satthupalli
-
కాంగ్రెస్‌లో డిష్యూం.. డిష్యూం
ఖమ్మం సహకారనగర్: జిల్లా కాంగ్రెస్‌లో రోజు రోజుకు గ్రూపు తగాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈనెల 17న హైదరాబాద్‌లో జరగనున్న విజయ భేరి సభను జయప్రదం చేసేందుకు ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఖమ్మం, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ మహ్మద్ ఆరిఫ్ నసీంఖాన్, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి తదితరులు పాల్గొనగా, ఖమ్మం టికెట్ బీసీలకు కేటాయించాలని పుచ్చకాయల వీరభద్రం కోరారు. వైరా నియోజకవర్గాల నాయకులు కష్టపడే వారికి గుర్తింపునివ్వాలని విన్నవించారు. అనంతరం సత్తుపల్లి టికెట్ ఆశిస్తున్న మానవతారాయ్, మట్టా దయా నంద్ వర్గీయులు నినాదాలు చేస్తూ కుర్చీలు విసురు కున్నారు. ఇందులో ఒకరిద్ద రికి గాయాలయ్యాయి. బీసీ కేటగిరీకి చెందిన మట్టా దయానంద్‌కు ఎస్సీ రిజర్వ్ స్థానంలో టికెట్ కేటాయించొద్దని మానవ తారాయ్ అనుచరులు అడ్డు చెప్పగా, వివాదం పెరిగి దాడుల దాకా వెళ్లింది. ఎంత సర్దిచెప్పినా వినకపోవడంతో రేణుకా చౌదరి బయటకు వెళ్లారు. ఆతర్వాత టికెట్ తమకే ఇవ్వాలని మానవతా రాయ్, వక్కలగడ్డ సోమచంద్రశేఖర్, డాక్టర్ మట్టా రాగమయి తదితరులు కోరారు. -
సీఎం సారూ.. సత్తుపల్లికి ఒక్కసారి రండి..
సాక్షి, సత్తుపల్లి : సత్తుపల్లి నియోజకవర్గంలో పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో నిర్మించిన వైకుంఠధామం ఫొటోలను అసెంబ్లీలో శుక్రవారం సీఎం కేసీఆర్ చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సర్పంచ్ దొడ్డపునేని శ్రీదేవి బ్రహ్మాండంగా వైకుంఠధామాన్ని పార్కులా.. దేవాలయంలా కట్టారు. సండ్ర వెంకటవీరయ్య చెప్పింది చాలా కరెక్ట్.. సత్తుపల్లి నియోజకవర్గంలో చాలా చాలా నిర్మించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సర్పంచ్ దొడ్డపునేని శ్రీదేవి, గ్రామ ప్రజలు, అధికారులకు అభినందనలు’అని పేర్కొన్నారు. ఈ ఫొటోలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి పంపించారు. చాలా సంతోషం వేసిందని కితాబిచ్చారు. పల్లెప్రగతి సంతృప్తినిచ్చింది.. పల్లెప్రగతి కార్యక్రమం తన 16 ఏళ్ల రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అసెంబ్లీలో తెలిపారు. మనిషి చనిపోతే తీసుకెళ్లాలంటే కొట్లాటలు జరిగిన ఘటనలు చూశానని, ఎన్నికలు వస్తే ముందు శ్మశాన వాటికలకు స్థలం కేటాయిస్తేనే ఓటు వేస్తామని చెప్పేవాళ్లు ఉండేదని, వీటన్నింటికి పరిష్కారం పల్లెప్రగతి చూపించిందని పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 143 గ్రామపంచాయతీలు ఉంటే అన్నింట్లో ట్రాక్టర్లు కొనడమే కాకుండా.. వైకుంఠధామాల నిర్మాణాలు కూడా 143 పంచాయతీల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలసి వేలాది మంది సమక్షంలో ప్రారంభించి.. