అమ్మాయిలు స్కార్ఫ్ కడితే ఇక జైలుకే!
సత్నా: అమ్మాయిలు స్కార్ఫ్ కట్టుకుని కనిపించారా ...ఇక వాళ్లు జైలుకి వెళ్లాల్సిందే. అదేంటి స్కార్ఫ్ కడితే జైలుకి పంపిస్తారా అని ఆశ్చర్యపోతున్నారా? మధ్యప్రదేశ్‌లోని సత్నాలో అయితే అంతేమరి. అమ్మాయిలు స్కార్ఫ్ కట్టుకుని బయట కనపడితే పోలీసులకు అప్పగిస్తామంటూ సాత్నా మేయర్ మమతా పాండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటి ఆగకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లే అమ్మాయిలెవరైనా ముఖంపై ముసుగుతో కనపడితే సత్నా మున్సిపల్ కార్పొరేషన్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం.
'హిందు సంప్రదాయం ప్రకారం మహిళలు తలపై కొంగు, ముస్లిం సంప్రదాయమైతే బురఖా ధరించడం, ఇతర మతాలకు చెందిన స్త్రీలు తమ తల భాగాన్ని ఏదైనా బట్టతో కప్పుకోవడం లాంటివి చేస్తారు. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి కనిపించడం లేదని, సంప్రదాయాలను అమ్మాయిలు మరిచి దొంగల తరహాలో ముఖాన్ని ముసుగుతో కప్పి ఉంచుతున్నారంటూ మేయర్ ... మీడియా సమావేశంలో వివాదాలకు తావిచ్చే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఇంకా కొన్ని ఆశ్చర్యకర వ్యాఖ్యలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నానంటూ మీడియాతో మాట్లాడారు. ముసుగు ధరించి నేరాలకు పాల్పడే అవకాశాలున్నాయని, ఇటువంటి చర్యలను అరికట్టాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందంటూ చెప్పుకొచ్చారు. మహిళలెవరైనా ఎండ నుంచి ఉపశమనం పొందాలని భావిస్తే అటువంటి వారు గొడుగు వెంట తీసుకెళ్లాలని, లేదంటే చిన్న బట్టతో ముఖాన్ని కప్పేలా చూసుకోవాలని సూచించారు. కానీ మహిళ ఎవరన్నది గుర్తించేలా మాత్రమే ప్రత్యామ్నాయం చూసుకోవాలని, సూర్యాస్తమయం తరువాత ముఖాన్ని కప్పిఉంచరాదంటూ మేయర్ ఆజ్ఞలు జారీచేశారు.
కాగా మేయర్ వ్యాఖ్యలపై ఆగ్రహంతో పాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జబల్పూర్ హైకోర్టు సీనియర్ లాయర్ మట్లాడుతూ... స్కార్ఫ్ ఉపయోగించడంపై ఆదేశాలు జారీ చేయడానికి మేయర్‌కు ఎటువంటి హక్కులు లేవని అన్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం కేవలం పోలీసులకు మాత్రమే ముసుగు లేదా స్కార్ఫ్ ధరించిన వారి విషయంలో కలుగజేసుకోవడానికి, ఏదైనా చర్య తీసుకోవడానికి అధికారం ఉందని లాయర్ తెలిపారు.