చిన్నింటి నుంచి పతిని ఇంటికి తెచ్చుకున్న సతీ లీలావతి
హలో వరకూ అయితే ఓకే. కలిసి భోం చేద్దామా అన్నప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది. ఈ సండే ఖాళీయేనా అని ఎంక్వయిరీ చేస్తే ప్రాబ్లమ్ ఇంకా పెద్దదైనట్టే. అర్ధరాత్రి ఒక ఫోన్. ఎవరూ లేనప్పుడు ఇంటికి రాకడ. అంటే ఏమని? నిండా మునిగామని.
తప్పు చేయకుండా మనిషి ఉండడు.ఆకర్షణలో పడకుండా కూడా ఉండడు. అటువంటి సమయంలోనే మనం ఏంటి, ఎక్కడున్నాం, ఇది చేస్తే ఎంత సమస్య అనే ఇంగితాన్ని పాటించి సంయమనం వహించాలి. లేకుంటే, ఏమవుతుందిలే అని అనుకుంటే సమస్య పీకకు చుట్టుకుంటుంది. ఒక్కోసారి పీక తెగి పడవచ్చును కూడా. ఈ సినిమాలో హీరా ఒక అందమైన యువతి. దుష్టురాలు కాదు. దుర్మార్గురాలు కాదు. తను చాలా దయనీయమైన బాల్యాన్ని చూసింది కనుక కాస్త డబ్బున్నవాణ్ణి చూసి పెళ్లాడాలనుకుంటుంది. డబ్బున్నవాణ్ణి అని అనుకుంది తప్ప అతడు ఇది వరకే పెళ్లయినవాడా కాదా అన్నది చూసుకోలేదు. ఫలితంగా పెళ్లయిన రమేశ్ అరవింద్ ఆమెకు పరిచయం అవుతాడు. ఆమెను దగ్గరకు తీస్తాడు.
ఆమెకు దాదాపు భార్య స్థానం ఇస్తాడు. దాదాపు అని ఎందుకు అనంటే ఈ సమాజంలో అంతకుమించి ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి. పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలు ఉండి వారికి అన్యాయం చేసి ఇంకొకరితో తిరుగుతానంటే లోకం ఊరుకోదు. వాతలు పెడుతుంది. ఇతను హీరాకు ఫ్లాట్ ఇచ్చిందీ, అక్కడకు రోజూ రాకపోకలు సాగిస్తున్నదీ, ఇంట్లో అబద్ధాలు చెప్పి తిరుగుతున్నదీ అన్నీ భార్య కల్పన దృష్టికి వస్తాయి. మొదట తిడుతుంది. ఆ తర్వాత కొడుతుంది. ఆ తర్వాత నేను కావాలా ఆమె కావాలా తేల్చుకో అని నిలదీస్తుంది. అతడేం చెప్తాడు? ఒకవైపు ఇద్దరు పిల్లలను కని, షేప్ అవుట్ అయ్యి, పూజలు పునస్కారాలు అంటూ తిరిగే పాతముఖం భార్య. మరో వైపు బాబ్ కట్‌తో, అందమైన డ్రస్సులతో, సన్నగా నాజుకుగా ఉన్న ప్రియురాలు.
మనవాడు ఇటే మొగ్గుతాడు.ప్రియురాలే పానకం అనుకొని వెళ్లిపోతాడు.ఇప్పుడు ఏమిటి చేయడం?మునిగిన వాడికి చలివేయదు.కాని ఒడ్డున ఉన్నవారికి ఒకటే ఒణుకు. జైలు నుంచి పారిపోయిన దొంగ ఈజీగా పోలీసులకు చిక్కుతాడు. ఎందుకంటే అతడు సరాసరి ఇంటికి వస్తాడు కనుక వాళ్లు అక్కడే కాచుకుని ఉండి చేజిక్కించుకుంటారు. ఇంకో ఆడదాని మోజులో పడి వెళ్లిన మగవాడికి కూడా ఇల్లు పీకుతూ ఉంటుంది. పిల్లలు మనసులోకి వస్తుంటారు. ఆ పాత జీవితం తాలూకు గిల్ట్ ఏదో లాగుతూ ఉంటుంది. అందుకే కల్పన అతడి మీద పిల్లలను ఎక్కుపెడుతుంది.
ఏ ఫ్లాట్‌లో అయితే రమేశ్ అరవింద్ హీరాతో ఉంటున్నాడో ఆ ఫ్లాట్‌కు పిల్లలను పంపించేస్తుంది. ఆ తర్వాత మామగారిని పంపించేస్తుంది. వాళ్లు అక్కడ తిష్ట వేస్తారు. ఈ పాత బంధాల పాశం కొత్తబంధపు మోజు వీటి మధ్య భర్త నలుగుతాడు. హీరా కూడా ఏమిటి ఈ తలనొప్పి అనుకుంటుంది. మరోవైపు రమేశ్ స్నేహితుడైన కమలహాసన్ పదే పదే ఈ బంధాన్ని డిస్కరేజ్ చేస్తుంటాడు. అప్పటికి రమేశ్ అరవింద్‌కు హీరా మీద మోహం, హీరాకు రమేశ్ అరవింద్‌తో అవసరం తీరిపోయాయి.