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శ్మశానవాటికలు అందంగా ఉండాలని దాతల సాయంతో ఒక శివుడి విగ్రహాన్ని నిర్మించామని, మనిషి పుట్టుక ఎంతగొప్పదో.. చనిపోయిన తర్వాత అంతే పవిత్రంగా ఆ కుటుంబ సభ్యులకు ఆత్మశాంతి కలిగే విధంగా వాటిని నిర్మించామన్నారు. సత్తుపల్లి మండలం కొత్తూరు పంచాయతీ జిల్లాలోనే బెస్ట్ పంచాయతీగా కలెక్టర్ ఎంపిక చేశారని, ఆ పంచాయతీలో పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారని.. ప్లాస్టిక్ గ్లాస్, ప్లాస్టిక్ బ్యాగ్ వాడినా మహిళా సర్పంచ్ ఫైన్ వేస్తారని వెల్లడించారు. అన్ని ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారని, సత్తుపల్లి నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ పర్యటనకు రావాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆహ్వానించారు. -
కష్టాలకు కరిగిపోతా.. : ఎమ్మెల్యే సండ్ర
‘నాకు పాలేరు నియోజకవర్గం రాజకీయ జన్మనిస్తే.. సత్తుపల్లి రాజకీయంగా పునర్జన్మనిచ్చింది. బాల్య దశ నుంచే విద్యార్థి, యువజన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించా. ప్రజలతో నా అనుబంధం పెనవేసుకోవడంతో సామాన్యుల కష్టాలు, పేదల కన్నీళ్లు, మధ్యతరగతి ప్రజల అవసరాలు మరొకరు చెప్పకుండానే అర్థం చేసుకునే అవకాశం లభించింది. బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలనే లక్ష్యంతో రాజకీయ ప్రస్థానం కొనసాగుతోంది. జనం మధ్య.. ప్రజల కోసం పరితపించడం అంటే నాకు అత్యంత ఇష్టం. కమ్యూనిస్టు భావాలతో పెరిగిన నేను పేదల కష్టానికి ఇట్టే కరిగిపోతా.. హేతుబద్ధంగా ఆలోచించడానికి ఇష్టపడతా.. అంటున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో ఈ వారం పర్సనల్ టైమ్. మాది సాధారణ రైతు కుటుంబం. నాన్న పేరు భిక్షం, అమ్మ లక్ష్మమ్మ. ఉన్నదాంట్లో సర్దుకోవడం, ఎవరికైనా ఆపద వస్తే నేనున్నాననే ఆత్మస్థైర్యం కల్పించడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది. చిన్న వయసులోనే అమ్మను కోల్పోయినా.. మాతృప్రేమను రుచి చూపించింది మాత్రం కమల సరోజిని, ఒండ్రు దేవదానం దంపతులే. 4వ తరగతి నుంచి వారే పెంచి పెద్ద చేశారు. కూసుమంచి ప్రభుత్వ పాఠశాలలో వారు పనిచేస్తున్న సమయంలో ఏర్పడిన పరిచయం ఇప్పటికీ ఆత్మీయత, అనురాగాల మధ్య కొనసాగుతోంది. వాళ్లని దేవుడిచ్చిన తల్లిదండ్రులుగానే భావిస్తా. ఏ హోదాలో ఉన్నా.. ఏ పనిచేసినా క్రమశిక్షణాయుతంగా చేయడం నాకు చిన్నప్పటి నుంచి అబ్బిన అలవాటు. దీనికి కారణం అతి చిన్న వయసులో ఎస్ఎఫ్ఐ కార్యకర్తగా పనిచేయడంతో క్రమశిక్షణ అలవడింది. విద్యార్థి సంఘం నాకు వ్యక్తిగత క్రమశిక్షణను నేర్పితే.. డీవైఎఫ్ఐ యువజన విభాగం నా రాజకీయ ఎదుగుదలకు కారణమైంది. రాజకీయంగా ఏ హోదాలో పనిచేసినా ప్రజల మధ్య.. ప్రజల కోసం పనిచేసే లక్ష్యం సీపీఎం నుంచే లభించింది. సీపీఎంలో అనేక మంది నాకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంది నా రాజకీయ ఎదుగుదలలో అత్యంత కీలక పాత్ర. అలాగే సీపీఎం మాజీ శాసనసభా పక్ష నాయకుడు బోడేపూడి వెంకటేశ్వరరావు, ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు యోధులు మంచికంటి రామకిషన్రావు, కేఎల్.