ఆగిన ఆటో
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఆటో రిక్షాకు బ్రేకులు పడ్డాయి. ఆటోసంఘాల జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి సుమారు లక్షా 20 వేల ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది.
తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరవధిక సమ్మె కొనసాగించనున్నట్లు జేఏసీ ప్రతినిధులు వెంకటేశం, నరేందర్, సత్తిరెడ్డి, కిరణ్ స్పష్టం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనందున తమ ఆందోళనను ఉధృతం చేయనున్నట్లు వారు తెలిపారు.
సమ్మెకు దూరం
బీఎంఎస్, ఆటోసంఘాల నాన్ పొలిటికల్ జేఏసీ తదితర సంఘాలు సమ్మెకు దూరంగా ఉన్నట్లు ప్రకటించాయి. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో సమ్మె అర్థరహితమని ఆ సంఘాలు పేర్కొన్నాయి.