అక్కడి నుంచి ముందుకు పోయేంత గాఢత, నిజాయితీ వారి బంధంలో లేదు. ఎప్పుడో వాళ్ల మనసుల్లో పగుళ్లు ఏర్పడిపోయాయి. ఈ సందర్భాన్ని కల్పన అదునుగా తీసుకుంటుంది. హీరాను అదివరకే ప్రేమించి ఉన్న దగ్గుపాటి రాజాతో ఆమెను కలుపుతుంది. వాళ్లు ఒకరికొకరు సన్నిహితంగా ఉండటం చూసి రమేశ్ అరవింద్ మనసు విరిగిపోతుంది. ఆమె తనకు ద్రోహం చేసినట్టు భావిస్తాడు. కాని తను మాత్రం తన భార్యకు చేసింది ద్రోహం కాదా?మధ్యలో వచ్చిన గాలివాన పూర్తిగా వెలిసిపోతుంది. రమేశ్ అరవింద్ లెంపలు వేసుకుని భార్య దగ్గరకు చేరుకుంటాడు. హీరా తన ప్రియుడితో కొత్త జీవితం వెతుక్కుంటూ వెళ్లిపోతుంది.
పెళ్లి ఒక సిస్టమ్ కావడం వల్ల మాత్రమే మన దేశంలో గొప్పగా నిలబడలేదు. పెళ్లి వల్ల ఏకమైన స్త్రీ, పురుషులు కూడా ఆ సిస్టమ్ పట్ల తమ గౌరవాన్ని కలిగి ఉన్నారు. అందుకే ఎన్ని చికాకులు, ఆకర్షణలు, పక్కచూపులు, పెను అపార్థాలు వచ్చినా పెళ్లిని కాపాడుకుంటూ ఉన్నారు. సతీ లీలావతులు నేరుగా కనపడతారు. పతి దేవుళ్లు నిశ్శబ్దంగా ప్రాధేయపడి ఇంటిని నిలబెట్టుకుంటారు.సతీ పతి మధ్య ఏ కష్టమైనా రావచ్చు. కాని ‘మూడో వ్యక్తి’ మాత్రం రారాదు.అలా వచ్చిన మరుక్షణం ‘పరస్పర విశ్వాసం’ అనే మస్కిటోమేట్ని వెలిగించి ఆ దోమను తరిమికొట్టాలి.లేకుంటే ‘నమ్మకం’ అనే బ్యాట్ ఆడించాలి. అదిగో ఆకర్షణ. టప్.
1995లో కమలహాసన్ తన స్వీయ నిర్మాణంలో బాలూ మహేంద్ర దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘సతీ లీలావతి’. తమిళంలో పెద్ద హిట్టయ్యి అదే పేరుతో తెలుగులో డబ్ అయితే ఇక్కడా పెద్ద హిట్ అయ్యింది. దీనికి మూలం భాగ్యరాజా ‘చిన్నిల్లు’ అని చెప్పుకోవచ్చు. ఇదే సినిమాను హిందీలో సల్మాన్‌ఖాన్‌తో ‘బీవీ నంబర్ 1’గా తీస్తే అక్కడా హిట్ అయ్యింది. ఈ మధ్య దీనినే ఇవివి ‘కితకితలు’గా తీశారు. భర్త ప్రాణాల కోసం పోరాడిన పతివ్రతలు మనకు తెలుసు. కాని భర్తను భర్తగా దక్కించుకోవడానికి భార్య చేసే పోరాటమే ఈ సినిమా. దీనిని లైటర్ వెయిన్‌లో చెప్పడం వల్ల ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు.
కమల్‌హాసన్ డాక్టర్‌గా శ్రీకాకుళం భాష మాట్లాడే స్నేహితుడిగా కనిపిస్తాడు. ఇతడి భార్యగా కోవై సరళ ఆశ్చర్యపరుస్తుంది. కమలహాసన్‌కు బాలూ డబ్బింగ్ చెప్పడం ఆనవాయితే అయినా నాగూర్ బాబూ అంతే బాగా చెప్పడం విశేషం. ఎయిర్‌పోర్ట్‌లో కమలహాసన్ రమేశ్ అరవింద్‌ను ఇబ్బంది పెట్టడం, హోటల్లో రమేశ్ అరవింద్ హీరాతో ఉండగా అతడి నడుము పట్టేయడం, క్లయిమాక్స్‌లో కోవై సరళ కమలహాసన్‌ను అపార్థం చేసుకోవడం ఇవన్నీ బాగా నవ్వు తెప్పిస్తాయి. నటి ఊర్వశి సోదరి అయిన కల్పన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటుంది. ఆమె ‘ఊపిరి’ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే మృతి చెందడం ప్రేక్షకులకు గుర్తు.
– కె.
బాలూ మహేంద్ర, కల్పన