నరసింహారావు, పిల్లుట్ల వెంకన్న నాకు స్ఫూర్తిప్రదాతలు. ‘తుమ్మల’ది అత్యంత కీలక పాత్ర.. రాజకీయంగా సీపీఎం నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీలో చేరిన నన్ను అక్కున చేర్చుకుని.. రాజకీయంగా అండదండలు అందించి.. నా రాజకీయ ప్రస్థానం కొనసాగడంలో అత్యంత కీలక పాత్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుది. తుమ్మల ధైర్యం కల్పించడంతో సత్తుపల్లిలో 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించా. అప్పటి నుంచి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలే నా సర్వస్వం. రాజకీయ నేతల పట్ల ప్రజలకున్న అభిప్రాయాన్ని తప్పు పట్టలేం కానీ.. ప్రతి నాయకుడిని ఒకే గాటన కట్టి చూడడం మాత్రం ఒక్కోసారి బాధేస్తుంది. నా రాజకీయ జీవితంలో డబ్బు పాత్ర చాలా పరిమితం. డబ్బులతో రాజకీయం చేసే పరిస్థితి, అవసరం నాకు రాకపోవడం ఇప్పటికీ అదృష్టంగా భావిస్తా. ఇందుకు కారణం కమ్యూనిస్టు పార్టీల్లో పెద్దల అండదండలు ఉండడం, ప్రజల కష్టాలు తెలిసిన మనిషిగా పేరుండడంతో నా రాజకీయ జీవితాన్ని ప్రజలే లిఖించే అవకాశం లభించింది. ఆడంబరాలు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు. ఇప్పటికీ హైదరాబాద్‌లో ఒకరోజు పని ఉంటే ఆర్టీసీ బస్సులోనే వెళ్లి.. పని చూసుకుని మళ్లీ తిరిగి వచ్చే అలవాటు. సెక్రటేరియట్‌కు, అసెంబ్లీకి ఆటోలో వెళ్లడానికే ఇష్టపడతా. ఇక స్నేహానికి ప్రాణం ఇవ్వడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా స్నేహితుల ఇంట్లో పెళ్లి అయినా.. శుభకార్యమైనా వాళ్ల కుటుంబాల్లో కష్టమైనా.. ఆపదైనా నేనుండి తీరాల్సిందే. వారితో పెనవేసుకున్న అనుబంధం అలాంటిది. నాయకుడిగా నా పరిమితులు, నా పరిస్థితులపై అవగాహన ఉన్న స్నేహితుల మధ్య గడుపుతుండడం ఒకింత గర్వంగా ఉంటుంది. కూసుమంచిలో నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు నా స్నేహితుడు రమణ క్లాస్ లీడర్‌గా ఎన్నికైతే ఆయనను అభినందించడం కోసం కూసుమంచి చెరువులో తామరపూలు కోయడానికి స్నేహితుల బృందంతో వెళ్లాం. చెరువులోకి దిగడం ఎంత సులభమో.. రావడానికి మాత్రం తలప్రాణం తోకకొచ్చింది. కాళ్లకు తామర దారాలు అడ్డం పడి కదిలే పరిస్థితి లేకపోవడంతో నాతోపాటు చెరువులోకి దిగిన స్నేహితులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్నాం. చాలా సేపటి తర్వాత బయటకు రాగలిగాం. ఎట్టకేలకు తామరపూలు తెచ్చి రమణను అభినందించాం. ఇక నాకు ఆర్థికంగా ఏ అవసరం వచ్చినా స్నేహితులపై ఆధారపడే అలవాటు ఈ నాటిది కాదు. విద్యార్థి నాయకుడిగా.. యువజన నాయకుడిగా.. సీపీఎం, టీడీపీ. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా.. నాకు కష్టం వస్తే స్నేహితులకు చెప్పుకోవడం.. వారి ఆర్థిక చేయూతతో సంక్లిష్ట ఎన్నికలను సైతం సునాయాసంగా గట్టెక్కడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు స్నేహితులుగా వారు నాకిచ్చే గౌరవం, నా ఎదుగుదలకు వారిచ్చే ప్రాధాన్యం కారణమని అనిపిస్తుంది. వారి అండదండలే.. సత్తుపల్లి ప్రజల అభిమానం.. అండదండలే నన్ను నడిపిస్తున్నాయి. పాలేరు, సత్తుపల్లి రెండు నియోజకవర్గాలు నాకు రెండు కళ్లు. అందుకే ఇరు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే ఖమ్మంను నివాస కేంద్రంగా చేసుకున్నా.. అంతకుమించి మరో ఆలోచన లేదు. ఇక అత్యంత చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికైన గుర్తింపు సైతం నాకే లభించింది. 1994లో ఎమ్మెల్యేగా పాలేరు నుంచి సీపీఎం తరఫున గెలిచే నాటికి నా వయసు కేవలం 26 ఏళ్లు. ఇక నా కుటుంబ వ్యవహారాలన్నీ మా ఆవిడ మహాలక్ష్మి చూసుకునేది. ఆవిడకు భూదేవికి ఉన్నంత ఓర్పు.. సహనం ఎక్కువ. నా కోపాన్ని భరించడం ఆమెకు మాత్రమే సాధ్యమైంది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కస్సుబుస్సులు సహజమే అయినా.. అవి నలుగురి మధ్య కాక నాలుగు గోడల మధ్య ప్రదర్శించినా.. అర్థం చేసుకునే అర్థాంగి దొరకడం నా అదృష్టం. ఇక తాతయ్య నాన్నకు ఐదెకరాల పొలం అప్పగిస్తే.. నాన్న అదే ఐదెకరాలు నాకు అప్పజెప్పారు. దానిని కాపాడుకుంటే నేను గొప్పవాడినేనని నాన్న ఎప్పుడూ అంటుండేవారు. ఇప్పటికీ నాన్న మాట మాత్రం నిలబెట్టా. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడుతూనే ప్రజల కోసం ఉద్యమం చేసిన నేతగా పలు కేసులు ఎదుర్కొంటూ న్యాయస్థానాలకు హాజరయ్యేవాడిని. ప్రజల కోసం కోర్టు ముందు ఉన్నాననే భావన ఎంతో సంతృప్తినిచ్చేది. ఇక డీవైఎఫ్ఐ ఖమ్మం డివిజన్ అధ్యక్షుడిగా నిర్వహించిన కబడ్డీ చాంపియన్ టోర్నీ నా రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. అత్యంత పకడ్బందీగా యువకులకు మనో ఉల్లాసం కలిగించే విధంగా నిర్వహించిన కబడ్డీ పోటీలకు ఆలిండియా కబడ్డీ కెప్టెన్ హర్దీప్సింగ్ను, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి, ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యంను బహుమతి ప్రదానోత్సవానికి పిలిచాం. కమ్యూనిస్టు ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించడం, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడంతో క్రమశిక్షణాయుత జీవితం అలవడటమేకాదు ఏ ఒక్క చెడు అలవాటు కాలేదు. నా ప్రాణ స్నేహితుడు లీలామోహన్ ఆకస్మిక మరణం నాతోపాటు స్నేహితులందరినీ కొద్దినెలలపాటు కోలుకోలేకుండా చేసింది. ఆయన కుటుంబానికి అండగా ఉండాలనే నా ప్రతిపాదన మిగితా స్నేహితులు, అప్పటి కాంట్రాక్టర్లు కొందరు అంగీకరించడంతో ఇద్దరు ఆడపిల్లల తండ్రి