద్ధకం ఇప్పటికీ మనుషుల్లో కొనసాగుతోందనేది శాస్త్రవేత్తల వాదన. వేట మాత్రమే తెలిసిన ఆదిమానవుడు అప్పటి తన అవసరాల మేరకు శక్తిని ఎడాపెడా వినియోగించుకోకుండా, పదిలపరచుకోవడానికే అలవాటు పడ్డాడు. ఎందుకంటే, ఆకలేసినప్పుడు వేటాడదామంటే జంతువులు దొరుకుతాయనే గ్యారంటీ లేదు. అందువల్ల జంతువు కనిపించినప్పుడే వేటాడటం, కడుపారా తిని, మరో జంతువు కనిపించేలోగా విశ్రాంతి తీసుకోవడం తప్ప వేరే పనేమీ ఉండేది కాదు. పరిణామ క్రమంలో వ్యవసాయం అలవడిన తర్వాత మానవుడి జీవితమే మారిపోయింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి ఆధునిక కాలం వరకు మానవులకు పని అనివార్యంగా మారింది. అయితే, అనివార్యములను శాయశక్తులా నివారించుకోవడంలోనే బద్ధకస్తులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తారు.
ఒళ్లొంచని ధీరులు
బద్ధకస్తుల్లోనూ స్థాయీ భేదాలు ఉంటాయి. కొందరు సాదాసీదా బద్ధకస్తులు. మరీ తప్పనిసరైతే నెమ్మదిగా, అయిష్టంగా ఏదోలా పని చేసేందుకు సిద్ధపడతారు. ఇంకొందరు ఉంటారు... అరివీర భయంకర పరమ బద్ధకస్తులు. కొంపలు అంటుకుంటున్నా సరే... ససేమిరా పని చేయరు. ఇలాంటి బాపతు మనుషులు గనుక ఇంట్లో ఉంటేనా... ఆస్తులు కరిగిపోయి ఆరిపోవడం ఖాయం. పనెందుకు చేయవని ప్రశ్నిస్తే, పని గండం ఉందంటూ తప్పించుకునే బాపతు వీరు. కర్మకాలి ఇలాంటి వాళ్లు ఉద్యోగాల్లో చేరితేనా..? వాళ్లు పనిచేసే ఆఫీసుల్లో పరిస్థితులు అతలాకుతలం కావడానికి ఎంతో కాలం పట్టదు. బద్ధకస్తులైన ఉద్యోగులు పొరపాటుగానైనా పని చేయరు. పని ఎగ్గొట్టడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాకులు చెబుతుంటారు. బద్ధకస్తులందరూ దాదాపు సాటిలేని ‘సాకు’వీరులే! తప్పనిసరిగా పని చేయాల్సి వస్తే, అందుబాటులోని అమాయక జీవిని ఎవరినైనా ఎంచుకుని, ఆ బకరాపైకి పని నెట్టేసి, ఖుషీగా కాలక్షేపం చేసేస్తారు. ఇలాంటి శాల్తీలు ఎక్కువగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే కనిపిస్తారు. కూసే గాడిద మేసే గాడిదను చెడగొట్టినట్లుగా... కాస్తో కూస్తో పనిచేసే వాళ్లనూ వీళ్లు చెడగొడతారు.
తెలివైన వాళ్లే... కాకపోతే...
బద్ధకస్తులు చాలా తెలివైన వాళ్లు. సోంబేరులంటూ ‘పని’మంతులందరూ వీళ్లను ఈసడిస్తారు గానీ, చాలామంది పనిమంతుల కంటే బద్ధకస్తులకు తెలివితేటలు ఎక్కువ. కాకపోతే, అవన్నీ పనిని ఎగ్గొట్టేందుకు మాత్రమే పనికొచ్చే చావు తెలివితేటలు. చాలా కష్టమైన పనికి సులువైన మార్గాన్ని కనిపెట్టాలంటే అలాంటి పనిని బద్ధకస్తుడెవరికైనా అప్పగిస్తే చాలని నిపుణులు చెబుతారు. కష్టమైన పనిని ‘పని’మంతులకు అప్పగిస్తే, వాళ్లు పాపం నానా ప్రయాసపడి ఆ పనిని పూర్తి చేస్తారు. అదే బద్ధకస్తులకు అప్పగిస్తేనా..? అతి తక్కువ శ్రమతో ఆ పనిని పూర్తిచేసే మార్గాన్ని అన్వేషిస్తారు. మన సమాజంలోని దృష్టి లోపమే తప్ప, బద్ధకస్తుల్లో ఏ లోపమూ లేదనేది వారిని సమర్థించే కొందరి వాదన. సక్రమంగా ఉపయోగించుకుంటే, బద్ధకస్తుల వల్ల సమాజానికి చాలా మేలు జరుగుతుందని, శ్రమ దమాదులతో కూడుకున్న పనులను తేలికగా చేసే మార్గాలన్నీ అలాంటి వాళ్ల చలవ వల్లనే అందుబాటులోకి వస్తాయని చెబుతారు.
గెలుపు భయం వల్లనే...
బద్ధకం జన్యులక్షణమని జన్యుశాస్త్ర నిపుణులు చెబుతుంటే, మానసిక శాస్త్రవేత్తలు మాత్రం బద్ధకానికి సవాలక్ష కారణాలను చెబుతున్నారు. ఆత్మగౌరవం లేకపోవడం, పిరికితనం, నిరాశ వంటి కారణాల వల్ల చాలామంది బద్ధకస్తులుగా మారుతారట. ముఖ్యంగా గెలుపు పట్ల ఉండే భయం వల్ల చాలామంది బద్ధకస్తులుగా మిగిలిపోతారట. ఒకవేళ పనిచేస్తే, పొరపాటున అది విజయవంతమవుతుందేమో! చేసిన పని విజయవంతమైతే అందరూ పొగుడుతారేమో! అలాంటి పొగడ్తలను భరించడం ఇబ్బందిగా ఉండదూ! అందుకే పని చేయకుండా ఉంటేనే మేలు అని డిసైడైపోతారట ఇలాంటి వాళ్లంతా. వీళ్లకు పని చేతకాకపోవడం అంటూ ఉండదని, పని చేతనైనా, పని చేస్తే వచ్చే పర్యవసానాల గురించిన ఆందోళన వల్లనే కొందరు బద్ధకస్తుల్లా తయారవుతారని, ఈ మానసిక పరిస్థితిని చక్కదిద్దకుంటే, వాళ్లు శాశ్వతంగా సోమరి జీవితాన్ని గడిపేస్తారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బద్ధకస్తులను గుర్తించడం తేలికే గానీ, వారు ఎందుకలా తయారయ్యారో తెలుసుకోవాలంటే మాత్రం మానసిక విశ్లేషణ చేయక తప్పదు.