సంక్రాంతి వస్తోంది.. ఆంధ్రా సరిహద్దులో బిర్రులు సిద్ధమవుతున్నాయి. కొక్కొరొకో అని కోడిపుంజు కత్తులు దూస్తోంది. కుక్కుటశాస్త్రాన్ని కూలంకషంగా చదివి నక్షత్రం, తిథులు, దిక్కుల ఆధారంగా.. సమయానుకూలంగా కోడిపుంజును బరిలోకి దింపేందుకు జూదరులు సిద్ధమయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పందెం పుంజును చంటిపిల్లాడి మాదిరి చంకలో ఎత్తుకొని ఆంధ్రాబాట పట్టారు. భోగి నుంచి మూడురోజులు పందేలు ‘పుంజు’కోనున్నాయి. మెడ తిప్పి, కాలుదువ్వి, రెక్కలు విప్పుకొని కొక్కొరొకో అంటూ ఎగిరెగిరి పొడుచుకొనే పోరాటమే ఇక తరువాయి... మరి సుప్రీం తీర్పు ఎలా ఉంటుందో...!
సత్తుపల్లి : సంక్రాంతి పండుగకు నిర్వహించే మూడురోజుల కోడిపందేల కోసం రెండు నెలల ముందు నుంచే జిల్లాలోని ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో కసరత్తు జరుగుతోంది. సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల్లోని పందెంరాయుళ్లు కోడిపుంజులను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. జంతు హింస పేరుతో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించినా పందెంరాయుళ్లు మాత్రం తమ పుంజులకు కత్తి కట్టే పనిలో ఉన్నారు. తమ పుంజులను సోమవారం నుంచి బిర్రు(కోడిపందేలు నిర్వహించే ప్రదేశం) లోకి దించేందుకు సిద్ధమయ్యారు. చిన్నపిల్లలను ఎంత అల్లారుముద్దుగా పెంచుకుంటామో అంతకంటే ఎక్కువగా చూసుకునే కోడిపుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఏడాదిన్నర వయస్సు ఉన్న కోడి పుంజును ఎంచుకొని ప్రత్యేకమైన బుట్టలో ఉంచి పండగకు వచ్చే కొత్త పెళ్లికొడుక్కి చేసే మర్యాదులు చేస్తారు. కోడిపెట్టలతో తిరగనీయకుండా బ్రహ్మచర్యం పాటించేలా చేసి శక్తి పుంజుకునేలా నానాతంటాలు పడతారు. కుక్కుట శాస్త్రం ఆధారంగా నక్షత్రం, తిథులు చూసుకొని మరీ పందెం పుంజులను చంకనబెట్టుకొని ఆంధ్రా బాట పట్టారు.
అంతా నక్షత్రం ప్రకారమే..
కుక్కుటశాస్త్రం ప్రకారం ఏ సమయంలో ఏ పుంజు వేస్తే గెలుస్తుందో.. లెక్కలు వేసుకొని మరీ పందెం కాస్తారు. చాలా మంది పేరులోని అక్షరాలు, తిథుల ఆధారంగా ఆయా సమయాల్లో పలానా కోళ్లు గెలుస్తాయని చెపుతుంటారు. కోడి పందేలు జరిగే ప్రదేశం.. కోళ్ల యజమానులు ఉండే ప్రదేశం.. పందెం రోజు నక్షత్రం.. శుక్లపక్షంలో నెగ్గె కోళ్లను బట్టి పందేలు వేస్తారంటే ఆశ్చర్యం కలగక మానదు. కోళ్ల పందెం ఏ దిశగా జరుగుతుందో పుంజు యజమాని తన కోడిపుంజును ఆ దిక్కుకు తీసుకెళ్లే విషయంపైనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయని పందెం రాయుళ్ల నమ్మకం. పందెం కట్టేవారి పేరులోని మొదటి అక్షరం ఆధారంగా ఫలితం ఉంటుందని కుక్కటశాస్త్రం ప్రకారం అంచనాలు వేసుకుంటారు. పందెం ప్రదేశంలో కుక్కటశాస్త్రం పుస్తకాలు తీసుకొని దిక్కులు, సమయాన్ని ఎంపిక చేసుకునే పనిలో నిమగ్నమౌతారు.
అందరి దారి ఆంధ్రావైవే..
సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆంధ్రాలో కోడిపందేలు నిర్వహించటం ఆనవాయితీ. పండుగ మూడురోజులు పందెం కోళ్లతో సందడి కనిపిస్తుంది. అక్కడక్కడా చిన్నచిన్న పందేలు (కూర పందేలు) స్థానికంగా నిర్వహిస్తూనే ఉన్నారు. పెద్ద పందేలకు పోలీసులు అనుమతించక పోవటంతో పందెంరాయుళ్లంతా ఆంధ్రాకు తరలివెళ్తున్నారు. గతేడాది సత్తుపల్లికి చెందిన కొందరు పశ్చిమగోదావరి జిల్లా పోతునూరులో బిర్రు అనుమతి తీసుకొని నిర్వహించినట్లు తెలిసింది. ఈ ఏడాది శీతానగరంలో వేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. పండుగ మూడురోజులు కోడి పందేలు కాసేందుకు.. చూసేందుకు.. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్‌ల నుంచి పెద్ద ఎత్తున సత్తుపల్లి మీదుగా వెళ్తారు. కోడిపందేలకు పశ్చిమగోదావరి జిల్లాలో శీతానగరం, చింతంపల్లి, పోతునూరు, ధర్మాజిగూడెం, కళ్ల చెరువు, వెంకటాపురం, భీమవరం, పంచాలకుంట, ప్రగడవరం, గోకారం ప్రసిద్ధి.