అయిన లీలామోహన్ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం 1999లో ఆయన మరణించిన కొద్ది రోజులకే ఇద్దరు పిల్లల పేరుపై చెరి రూ.4లక్షల చొప్పున డిపాజిట్ చేశాం. ఆయన సతీమణికి గుంటూరు విద్యాశాఖలో ఉద్యోగం ఇప్పించాం. ఆయన ఇద్దరు పిల్లలకు ఏ కష్టం వచ్చినా తామే ఉన్నామనే భరోసా కల్పించాం. వారి పెళ్లిళ్లు అయ్యే సమయానికి చెరొక రూ.24లక్షలు అప్పుడు డిపాజిట్ చేసిన ఫిక్స్డ్ నగదు ఇవ్వగలిగాం. మోహన్‌ను తేలేకపోయినా.. వారి కుటుంబానికి స్నేహితులున్నారనే మనోధైర్యం కల్పించాం. ఇక నాకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు భార్గవ్, రెండోవాడు తేజ. ఇప్పటికే ఉన్నత చదువులు పూర్తి చేసుకున్నారు. పారిశ్రామిక రంగంలో అడుగిడాలన్నది వారి సంకల్పం. -
కో’ఢీ’
సంక్రాంతి వస్తోంది.. ఆంధ్రా సరిహద్దులో బిర్రులు సిద్ధమవుతున్నాయి. కొక్కొరొకో అని కోడిపుంజు కత్తులు దూస్తోంది. కుక్కుటశాస్త్రాన్ని కూలంకషంగా చదివి నక్షత్రం, తిథులు, దిక్కుల ఆధారంగా.. సమయానుకూలంగా కోడిపుంజును బరిలోకి దింపేందుకు జూదరులు సిద్ధమయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పందెం పుంజును చంటిపిల్లాడి మాదిరి చంకలో ఎత్తుకొని ఆంధ్రాబాట పట్టారు. భోగి నుంచి మూడురోజులు పందేలు ‘పుంజు’కోనున్నాయి. మెడ తిప్పి, కాలుదువ్వి, రెక్కలు విప్పుకొని కొక్కొరొకో అంటూ ఎగిరెగిరి పొడుచుకొనే పోరాటమే ఇక తరువాయి... మరి సుప్రీం తీర్పు ఎలా ఉంటుందో...! సత్తుపల్లి : సంక్రాంతి పండుగకు నిర్వహించే మూడురోజుల కోడిపందేల కోసం రెండు నెలల ముందు నుంచే జిల్లాలోని ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో కసరత్తు జరుగుతోంది. సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల్లోని పందెంరాయుళ్లు కోడిపుంజులను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. జంతు హింస పేరుతో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించినా పందెంరాయుళ్లు మాత్రం తమ పుంజులకు కత్తి కట్టే పనిలో ఉన్నారు. తమ పుంజులను సోమవారం నుంచి బిర్రు(కోడిపందేలు నిర్వహించే ప్రదేశం) లోకి దించేందుకు సిద్ధమయ్యారు. చిన్నపిల్లలను ఎంత అల్లారుముద్దుగా పెంచుకుంటామో అంతకంటే ఎక్కువగా చూసుకునే కోడిపుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఏడాదిన్నర వయస్సు ఉన్న కోడి పుంజును ఎంచుకొని ప్రత్యేకమైన బుట్టలో ఉంచి పండగకు వచ్చే కొత్త పెళ్లికొడుక్కి చేసే మర్యాదులు చేస్తారు. కోడిపెట్టలతో తిరగనీయకుండా బ్రహ్మచర్యం పాటించేలా చేసి శక్తి పుంజుకునేలా నానాతంటాలు పడతారు. కుక్కుట శాస్త్రం ఆధారంగా నక్షత్రం, తిథులు చూసుకొని మరీ పందెం పుంజులను చంకనబెట్టుకొని ఆంధ్రా బాట పట్టారు. అంతా నక్షత్రం ప్రకారమే.. కుక్కుటశాస్త్రం ప్రకారం ఏ సమయంలో ఏ పుంజు వేస్తే గెలుస్తుందో.. లెక్కలు వేసుకొని మరీ పందెం కాస్తారు. చాలా మంది పేరులోని అక్షరాలు, తిథుల ఆధారంగా ఆయా సమయాల్లో పలానా కోళ్లు గెలుస్తాయని చెపుతుంటారు. కోడి పందేలు జరిగే ప్రదేశం.. కోళ్ల యజమానులు ఉండే ప్రదేశం.. పందెం రోజు నక్షత్రం.. శుక్లపక్షంలో నెగ్గె కోళ్లను బట్టి పందేలు వేస్తారంటే ఆశ్చర్యం కలగక మానదు. కోళ్ల పందెం ఏ దిశగా జరుగుతుందో పుంజు యజమాని తన కోడిపుంజును ఆ దిక్కుకు తీసుకెళ్లే విషయంపైనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయని పందెం రాయుళ్ల నమ్మకం. పందెం కట్టేవారి పేరులోని మొదటి అక్షరం ఆధారంగా ఫలితం ఉంటుందని కుక్కటశాస్త్రం ప్రకారం అంచనాలు వేసుకుంటారు. పందెం ప్రదేశంలో కుక్కటశాస్త్రం పుస్తకాలు తీసుకొని దిక్కులు, సమయాన్ని ఎంపిక చేసుకునే పనిలో నిమగ్నమౌతారు. అందరి దారి ఆంధ్రావైవే.. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆంధ్రాలో కోడిపందేలు నిర్వహించటం ఆనవాయితీ. పండుగ మూడురోజులు పందెం కోళ్లతో సందడి కనిపిస్తుంది. అక్కడక్కడా చిన్నచిన్న పందేలు (కూర పందేలు) స్థానికంగా నిర్వహిస్తూనే ఉన్నారు. పెద్ద పందేలకు పోలీసులు అనుమతించక పోవటంతో పందెంరాయుళ్లంతా ఆంధ్రాకు తరలివెళ్తున్నారు. గతేడాది సత్తుపల్లికి చెందిన కొందరు పశ్చిమగోదావరి జిల్లా పోతునూరులో బిర్రు అనుమతి తీసుకొని నిర్వహించినట్లు తెలిసింది. ఈ ఏడాది శీతానగరంలో వేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. పండుగ మూడురోజులు కోడి పందేలు కాసేందుకు.. చూసేందుకు.. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్‌ల నుంచి పెద్ద ఎత్తున సత్తుపల్లి మీదుగా వెళ్తారు. కోడిపందేలకు పశ్చిమగోదావరి జిల్లాలో శీతానగరం, చింతంపల్లి, పోతునూరు, ధర్మాజిగూడెం, కళ్ల చెరువు, వెంకటాపురం, భీమవరం, పంచాలకుంట, ప్రగడవరం, గోకారం ప్రసిద్ధి. మూడురోజులు బిజీబిజీ భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడురోజులు సత్తుపల్లి పరిసర ప్రాంతంలో కోడిపందేల సందడి నెలకొననుంది. చంకలో కోడిపుంజు పెట్టుకొని వాహనాలపై పందేనికి వెళ్లేవారు వందలసంఖ్యలో కనిపిస్తుంటారు. కోడిపందేలను నిలువరించటం పోలీసులకు పెద్దసవాలుగా మారనుంది. ఈ ఏడాది కోడిపందేలపై పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బైండోవర్ కేసులు నమోదు చేశారు. అయినా పందెంరాయుళ్లను అడ్డుకోవటం సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. 14, 15, 16 కోడి పందేలకు అనుమతి ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. తెలంగాణ డబ్బులు ఆంధ్రాకు వెళ్ళుతున్నాయనేది పందెంరాయుళ్ల వాదన. కోట్ల రూపాయల్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం కోడి పందేలపై కన్నెర్ర చేయటం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు. సంస్కృతి పేరుతో పందేలు నిర్వహించి కోడిపుంజులను హింసిస్తున్నారని జంతు ప్రేమికుల వాదన. కోడిపందేలలో సరదాకుపోయి ఏడాది మొత్తం సంపాదించుకున్న సొమ్ములను పోగొట్టుకుంటున్న అభ్యాగులు ఎందరో ఉన్నారని.. కోడి పందేలు నిర్వహించటానికి వీలు లేదంటూ మానవ హక్కుల సంఘాలూ వాదిస్తున్నాయి. కోడిపందేల నిర్వహణపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పందెం పుంజుల పెంపకంలో ప్రత్యేక జాగ్రత్తలు సాధారణ కోళ్ల పెంపకానికి..