మూడురోజులు బిజీబిజీ
భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడురోజులు సత్తుపల్లి పరిసర ప్రాంతంలో కోడిపందేల సందడి నెలకొననుంది. చంకలో కోడిపుంజు పెట్టుకొని వాహనాలపై పందేనికి వెళ్లేవారు వందలసంఖ్యలో కనిపిస్తుంటారు. కోడిపందేలను నిలువరించటం పోలీసులకు పెద్దసవాలుగా మారనుంది. ఈ ఏడాది కోడిపందేలపై పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బైండోవర్ కేసులు నమోదు చేశారు. అయినా పందెంరాయుళ్లను అడ్డుకోవటం సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. 14, 15, 16 కోడి పందేలకు అనుమతి ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. తెలంగాణ డబ్బులు ఆంధ్రాకు వెళ్ళుతున్నాయనేది పందెంరాయుళ్ల వాదన. కోట్ల రూపాయల్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం కోడి పందేలపై కన్నెర్ర చేయటం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు. సంస్కృతి పేరుతో పందేలు నిర్వహించి కోడిపుంజులను హింసిస్తున్నారని జంతు ప్రేమికుల వాదన. కోడిపందేలలో సరదాకుపోయి ఏడాది మొత్తం సంపాదించుకున్న సొమ్ములను పోగొట్టుకుంటున్న అభ్యాగులు ఎందరో ఉన్నారని.. కోడి పందేలు నిర్వహించటానికి వీలు లేదంటూ మానవ హక్కుల సంఘాలూ వాదిస్తున్నాయి. కోడిపందేల నిర్వహణపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
పందెం పుంజుల పెంపకంలో ప్రత్యేక జాగ్రత్తలు
సాధారణ కోళ్ల పెంపకానికి..పందెంకోళ్ల పెంపకానికి చాలా వ్యత్యాసం ఉంది. అసలు ఇవి చూడటానికే ప్రత్యేకంగా కనిపిస్తాయి. మిగిలిన కోళ్లతో వీటిని కలవనీయరు. పందెం కోళ్ల పెంపకం తపస్సులా చేస్తారు. కన్నబిడ్డలకన్నా ప్రేమగా పుంజులను పెంచేవాళ్లూ ఉన్నారు. సాధారణ కోడిపుంజులకన్నా పందెం పుంజులు ఎత్తుగా, దృఢంగా ఉంటాయి. రంగురంగుల ఈకలతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ముక్కు దృఢంగా, పొడవుగా, కాలివేళ్లు నిటారుగా కనిపిస్తాయి. వీటి కూత గంభీరంగా ఉంటుంది. కొన్ని పుంజుల దగ్గరకు వెళ్లడానికి మనుషులు కూడా జంకుతారు. పందెం కోళ్లు సుమారు 50రకాలు ఉన్నాయి. కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, పర్ల, సేతువు, పూల, పింగళి, కౌజు, నల్లమచ్చల సేతువు, ఎర్రబోరా, నల్లబోరా, పింగళి, మైల, కొక్కిరాయి, నల్ల సవల ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉన్నాయి. ప్రాంతాలను బట్టి పేర్లు మారుతుంటాయి. వీటిలో కాకి, డేగ, నెమలి పందేలకు పెట్టింది పేరు. వీటి ధరలు రూ.5వేల నుంచి లక్షల రూపాయల వరకు ఉంటాయంటే అతిశయోక్తికాదు. పూర్వ కాలంలో కోడిపందేల కోసం యుద్ధాలు జరిగినట్లు చరిత్ర చెపుతోంది. కోడిపందేల ప్రస్తావన లేకుండా పల్నాటిచరిత్ర, బొబ్బిలియుద్ధాల గురించి ప్రస్తావించలేము.
వీటి ఆహారమూ స్పెషలే..
పందెం కోళ్లకు ఇచ్చే ఆహారం కూడా ప్రత్యేకమైనదే. వీటికి సోళ్లు, సజ్జలు, మటన్ కైమా, పచ్చసొన తీసివేసిన కోడిగుడ్లు, రెవిటాల్ టాబ్లేట్లు, 18 రకాల దినుసుల లేహ్యం తినిపిస్తారు. పందెం కోడి ఇవి తిని కొవ్వు పట్టకుండా కట్టేసి ఒకేచోట నిలబెట్టడం వలన కాళ్లల్లో శక్తి దెబ్బతింటుందని నెట్ కట్టి పుంజును అటూ.. ఇటూ తిప్పుతారు. ఒక విధంగా పుంజుకు వాకింగ్ చేయిస్తారు. కొవ్వు పట్టకుండా వేడి నీళ్లపోత (వేడి నీళ్లల్లో వేప, జామ, వెదురు ఆకులు, పసుపులను కలిపి మరగపెట్టి బాలింతకు నీళ్లు పోసినట్లు) తడిసిన గుడ్డ కొడి చుట్టూ తిప్పి గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయిస్తారు. ఇలా రెండు నెలల పాటు కోళ్లను ఒక తపస్సులా పెంచుతారు. పందేనికి వారం రోజుల ముందు తేలికపాటి ఆహారం ఇస్తారు. నానబెట్టిన సోళ్లు, మెరిగలు, తవుడు, వెన్నకలిపిన మేత అందిస్తారు. చలిని తట్టుకునేందుకు బుట్ట చుట్టూ పరదాలుకట్టుతారు. పుంజు కొద్దిగా నీరసించినట్లు కనిపించినా..మెడను కదపలేక మేతను తినలేకపోయినా..తక్షణమే వైద్యం చేయిస్తారు. శుభ్రమైన నీటిని మట్టిపాత్రలోనే అందిస్తారు.
కో’ఢీ’
Published Sun, Jan 11 2015 9:00 AM | Last Updated on Sat, Aug 18 2018 4:27 PM
Advertisement