పందెంకోళ్ల పెంపకానికి చాలా వ్యత్యాసం ఉంది. అసలు ఇవి చూడటానికే ప్రత్యేకంగా కనిపిస్తాయి. మిగిలిన కోళ్లతో వీటిని కలవనీయరు. పందెం కోళ్ల పెంపకం తపస్సులా చేస్తారు. కన్నబిడ్డలకన్నా ప్రేమగా పుంజులను పెంచేవాళ్లూ ఉన్నారు. సాధారణ కోడిపుంజులకన్నా పందెం పుంజులు ఎత్తుగా, దృఢంగా ఉంటాయి. రంగురంగుల ఈకలతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ముక్కు దృఢంగా, పొడవుగా, కాలివేళ్లు నిటారుగా కనిపిస్తాయి. వీటి కూత గంభీరంగా ఉంటుంది. కొన్ని పుంజుల దగ్గరకు వెళ్లడానికి మనుషులు కూడా జంకుతారు. పందెం కోళ్లు సుమారు 50రకాలు ఉన్నాయి. కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, పర్ల, సేతువు, పూల, పింగళి, కౌజు, నల్లమచ్చల సేతువు, ఎర్రబోరా, నల్లబోరా, పింగళి, మైల, కొక్కిరాయి, నల్ల సవల ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉన్నాయి. ప్రాంతాలను బట్టి పేర్లు మారుతుంటాయి. వీటిలో కాకి, డేగ, నెమలి పందేలకు పెట్టింది పేరు. వీటి ధరలు రూ.5వేల నుంచి లక్షల రూపాయల వరకు ఉంటాయంటే అతిశయోక్తికాదు. పూర్వ కాలంలో కోడిపందేల కోసం యుద్ధాలు జరిగినట్లు చరిత్ర చెపుతోంది. కోడిపందేల ప్రస్తావన లేకుండా పల్నాటిచరిత్ర, బొబ్బిలియుద్ధాల గురించి ప్రస్తావించలేము. వీటి ఆహారమూ స్పెషలే.. పందెం కోళ్లకు ఇచ్చే ఆహారం కూడా ప్రత్యేకమైనదే. వీటికి సోళ్లు, సజ్జలు, మటన్ కైమా, పచ్చసొన తీసివేసిన కోడిగుడ్లు, రెవిటాల్ టాబ్లేట్లు, 18 రకాల దినుసుల లేహ్యం తినిపిస్తారు. పందెం కోడి ఇవి తిని కొవ్వు పట్టకుండా కట్టేసి ఒకేచోట నిలబెట్టడం వలన కాళ్లల్లో శక్తి దెబ్బతింటుందని నెట్ కట్టి పుంజును అటూ.. ఇటూ తిప్పుతారు. ఒక విధంగా పుంజుకు వాకింగ్ చేయిస్తారు. కొవ్వు పట్టకుండా వేడి నీళ్లపోత (వేడి నీళ్లల్లో వేప, జామ, వెదురు ఆకులు, పసుపులను కలిపి మరగపెట్టి బాలింతకు నీళ్లు పోసినట్లు) తడిసిన గుడ్డ కొడి చుట్టూ తిప్పి గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయిస్తారు. ఇలా రెండు నెలల పాటు కోళ్లను ఒక తపస్సులా పెంచుతారు. పందేనికి వారం రోజుల ముందు తేలికపాటి ఆహారం ఇస్తారు. నానబెట్టిన సోళ్లు, మెరిగలు, తవుడు, వెన్నకలిపిన మేత అందిస్తారు. చలిని తట్టుకునేందుకు బుట్ట చుట్టూ పరదాలుకట్టుతారు. పుంజు కొద్దిగా నీరసించినట్లు కనిపించినా..మెడను కదపలేక మేతను తినలేకపోయినా..తక్షణమే వైద్యం చేయిస్తారు. శుభ్రమైన నీటిని మట్టిపాత్రలోనే అందిస్తారు.